Bone diseases
-
కాగితానికి కొత్త ఊపిరి
‘నేను ఇల్లు దాటి బయట అడుగు వేయలేకపోవచ్చు. అయితే నేను తయారు చేసిన బొమ్మలు మాత్రం దేశదేశాలకు వెళుతున్నాయి’ ఆనందంగా అంటుంది రాధిక. ఆమె చేతిలో కాగితం కూడా కొత్త ఊపిరి పోసుకుంటుంది. పాతన్యూస్ పేపర్లతో ఆమె తయారు చేసిన బొమ్మలలో ఆత్మవిశ్వాస కళ ఉట్టిపడుతుంది. ‘చీకటిని చూసి దిగులు పడకు. అదిగో వెలుగు’ అని ఆ బొమ్మలు మౌనంగానే చెబుతుంటాయి... తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన రాధిక బోన్ డిసీజ్ వల్ల నడకకు దూరమైంది. బడి మానేయవలసి వచ్చింది. రోజంతా బెడ్ మీద కూర్చోక తప్పనిసరి పరిస్థితి. ‘ఇక ఇంతేనా!’ అనే చింత ఆమెలో మొదలైంది. తన మనసులోని బాధను పంచుకోడానికి స్నేహితులు కూడా లేరు. కిటికీ నుంచి అవతలి ప్రపంచాన్ని చూస్తే... పిల్లలు బడికి వెళుతుంటారు... ఇలా ఎన్నో దృశ్యాలు ఆమె కంటపడేవి. తన విషయానికి వస్తే... బయటి ప్రపంచంలోకి వెళ్లడమంటే ఆస్పత్రికి వెళ్లడమే. తనలో తాను మౌనంగా కుమిలిపోతున్న సమయంలో ‘ఆర్ట్’ అనేది ఆత్మీయనేస్తమై పలకరించింది. పద్నాలుగేళ్ల వయసులో డ్రాయింగ్, పెయింటింగ్ మొదలుపెట్టింది. ఆర్ట్‌పై సోదరి ఆసక్తిని గమనించిన రాజ్‌మోహన్ పాత న్యూస్‌పేపర్లు, మెటల్ వైర్లతో ఆఫ్రికన్ బొమ్మలు తయారు చేసే యూట్యూబ్ వీడియోలను చూపెట్టాడు. అవి చూసిన తరువాత రాధికకు తనకు కూడా అలా తయారు చేయాలనిపించింది. పాత న్యూస్పేపర్ల నుంచి నవదంపతులు, సంగీతకారులు, వైద్యులు, దేవతలు... ఇలా రకరకాల బొమ్మలు తయారు చేసింది. పొరుగింటి వ్యక్తికి రాధిక తయారు చేసిన బొమ్మ బాగా నచ్చి కొనుగోలు చేసింది. అది తన ఫస్ట్ సేల్. ఆ సమయంలో రాధికకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. రాజ్‌మోహన్ స్నేహితుడు రాధిక తయారు చేసిన అయిదు బొమ్మలను తన షాప్‌లో పెడితే మంచి స్పందన వచ్చింది. ఆ తరువాత మరికొన్ని బొమ్మలు కొన్నాడు. వారం వ్యవధిలో 25 బొమ్మలను అమ్మాడు. సోషల్ మీడియా ద్వారా రాధిక బొమ్మల వ్యాపారం ఊపు అందుకుంది. ఊటీకి చెందిన ఒక హోటల్ యజమాని 25 బొమ్మలకు ఆర్డర్ ఇచ్చాడు. ఊటీలోని ఆ హోటల్‌ను తాను తయారుచేసిన బొమ్మలతో అలంకరించడం రాధికకు సంతోషం కలిగించింది. తన బొమ్మల గురించి ప్రచారం చేయడానికి పైసా ఖర్చు చేయకపోయినా సోషల్‌మీడియాలోని పోస్ట్‌ల వల్ల ఆర్డర్లు వెల్లువెత్తాయి. మూడువేలకు పైగా బొమ్మలు తయారు చేసిన రాధిక... ‘బొమ్మలకు ప్రాణం పోస్తుంటే నన్ను నేను మరిచిపోతాను. కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది. టైమే తెలియదు. బొమ్మలు చేస్తున్నప్పుడు ఎంతో ఏకాగ్రత కావాలి. ఆసక్తి ఉన్నచోట సహజంగానే ఏకాగ్రత ఉంటుంది’ అంటుంది. రాధిక ఇప్పుడు ఆర్టిస్ట్ మాత్రమే కాదు. మోటివేషనల్ స్పీకర్ కూడా. తన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తోంది. ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తోంది. -
కోవిడ్ సోకితే అవయవాలు దెబ్బతినడమే కాదు ఎముకలు సైతం!
న్యూఢిల్లీ: కోవిడ్–19(సార్స్–కోవ్–2) వైరస్ సోకితే శరీరంలో అవయవాలు దెబ్బతినడమే కాదు ఎముకలు సైతం కొంత అరిగిపోతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ పరిశోధనలో తేలింది. కరోనా బారినపడి చికిత్స పొందుతున్నప్పుడు, తర్వాత కోలుకుంటున్న సమయంలో కూడా ఎముకల క్షయాన్ని గుర్తించారు. కరోనా వైరస్ సోకిన ఎలుకలపై (సిరియన్ హామ్స్టర్స్) పరిశోధన చేసి, ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ ఫలితాలను నేచరల్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించారు. కరోనా బారినపడిన ఎలుకల్లోని ఎముకల ధృఢత్వాన్ని త్రీ–డైమెన్షనల్ మైక్రో కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ స్కాన్ ద్వారా విశ్లేషించారు. ఆయా ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫేట్ కొంత క్షీణించిందని పరి శోధకులు చెప్పారు. ఎముకలు 20 నుంచి 50 శాతం దాకా క్షయానికి గురైనట్లు తెలిపారు. చదవండి👇 మంకీపాక్స్: 20 దేశాల్లో 200 కేసులు.. కమ్యూనిటీ స్ప్రెడ్ చెందొచ్చు, కానీ..-డబ్ల్యూహెచ్‌వో మహిళా సీఈవోలకు జీతం పెరిగింది కానీ.. -
Health: సన్నగా, ఎత్తుగా ఉండి.. వేళ్లు పొడుగ్గా పెరుగుతున్నాయా? అయితే!
Marfan Syndrome Symptoms &Treatment: మార్ఫన్ సిండ్రోమ్ అనేది వేర్వేరు అవయవాలకు సంబంధించి∙అనేక లక్షణాలను కనబరిచే ఒక వ్యాధి. ఇది పుట్టుకతో వచ్చే జన్యుపరమైన జబ్బు. దీని లక్షణాలు కూడా విలక్షణంగా ఉంటాయి. ఇందులో కండరాలకు, రక్తనాళాలకు వెన్నుదన్ను (సపోర్ట్)గా ఉండే కనెక్టివ్ టిష్యూ దెబ్బతినడం వల్ల వాటికి బలం లోపిస్తుంది. కొందరిలో... మరీ ముఖ్యంగా గర్భిణుల రక్తనాళాలను ప్రభావితం చేసి గుండెను ప్రభావితం చేయవచ్చు. మరికొందరిలో కళ్లు, ఎముకలను కూడా దెబ్బతీయవచ్చు. లక్షణాలు 👉🏾మార్ఫన్ సిండ్రోమ్‌కు గురైన వారు చాలా సన్నగా, ఎత్తుగా ఉంటారు. ఆ సౌష్ఠవంలోనే ఏదో లోపం ఉందనిపించేలా ఎత్తు పెరుగుతారు. కాళ్లూ, చేతులు, వేళ్లూ, కాలివేళ్లూ అన్నీ సాధారణం కంటే పొడుగ్గా ఉంటాయి. 👉🏾వేళ్లు పొడుగ్గా పెరుగుతాయనడానికి ఓ నిదర్శనం ఏమిటంటే... మన బొటనవేలిని అరచేతిలో ఉంచి ముడిచినప్పుడు అది సాధారణంగా అరచేతిలో లోపలే ఉంటుంది. కానీ ఈ జబ్బు ఉన్నవారిలో అరచేయి మూసినప్పుడు బొనటవేలు... పిడికిలి దాటి బయటకు కనిపిస్తుంది. 👉🏾ఎదుర్రొమ్ము ఎముకలు బయటకు పొడుచుకు వచ్చినట్లు కనిపిస్తాయి. 👉🏾మరొకొందరిలో లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండవచ్చు. 👉🏾పలువరస చక్కగా, తిన్నగా లేకుండా పళ్లన్నీ గుంపులు గుంపులా ఉన్నట్లుగా వస్తాయి. 👉🏾దగ్గరివి మాత్రమే కనిపించడం, దూరం చూపు అంతగా స్పష్టంగా లేకపోవడం ఉంటుంది. 👉🏾మనందరిలోనూ పాదాలు కొద్దిగా ఒంపు తిరిగి ఆర్చి మాదిరిగా ఉంటాయి. 👉🏾కానీ మార్ఫన్ సిండ్రోమ్ ఉన్నవారి పాదాలు ఫ్లాట్‌గా ఉంటాయి. 👉🏾గుండెసమస్యలు తలెత్తుతుంటాయి. 👉🏾మరీ ముఖ్యంగా గర్భవతుల్లో ఈ సమస్యలు రావచ్చు. గుండె, రక్తనాళాలకు సంబంధించిన సమస్య ఇలా... గుండెకు సంబంధించిన కీలక ధమని అయోర్టా అనే పెద్ద రక్తనాళం ఉంటుంది. దీని ద్వారానే అన్ని భాగాలకు మంచి రక్తం అందుతుంది. రక్తం అందించే ప్రతి రక్తనాళంలోనూ లోపలివైపున ఇంటిమా అనే పొర, మధ్యపొరగా మీడియా, బయటిపోరగా అడ్వెంటీషియా అనే మూడు పొరలుంటాయి. రక్తప్రసరణ సాఫీగా, సక్రమంగా జరిగిలా చూసేందుకు ఇంటిమా తోడ్పడుతుంది. ఇక మధ్యపొర అయిన మీడియా, బయటి పొర అడ్వెంటీషియాలు బలంగా ఉండేందుకు రక్తనాళం గోడల్లో ఉండే కొలాజెన్, ఎలాస్టిక్ అనే ఫైబర్లు రక్తనాళానికి సపోర్ట్ చేస్తుంటాయి. ఈ ఫైబర్లే రక్తం ఒత్తిడి పెరిగినా... వేగం పెరిగినా... రక్తనాళానికి సాగే గుణాన్ని, ఆ ఒత్తిడిని తట్టుకునే గుణాన్ని ఇస్తాయి. కొందరిలో మార్ఫన్ సిండ్రోమ్ కారణంగా... పుట్టుకతోనే కొలాజెన్ తక్కువగా ఉంటుంది. వారు పెరుగుతున్న కొద్దీ ఉన్న కొద్దిపాటి కొలాజెన్ కాస్తా తగ్గిపోతూ ఉంటుంది. దాంతో రక్తనాళం బలహీనమవుతుంది. ఒక్కోసారి అది వాచిపోయి, దాని పరిమాణం పెరుగుతుంది. దాంతో ఛాతీ నొప్పి, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యను అశ్రద్ధ చేస్తే రక్తనాళం పగలడం లేదా రక్తనాళాల గోడలు చీలే అవకాశం ఉంది. అయోర్టా మాత్రమే కాకుండా... మైట్రల్ వాల్వ్‌కు సంబంధించిన సమస్యలు కూడా మార్ఫన్ సిండ్రోమ్‌లో తలెత్తవచ్చు. అంతేకాదు... కిడ్నీలకు రక్తసరఫరా ఆగిపోయి అవి దెబ్బతింటాయి. మెదడుకు రక్తసరఫరా తగ్గి పక్షవాతం వస్తుంది. ఇలా దాదాపు అన్ని అవయవాలూ దెబ్బతిని మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కి దారితీసే ప్రమాదం ఉంది. చికిత్స ఎలా? ఇది పుట్టుకతో వచ్చే జన్యుసంబంధమైన వ్యాధి కావడంతో... వ్యాధి మొత్తానికి ఒకేవిధమైన చికిత్స ఉండదు. దీనితో ఏ అవయవం ప్రభావితమైతే... ఆ అవయవానికి సంబంధించిన చికిత్స అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకు అయోర్టా ప్రభావితం అయినప్పుడు, అవసరమైన కొందరిలో ‘బెంటాల్స్ ప్రొసిజర్’ అనే అత్యవసర శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉంటుంది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు చాలా తరచుగా కనిపిస్తుంటాయి. ఉదాహరణకు ఈ బాధితుల్లో సగం మందికి పైగా వారి కళ్లలోని లెన్స్ జారిపోతుంది. అలాగే కాటరాక్ట్, గ్లకోమా వంటివి చాలా చిన్నవయసులోనే, చాలా ముందుగా వస్తుంటాయి. రెటీనా సమస్యలూ ఉంటాయి. ఈ వైవిధ్యమైన లక్షణాలూ, ప్రభావాలు ఉన్నందున... బాధితుల సమస్యకు అనుగుణంగా చికిత్స అవసరమవుతుంది. చదవండి👇 Gynecology: పిల్లలు కాకుండా ఆపరేషన్.. శారీరకంగా, మానసికంగా కోలుకున్న తర్వాతే.. Healthy Heart Diet: 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు, బచ్చలి కూర తిన్నారంటే! -
Science Facts: మోచేతికి ఏదైనా తగిలితే అందుకే షాక్ కొట్టినట్టు ‘జిల్’ మంటుంది..!
Cubital Tunnel Syndrome: వాస్తవంగా చెప్పాలంటే ఈ సమస్య మనందరికీ తెలిసిందే. చిన్నతనంలో మనమందరమూ అనుభవించిందే. మన తోటి సావాసగాళ్లలో ఉండే ఏ చిలిపి పిల్లలో, లేదా అనుకోకుండా ఎవరైనా ఇతరులో మన మోచేతి దగ్గర ఉండే బొడిపెలాంటి ఎముకను ఠక్కున తాకినప్పుడు క్షణకాలం పాటు మోచేతి నుంచి అరచేతివరకూ ‘జిల్లు’మంటుంది. ముంజేయంతా స్పర్శ కోల్పోయినట్లుగా అవుతుంది. కాసేపటి తర్వాత అదే సర్దుకుని మామూలవుతుంది. అలా కాసేపు మనల్ని అల్లాడించే తిమ్మిరిలాంటి ఈ నొప్పి/బాధకు ‘ఫన్నీ బోన్ పెయిన్’ అన్న పేరుందని మనలో చాలామందికి తెలియదు. ఎందుకీ సమస్య? మోచేతి దగ్గర బొడిపెలా ఉన్న ఎముక పక్కనుంచి ఓ నరం వెళ్తుంటుంది. అది మెదడు నుంచి మొదలై మోచేతి ఎముక దగ్గరనుంచి చేతి వేళ్లలోకి వెళ్లే సర్వైకల్ నరాల్లో ఒకటైన అల్నార్ నర్వ్ అనే నరం. అకస్మాత్తుగా అక్కడ దెబ్బ తగలగానే ఠక్కున మెదడు సిగ్నళ్లు మోచేతి నుంచి అరచేతిలోకి పాకడం వల్ల ఈ ‘ఫన్నీ బోన్ పెయిన్’ కనిపిస్తుంది. అందరిలోనూ క్షణకాలం పాటు ఉన్నప్పటికీ కొందరిలో ఇది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. అంటే వాళ్లలో ఇదే తరహా నొప్పి/తిమ్మిరి/స్పర్శ లేకపోవడం అన్న కండిషన్ అదేపనిగా కొనసాగుతుంది. ఇలా జరగడానికి కారణం క్షణకాలం పాటు కాకుండా అక్కడి నరం పూర్తిగా నొక్కుకుపోవడమే. కారణాలు... ఇలా జరగడానికి చాలా కారణాలే ఉంటాయి. ఉదాహరణకు తమ పనుల్లో భాగంగా అదేపనిగా మోచేతిని బల్లమీద ఎప్పుడూ అనించి ఉంచడమూ లేదా నిద్రపోయే సమయంలో ముంజేతిని మడతేసి, దాన్నే తలగడలా భావిస్తూ తల బరువును పూర్తిగా దానిపైనే మోపి నిద్రపోతూ ఉండటం కొందరికి అలవాటు. ఇలా చేసేవాళ్లలో ‘అల్నార్’నరం నొక్కుకుపోతుంది. దాంతో మనమంతా చిన్నప్పుడు తాత్కాలికంగా అనుభవించిన బాధ అదేపనిగా వస్తూనే ఉంటుంది. తగ్గేదెలా? మోచేతులు మడత వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే కొందరిలో ఈ సమస్య దానంతట అదే తగ్గుతుంది. ఇక మరికొందరిలో బ్రేసెస్, స్ల్పింట్స్ వంటి ఉపకరణాల సహాయంతో నరంపై బరువు పడకుండా చూడటంతో పాటు కొన్ని రకాల వ్యాయామాలతో నొప్పి తగ్గుతుంది. ఇలాంటి సాధారణ పెయిన్ మేనేజ్మెంట్ ప్రక్రియలు పనిచేయనప్పుడు కొందరిలో శస్త్రచికిత్స చేసి ‘అల్నార్ నర్వ్’పై పడే ఒత్తిడిని తొలగించాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సర్జరీ చాలా అరుదుగా, చాలా తక్కువ మందికే అవసరమవుతుంది. చదవండి: Worlds Most Dangerous Foods: అత్యంత విషపూరితమైన వంటకాలు.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తింటారట!! -
Foods For Bone Health: అరటి, పాలకూర, డ్రై ఫ్రూట్స్, చేపలు, బొప్పాయి.. ఇవి తింటే..
ఈ రోజుల్లో బ్యాక్ పెయిన్, ఎముకలు, కండరాల సంబంధిత సమస్యలు.. వృద్ధులకు మాత్రమేకాకుండా అన్ని వయసుల వాళ్లు ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే తక్షణం కాల్షియం తీసుకోవడం ప్రధమ సలహా. అయితే, ఎముకల ఆరోగ్యం మెరుగుపరచడానికి కేవలం కాల్షియం మాత్రమే సరిపోదు. ప్రొటీన్లు, విటమిన్ ‘డి’లు కూడా బలమైన ఎముకల నిర్మాణానికి తోడ్పడతాయి. ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ అంజు సూద్ ఎముకలకు పుష్టిని చేకూర్చే ఆహారాలను సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. అరటి పండు జీర్ణ ప్రక్రియలో అరటి పండు పాత్ర ఎంతో కీలకం. దీనిలో మాగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకలు, దంతాల నిర్మాణంలో విటమిన్లు, ఇతర మినరల్స్ చాలా ముఖ్యం. ప్రతి రోజూ ఒక అరటి పండు తినడం మూలంగా ఎముకలకు అవసరమైన బలం చేకూర్చడమేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. పాలకూర కాల్షియం అధికంగా ఉండే ఆకు పచ్చ కూరలు తినడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా, పుష్టిగా తయారవుతాయి. కప్పు ఉడికించిన పాలకూరలో ప్రతిరోజూ శరీరానికి అవసరమయ్యే 25 శాతం వరకు కాల్షియం అందుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. ఫైబర్ అధికంగా ఉండే పాలకూరలో విటమిన్ ‘ఎ’, ఐరన్ స్థాయిలు కూడా నిండుగానే ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ వీటిలో కాల్షియంతోపాటు, మాగ్నిషియం, పొటాషియం కూడా ఎముకల ఆరోగ్యానికి అవసరమే. ఎముకలు కాల్షియంను పీల్చుకోవడానికి, నిల్వ ఉండటానికి మాగ్నిషియం ఎంతో సహాయపడుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. మీ శరీరంలోని మొత్తం పొటాషియంలో కేవలం దంతాలు, ఎముకలు 85% ఉపయోగించుకుంటాయని వెల్లడించింది. పాల ఉత్పత్తులు ఎముకల ఆరోగ్యం ప్రస్థావన వచ్చినప్పుడు ఖచ్చితంగా పాలు, పెరుగు, వెన్నవంటి పాల ఉత్పత్తుల ప్రాముఖ్యం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం కప్పు పాలు, పెరుగు రోజూ తీసుకుంటే సరిపడినంత కాల్షియం అందుతుందని పేర్కొంది. ఆరెంజ్ పండ్లు తాజా ఆరెంజ్ జ్యూస్ చాలా మంది ఇష్టంగా తాగుతారు. దీనిలో పోషకాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. దీనిలోని కాల్షియం, విటమిన్ ‘డి’ ఎముకలకు బలం చేకూర్చడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. క్రమంతప్పకుండా ఆరెంజ్ పండ్లు తింటే.. ముఖ్యంగా ఆస్టియోపొరాసిస్ అనే ఎముకల వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. బొప్పాయి దీనిలో కూడా కాల్షియం స్థాయిలు అధికంగానే ఉంటాయి. 100 గ్రాముల బొప్పాయి ముక్కలు తింటే 20 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుందని నిపుణులు చెబుతున్నారు. చేపలు చేపల్లో ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎముకల పుష్టికి ఎంతో ఉపయోగపడతాయి. కొవ్వు అధికంగా ఉండే చేపలు ఫ్రై, కర్రీ, గ్రిల్.. ఏవిధంగా తీసుకున్నా పోషకాలు అందుతాయి. సాధారణంగా 35 ఏళ్ల వరకు మాత్రమే ఎముకల అభివృద్ధి జరుగుతుంది. ఆ తర్వాత ఎముకలు అరగడం లేదా క్షీణించడం మొదలవుతుంది. అందువల్ల ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరచుకుని, పోషకాహారాన్ని క్రమంతప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: ఎంత క్యూట్‌గా రిలాక్స్ అవుతుందో .. నిన్ను చూస్తుంటే అసూయగా ఉంది! -
ప్రతిదానికీ పుటుక్కుమంటాయ్
సాక్షి, హైదరాబాద్: చిన్నచిన్న దెబ్బలకే ఎముకలు పుటుక్కుమని విరిగిపోతున్నాయా? అయితే.. అలర్ట్ కావాల్సిందే.. ఎందుకంటే.. మీ ఎముకలు గుళ్లబారిపోవడమే దానికి కారణం కావొచ్చు. ఇప్పుడు దేశంలో 80 శాతం మహిళలు, 20 శాతం పురుషుల్లో కనిపిస్తున్న ఈ బోలు వ్యాధి (ఆస్టియో పొరోసిస్) అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో 50–60 ఏళ్లల్లో కనిపించే బోలు వ్యాధి ఇప్పుడు 30 ఏళ్ల వారిలోనూ ఉండటం గమనార్హం. సూర్యరశ్మి తగలకపోవడం, జంక్‌ఫుడ్ అధికంగా తీసుకోవడం, విటమిన్ ‘డి’కొరత, స్టెరాయిడ్స్ వాడటం తదితర కారణాలతో ఇది వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నందున ఏటా అక్టోబర్ 20న బోలు వ్యాధి నివారణ దినాన్ని జరుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వ్యాధి ఉధృతి నేపథ్యంలో బోలు వ్యాధి ఎలా వస్తుంది, లక్షణాలు, చికిత్స, జాగ్రత్తలపై యశోద ఆసుపత్రి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ టి.దశరథ రామారెడ్డి సహకారంతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 30 ఏళ్ల వారికీ వస్తుంది.. గతంలో 50 నుంచి 60 ఏళ్ల వారిలో బోలు వ్యాధి వచ్చేది. ఇప్పుడు 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోంది. జీవనశైలిలో మార్పుల కారణంగా ఇప్పుడు తక్కువ వయస్సు వారిలోనూ కనిపిస్తోంది. ఎముకలకు సంబంధించి వస్తున్న రోగుల్లో 10 శాతం మంది బోలు వ్యాధికి గురవుతున్నట్లు అంచనా. తల్లిదండ్రులకు ఈ వ్యాధి సంక్రమిస్తే పిల్లలకు జన్యుపరమైన కారణాలతో వచ్చే అవకాశముంది. 35 ఏళ్ల దాటిన తర్వాత శరీరంలో కాల్షియం స్వీకరణ తక్కువై, బయటకు వెళ్లేది ఎక్కువవుతుంది. దీనివల్ల కాల్షియం కొరత ఏర్పడి.. సమతుల్యత దెబ్బతిని వ్యాధి మరింత విస్త్రృతమవుతుంది. దేశంలో 80 శాతం మహిళలు, 20 శాతం పురుషులు బోలు వ్యాధితో బాధపడుతుంటే, అమెరికాలో 44 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. తీవ్రమైతే ఆపరేషన్ ఇలా.. వైద్యుల సూచనల మేరకు వ్యాధి తీవ్రతను బట్టి మూడేళ్ల వరకు మందులు వాడాలి. వ్యాధి తీవ్రమై ఎముకలు విరిగితే సాధారణ ప్లేట్స్, స్క్రూలను ఎముక పట్టుకునే పరిస్థితి ఉండదు. అవి బయటకు వచ్చేస్తాయి. వీటికి ప్రత్యేకమైన వైద్య పరికరాలు వాడాలి. లాకింగ్ ప్లేట్లు, లాకింగ్ స్క్రూలు వాడాలి. వెన్నుపూసకు వెడ్జ్ ఫ్రాక్చర్స్ అయితే ‘వెర్టిబ్రోఫ్లాస్టీ’అనే విధానంతో బోను సిమెంటును వెన్నుపూసలోకి పంపించి ఫ్రాక్చర్స్‌కు వైద్యం చేయాలి. వెన్నుపూసకు పెద్ద ఫ్రాక్చర్ అయినప్పుడు లేదా గూని వచ్చినప్పుడు కెఫోఫ్లాస్టీ అనే విధానంతో వైద్యం చేయాలి. ఒక్కోసారి వెన్నుపూస పూర్తిగా ఛిద్రమై వెన్నుపూసపై ఒత్తిడి వచ్చినప్పుడు స్క్రూలు, రాడ్లు వేసి రెండు వెన్నుపూసల మధ్య కేజింగ్ పెట్టి ఆపరేషన్ చేయాలి. ఇవీ లక్షణాలు ఉదర సంబంధమైన వ్యాధులు ఉన్న వారిలో బోలు వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, చిన్న వయసులోనే గర్భసంచి ఆపరేషన్ చేయించుకోవడం, కేన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపి చేయించడం, బక్కపలుచగా ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారిలోనూ బోలు వ్యాధి కనిపిస్తుంది. బోలు వ్యాధి ఉంటే తుంటి ఎముక, వెన్నుపూస, మణికట్టులు చిన్నచిన్న దెబ్బలకే విరిగిపోతుంటాయి. గతుకుల రోడ్లలో వేగంగా వెళ్లడం, సడన్‌గా బ్రేక్ వేసినప్పుడు ఎముకలు విరిగిపోతుంటాయి. సాధారణ ఎక్స్‌రేలోనూ ఒక్కోసారి బోలు వ్యాధి బయటపడుతుంది. డెక్సా స్కాన్ తీశాక అందులో టీస్కోర్ను బట్టి వ్యాధిని నిర్ధారిస్తారు. టీ స్కోరు మైనస్ ఒకటి నుంచి మైనస్ 2.5 వరకు ఉంటే బోలు వ్యాధిగా పరిగణిస్తారు. కొంతమందిలో మైనస్ 4 వరకు కూడా ఉంటుంది. అపుడు వ్యాధి తీవ్రంగా ఉన్నట్లు పరిగణిస్తారు. సున్నా నుంచి మైనస్ ఒకటి వరకు ఉంటే ఆస్టియో పీనియా అంటారు. అది బోలు వ్యాధికి ముందటి దశ. తీసుకోవాల్సిన జాగ్రత్తలు జీవనశైలిని మార్చుకోవడం సూర్యరశ్మి తగిలేలా చూడటం ఏసీలు వాడటం తగ్గించాలి పొగ, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వ్యాయామం చేయడం. ఊబకాయాన్ని తగ్గించుకోవడం. బక్కగా ఉండేవారు బలమైన ఆహారం తీసుకోవడం పాలు, పెరుగు, మాంసకృతులు గల ఆహారం తీసుకోవడం విటమిన్ ‘డి’ఉండే ఆహారం, కాల్షియం మాత్రలు వాడటం బోలు వ్యాధితో బాధపడే వయసు మళ్లినవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచం పక్కన బెల్ ఉంచుకోవాలి. ఎవరి సాయం లేకుండా కదలకూడదు. వాకర్స్ సాయంతో తిరగాలి. బాత్రూం వద్ద కూడా సపోర్టర్స్ ఉండాలి. సిలికాన్ హిప్ ప్రొటెక్టర్స్ ఉపయోగించాలి. -
మహిళలకే కాదు.. మగవాళ్లకు కూడా..
ఎముకలకు సంబంధించిన వ్యాధుల రావడం మహిళల్లో సర్వసాధారణం. ముఖ్యంగా ఎముకలు గుల్లగా మారే (ఆస్టియోపోరోసిస్) వ్యాధి మహిళలకంటే 60 సంవత్సరాలు దాటిన పురుషులనే ఎక్కువగా ఇబ్బందికి గురిచేస్తుందని వైద్యనిపుణులు వెల్లడించారు. గతంలో ఎక్కువ శాతం మంది మహిళలు ఈ వ్యాధికి గురవుతూ ఉండేవారని.. అయితే తాజా గణాంకాలను పరిశీలిస్తే పురుషుల్లో ఎక్కువ మంది ఈ వ్యాధి పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యాధితో బాధపడే వారిలో 60 సంవత్సరాలు దాటిన పురుషులే ఎక్కువ మంది ఉన్నారని షాలీమార్ భాగ్ లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన హేమంత్ గోపాల్ తెలిపారు. సాధారణంగా ఈ వ్యాధి 15 నుంచి 25 సంవత్సరాల లోపే సోకుతుందని.. అయితే శారీరకంగా పటిష్టంగా ఉండటం కారణంగా ఎలాంటి ఇబ్బందులు కనిపించవు. అయితే వయస్సు మీద పడిన తర్వాత ఈ వ్యాధి స్పష్టమైన ప్రభావం చూపుతుందన్నారు. ఎముకలు పలచగా కావడం, కాల్షియం లోపించడంతో నడుము, మోకాళ్లు, భుజాల్లో ఉండే ఎముకలు విరిగిపోవడం ఆస్టియోపోరోసిస్ లక్షణం అని వైద్యులు వెల్లడించారు. గుండెకు సంబంధించిన వ్యాధి తర్వాత ప్రపంచంలో ఎక్కువ మంది ఆస్టియోపోరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు 3.6 కోట్ల మంది ఉన్నారని పరిశోధనలో తెలింది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు స్టెరాయిడ్స్ వాడకాన్ని తగ్గించాలని వైద్యులు సూచించారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి ఎముకలు విరిగాయనే సంగతి ఖచ్చితంగా తెలియదు. అందుకోసం 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఎముకల వైద్యుడిన సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు.