అమృత షేర్‌గిల్. 20వ శతాబ్దపు గొప్ప చిత్రకారిణి. 1941లో 28 ఏళ్ల చిన్న వయసులో మరణించినా ఆమె చిత్రాలు ఇప్పటికీ వార్తలు సృష్టిస్తూనే ఉన్నాయి. అమ్మలక్కల కబుర్లను ‘ది స్టోరీ టెల్లర్’ పేరుతో ఆమె బొమ్మ గీస్తే ఇప్పటివరకూ భారతదేశంలో ఏ చిత్రకారుడికీ పలకనంత వెల– 61.8 కోట్లు పలికింది. ఆ చిత్రం గురించి...ఆ గొప్ప చిత్రకారిణి గురించి.
అమృత షేర్‌గిల్ తన జీవిత కాలంలో 200 లోపు చిత్రాలను గీసింది. అన్నీ కళాఖండాలే. వాటిలో చాలామటుకు ప్రఖ్యాత మ్యూజియమ్‌లలో ఉన్నాయి. కొన్ని మాత్రమే ఆమె చెల్లెలి (ఇందిర) కుమారుడు వివాన్ సుందరం, కుమార్తె నవీనల దగ్గర ఉన్నాయి. 1937లో తను గీసిన ‘ది స్టోరీ టెల్లర్’ చిత్రాన్ని అప్పటి లాహోర్‌లో మొదటిసారి ప్రదర్శనకు పెట్టింది అమృత.
అప్పటి నుంచి ఆ చిత్రం చేతులు మారుతూ తాజాగా ఢిల్లీలో జరిగిన వేలంలో 61.8 కోట్లు పలికింది. ఇప్పటివరకూ భారతీయ చిత్రకారుల ఏ పెయింటింగ్‌కూ ఇంత రేటు పలకలేదు. ఆ విధంగా చనిపొయిన ఇన్నాళ్లకు కూడా అమృత రికార్డు స్థాపించ గలిగింది. దీనికంటే ముందు గతంలో సయ్యద్ హైదర్ రజా గీసిన ‘జెస్టెషన్’ అనే చిత్రం 51.75 కోట్లకు పలికి రికార్డు స్థాపించింది. దానిని అమృత బద్దలు కొట్టింది.
రూ.61.8 కోట్లు ధర పలికిన ‘ది స్టోరీ టెల్లర్’ చిత్రం
గొప్ప చిత్రకారిణి
అమృత షేర్‌గిల్ భారతీయ సిక్కు తండ్రి ఉమ్రావ్ సింగ్‌కి, హంగేరియన్ తల్లి ఎంటొనెట్‌కు జన్మించింది. బాల్యం నుంచి గొప్ప లావణ్యరాశిగా ఉండేది. ఐదేళ్ల నుంచి బొమ్మలు గీయడం మొదలు పెట్టింది. వీరి కుటుంబం సిమ్లాలో కొంత కాలం ఉన్నా అమృత బొమ్మల్లోని గొప్పదనాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెకు 16 ఏళ్ల వయసున్నప్పుడు పారిస్‌కు తీసుకెళ్లి ఐదేళ్ల పాటు చిత్రకళలో శిక్షణ ఇప్పించారు.
ఆ తర్వాత అమృత గొప్ప చిత్రాలు గీస్తూ వెళ్లింది. అవన్నీ కూడా భారతీయ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేవే. ఇప్పుడు అత్యధిక రేటు పలికిన ‘ది స్టోరీ టెల్లర్’– పల్లెల్లో నలుగురు అమ్మలక్కలు కూచుని కబుర్లు చెప్పుకునే సన్నివేశం. ఇది కాకుండా ‘వధువు అలంకరణ’, ‘ఒంటెలు’, ‘యంగ్ బాయ్ విత్ త్రీ యాపిల్స్’, ‘జిప్సీ గర్ల్స్’, ‘యంగ్ గర్ల్స్’ ఆమె ప్రఖ్యాత చిత్రాలు. ఆమె తన సెల్ఫ్ పొర్ట్రయిట్‌ను కూడా గీసుకుంది.
అకాల మరణం
అమృత షేర్‌గిల్ తన హంగేరియన్ కజిన్ విక్టర్‌ను వివాహం చేసుకుంది. వారు లాహోర్‌లో ఉన్న సమయంలో కేవలం 28 ఏళ్ల వయసులో 1941లో మరణించింది. అందుకు కారణం కలుషిత ఆహారంతో వచ్చిన వాంతులు, విరేచనాలు అని చెప్తారు. మరో కారణం ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉందని సంప్రదాయ డాక్టర్‌గా ఉన్న విక్టర్ ఆమెకు రహస్యంగా, అశాస్త్రీయంగా అబార్షన్ చేయబోయాడని, అందువల్ల తీవ్రమైన బ్లీడింగ్ జరిగి మరణించిందని అంటారు.
ఆకర్షణాజాలం
అమృత షేర్‌గిల్ ఆ రోజుల్లో సంపన్న వర్గాల్లో గొప్ప ఆకర్షణ కలిగిన వ్యక్తిగా కీర్తి గడించింది. జవహర్‌లాల్ నెహ్రూ ఆమె స్నేహం కోసం అనేక లేఖలు రాశాడు. ఢిల్లీలో జరిగిన అమృత ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు హాజరయ్యాడు. ‘అమృత ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఉన్నవారందరూ చేష్టలుడిగి ఆమెను చూస్తూ ఉండిపొయేవారు’ అని అనేకమంది రాశారు. ‘ఆమె జీవించి ఉంటే ప్రపంచం మొత్తం ఎన్నదగిన గొప్ప చిత్రకారిణి అయి ఉండేది’ అని ఆర్ట్ క్రిటిక్స్ అంటారు.ఆమె లేదు. కాని ఆమె చిత్రాలు ఆమెను సజీవంగా ఉంచుతూనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment