‘నేను ఇల్లు దాటి బయట అడుగు వేయలేకపోవచ్చు. అయితే నేను తయారు చేసిన బొమ్మలు మాత్రం దేశదేశాలకు వెళుతున్నాయి’ ఆనందంగా అంటుంది రాధిక. ఆమె చేతిలో కాగితం కూడా కొత్త ఊపిరి పోసుకుంటుంది. పాతన్యూస్ పేపర్లతో ఆమె తయారు చేసిన బొమ్మలలో ఆత్మవిశ్వాస కళ ఉట్టిపడుతుంది. ‘చీకటిని చూసి దిగులు పడకు. అదిగో వెలుగు’ అని ఆ బొమ్మలు మౌనంగానే చెబుతుంటాయి...
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన రాధిక బోన్ డిసీజ్ వల్ల నడకకు దూరమైంది. బడి మానేయవలసి వచ్చింది. రోజంతా బెడ్ మీద కూర్చోక తప్పనిసరి పరిస్థితి. ‘ఇక ఇంతేనా!’ అనే చింత ఆమెలో మొదలైంది. తన మనసులోని బాధను పంచుకోడానికి స్నేహితులు కూడా లేరు.
కిటికీ నుంచి అవతలి ప్రపంచాన్ని చూస్తే... పిల్లలు బడికి వెళుతుంటారు... ఇలా ఎన్నో దృశ్యాలు ఆమె కంటపడేవి. తన విషయానికి వస్తే... బయటి ప్రపంచంలోకి వెళ్లడమంటే ఆస్పత్రికి వెళ్లడమే.
తనలో తాను మౌనంగా కుమిలిపోతున్న సమయంలో ‘ఆర్ట్’ అనేది ఆత్మీయనేస్తమై పలకరించింది. పద్నాలుగేళ్ల వయసులో డ్రాయింగ్, పెయింటింగ్ మొదలుపెట్టింది. ఆర్ట్‌పై సోదరి ఆసక్తిని గమనించిన రాజ్‌మోహన్ పాత న్యూస్‌పేపర్లు, మెటల్ వైర్లతో ఆఫ్రికన్ బొమ్మలు తయారు చేసే యూట్యూబ్ వీడియోలను చూపెట్టాడు. అవి చూసిన తరువాత రాధికకు తనకు కూడా అలా తయారు చేయాలనిపించింది.
పాత న్యూస్‌పేపర్‌ల నుంచి నవదంపతులు, సంగీతకారులు, వైద్యులు, దేవతలు... ఇలా రకరకాల బొమ్మలు తయారు చేసింది.
పొరుగింటి వ్యక్తికి రాధిక తయారు చేసిన బొమ్మ బాగా నచ్చి కొనుగోలు చేసింది. అది తన ఫస్ట్ సేల్.
ఆ సమయంలో రాధికకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది.
రాజ్‌మోహన్ స్నేహితుడు రాధిక తయారు చేసిన అయిదు బొమ్మలను తన షాప్‌లో పెడితే మంచి స్పందన వచ్చింది. ఆ తరువాత మరికొన్ని బొమ్మలు కొన్నాడు.
వారం వ్యవధిలో 25 బొమ్మలను అమ్మాడు.
సోషల్ మీడియా ద్వారా రాధిక బొమ్మల వ్యాపారం ఊపు అందుకుంది. ఊటీకి చెందిన ఒక హోటల్ యజమాని 25 బొమ్మలకు ఆర్డర్ ఇచ్చాడు. ఊటీలోని ఆ హోటల్‌ను తాను తయారుచేసిన బొమ్మలతో అలంకరించడం రాధికకు సంతోషం కలిగించింది.
తన బొమ్మల గురించి ప్రచారం చేయడానికి పైసా ఖర్చు చేయకపోయినా సోషల్‌మీడియాలోని పోస్ట్‌ల వల్ల ఆర్డర్లు వెల్లువెత్తాయి.
మూడువేలకు పైగా బొమ్మలు తయారు చేసిన రాధిక...
‘బొమ్మలకు ప్రాణం పోస్తుంటే నన్ను నేను మరిచిపోతాను. కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది. టైమే తెలియదు. బొమ్మలు చేస్తున్నప్పుడు ఎంతో ఏకాగ్రత కావాలి. ఆసక్తి ఉన్నచోట సహజంగానే ఏకాగ్రత ఉంటుంది’ అంటుంది. రాధిక ఇప్పుడు ఆర్టిస్ట్ మాత్రమే కాదు. మోటివేషనల్ స్పీకర్ కూడా. తన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తోంది. ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment