మద్యపానంపై నిషేధం విధించిన ఊళ్లు, ఆ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై జరిమానాలు వేసే ఊళ్లు మనకు తెలుసు. గ్రామ పరిశుభ్రతలో భాగంగా ఎక్కడ పడితే అక్కడ చెత్తవేసే వారిపై జరిమానా వేసే ఊళ్లు, బహిరంగ ప్రదేశాలలో పొగ తాగేవారిపై జరిమానా వేసే ఊళ్ల గురించీ మనకు తెలుసు, అయితే మహారాష్ట్రలోని సౌందాల గ్రామం వినూత్న జరిమానాతో దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. బహుశా ఇలాంటి జరిమానా దేశచరిత్రలోనే మొదటిసారి కావచ్చు.
మహారాష్ట్రలోని సౌందాల గ్రామంలో మహిళలను కించపరిచినట్లు మాట్లాడినా, తిట్టినా జరిమానా విధిస్తారు. అహల్యనగర్ జిల్లా నెవాసా తాలూకాలోని సౌందాల గ్రామ సభ మహిళలపై అసభ్య పదజాలానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ముంబైకి మూడు వందల కిలోమీటర్‌ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో వాదోపవాదాల సమయంలో, తగాదాలలో తల్లులు, సోదరీమణులను లక్ష్యంగా చేసుకొని బూతులు తిట్టడం సాధారణ దృశ్యంగా కనిపించేది.
‘తమ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు అనే విషయం బూతులు మాట్లాడేవారు మరిచిపోతారు. బూతు పదాలు వాడిన వారిపై రూ.500 జరిమానా విధించాలని నిర్ణయించాం. సమాజంలో మహిళల గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నమే ఈ నిర్ణయం’ అంటాడు తీర్మానం ప్రవేశపెట్టిన శరద్ ఆర్గాడే. వితంతువులను మతపరమైన, సామాజిక ఆచారాలలో భాగస్వామ్యం చేయడంలోనూ గ్రామం ముందుంటుంది.
భర్త చనిపోయిన తరువాత సింధూరం తుడవడం, గాజులు పగల కొట్టడం, మంగళ సూత్రం తొలగించడంలాంటివి ఆ గ్రామంలో నిషిద్ధం. సౌందాల వివాదరహిత గ్రామంగా రాష్ట్రస్థాయిలో అవార్డ్ అందుకుంది. ‘జరిమానా వల్ల మార్పు వస్తుందా? అని మొదట్లో చాలామంది సందేహించారు. విధించే జరిమానా చిన్న మొత్తమే కావచ్చు.
అయితే ఈ తీర్మానం వల్ల బూతు మాటలు మాట్లాడడం తప్పు అనే భావన గ్రామస్థుల మనసులో బలంగా నాటుకుపోతుంది. మహిళలను కించపరిచేలా మాట్లాడడం తగ్గిపోతుంది’ అంటుంది విమల అనే గృహిణి.
(చదవండి: ఇండియా నన్ను స్వీకరిస్తే చాలు..!: జాక్వెలిన్ ఫెర్నాండేజ్)
Comments
Please login to add a commentAdd a comment