సాక్షి, హైదరాబాద్: చిన్నచిన్న దెబ్బలకే ఎముకలు పుటుక్కుమని విరిగిపోతున్నాయా? అయితే.. అలర్ట్ కావాల్సిందే.. ఎందుకంటే.. మీ ఎముకలు గుళ్లబారిపోవడమే దానికి కారణం కావొచ్చు. ఇప్పుడు దేశంలో 80 శాతం మహిళలు, 20 శాతం పురుషుల్లో కనిపిస్తున్న ఈ బోలు వ్యాధి (ఆస్టియో పొరోసిస్) అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో 50–60 ఏళ్లల్లో కనిపించే బోలు వ్యాధి ఇప్పుడు 30 ఏళ్ల వారిలోనూ ఉండటం గమనార్హం. సూర్యరశ్మి తగలకపోవడం, జంక్‌ఫుడ్ అధికంగా తీసుకోవడం, విటమిన్ ‘డి’కొరత, స్టెరాయిడ్స్ వాడటం తదితర కారణాలతో ఇది వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నందున ఏటా అక్టోబర్ 20న బోలు వ్యాధి నివారణ దినాన్ని జరుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వ్యాధి ఉధృతి నేపథ్యంలో బోలు వ్యాధి ఎలా వస్తుంది, లక్షణాలు, చికిత్స, జాగ్రత్తలపై యశోద ఆసుపత్రి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ టి.దశరథ రామారెడ్డి సహకారంతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
30 ఏళ్ల వారికీ వస్తుంది..
గతంలో 50 నుంచి 60 ఏళ్ల వారిలో బోలు వ్యాధి వచ్చేది. ఇప్పుడు 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోంది. జీవనశైలిలో మార్పుల కారణంగా ఇప్పుడు తక్కువ వయస్సు వారిలోనూ కనిపిస్తోంది. ఎముకలకు సంబంధించి వస్తున్న రోగుల్లో 10 శాతం మంది బోలు వ్యాధికి గురవుతున్నట్లు అంచనా. తల్లిదండ్రులకు ఈ వ్యాధి సంక్రమిస్తే పిల్లలకు జన్యుపరమైన కారణాలతో వచ్చే అవకాశముంది. 35 ఏళ్ల దాటిన తర్వాత శరీరంలో కాల్షియం స్వీకరణ తక్కువై, బయటకు వెళ్లేది ఎక్కువవుతుంది. దీనివల్ల కాల్షియం కొరత ఏర్పడి.. సమతుల్యత దెబ్బతిని వ్యాధి మరింత విస్త్రృతమవుతుంది. దేశంలో 80 శాతం మహిళలు, 20 శాతం పురుషులు బోలు వ్యాధితో బాధపడుతుంటే, అమెరికాలో 44 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.
తీవ్రమైతే ఆపరేషన్ ఇలా..
వైద్యుల సూచనల మేరకు వ్యాధి తీవ్రతను బట్టి మూడేళ్ల వరకు మందులు వాడాలి. వ్యాధి తీవ్రమై ఎముకలు విరిగితే సాధారణ ప్లేట్స్, స్క్రూలను ఎముక పట్టుకునే పరిస్థితి ఉండదు. అవి బయటకు వచ్చేస్తాయి. వీటికి ప్రత్యేకమైన వైద్య పరికరాలు వాడాలి. లాకింగ్ ప్లేట్లు, లాకింగ్ స్క్రూలు వాడాలి. వెన్నుపూసకు వెడ్జ్ ఫ్రాక్చర్స్ అయితే ‘వెర్టిబ్రోఫ్లాస్టీ’అనే విధానంతో బోను సిమెంటును వెన్నుపూసలోకి పంపించి ఫ్రాక్చర్స్‌కు వైద్యం చేయాలి. వెన్నుపూసకు పెద్ద ఫ్రాక్చర్ అయినప్పుడు లేదా గూని వచ్చినప్పుడు కెఫోఫ్లాస్టీ అనే విధానంతో వైద్యం చేయాలి. ఒక్కోసారి వెన్నుపూస పూర్తిగా ఛిద్రమై వెన్నుపూసపై ఒత్తిడి వచ్చినప్పుడు స్క్రూలు, రాడ్లు వేసి రెండు వెన్నుపూసల మధ్య కేజింగ్ పెట్టి ఆపరేషన్ చేయాలి.
ఇవీ లక్షణాలు
ఉదర సంబంధమైన వ్యాధులు ఉన్న వారిలో బోలు వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, చిన్న వయసులోనే గర్భసంచి ఆపరేషన్ చేయించుకోవడం, కేన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపి చేయించడం, బక్కపలుచగా ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారిలోనూ బోలు వ్యాధి కనిపిస్తుంది. బోలు వ్యాధి ఉంటే తుంటి ఎముక, వెన్నుపూస, మణికట్టులు చిన్నచిన్న దెబ్బలకే విరిగిపోతుంటాయి. గతుకుల రోడ్లలో వేగంగా వెళ్లడం, సడన్‌గా బ్రేక్ వేసినప్పుడు ఎముకలు విరిగిపోతుంటాయి. సాధారణ ఎక్స్‌రేలోనూ ఒక్కోసారి బోలు వ్యాధి బయటపడుతుంది. డెక్సా స్కాన్ తీశాక అందులో టీస్కోర్‌ను బట్టి వ్యాధిని నిర్ధారిస్తారు. టీ స్కోరు మైనస్ ఒకటి నుంచి మైనస్ 2.5 వరకు ఉంటే బోలు వ్యాధిగా పరిగణిస్తారు. కొంతమందిలో మైనస్ 4 వరకు కూడా ఉంటుంది. అపుడు వ్యాధి తీవ్రంగా ఉన్నట్లు పరిగణిస్తారు. సున్నా నుంచి మైనస్ ఒకటి వరకు ఉంటే ఆస్టియో పీనియా అంటారు. అది బోలు వ్యాధికి ముందటి దశ.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- జీవనశైలిని మార్చుకోవడం
- సూర్యరశ్మి తగిలేలా చూడటం
- ఏసీలు వాడటం తగ్గించాలి
- పొగ, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం
- వ్యాయామం చేయడం.
- ఊబకాయాన్ని తగ్గించుకోవడం.
- బక్కగా ఉండేవారు బలమైన ఆహారం తీసుకోవడం
- పాలు, పెరుగు, మాంసకృతులు గల ఆహారం తీసుకోవడం
- విటమిన్ ‘డి’ఉండే ఆహారం, కాల్షియం మాత్రలు వాడటం బోలు వ్యాధితో బాధపడే వయసు మళ్లినవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచం పక్కన బెల్ ఉంచుకోవాలి. ఎవరి సాయం లేకుండా కదలకూడదు. వాకర్స్ సాయంతో తిరగాలి. బాత్‌రూం వద్ద కూడా సపోర్టర్స్ ఉండాలి. సిలికాన్ హిప్ ప్రొటెక్టర్స్ ఉపయోగించాలి.
Comments
Please login to add a commentAdd a comment