25న చెన్నైలో రాజా వివాహం
న్యూస్‌లైన్ : యువ నటుడు రాజా ఓ ఇంటివాడు కాబోతున్నారు. చెన్నైకి చెందిన అమృత విన్సెంట్‌ను జీవిత భాగస్వామిగా పొందనున్నారు. వీరి వివాహం ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు చెన్నై నుంగంబాక్కంలోని సెయింట్ థెరిసా చర్చి లో జరగనుంది. తెలుగులో ఆనంద్ చిత్రంతో హీరోగా ప్రాచుర్యం పొందిన రాజా ఆ తరువాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించా రు. ఇప్పటి వరకు 32 చిత్రాల్లో నటించగా, ఐదు చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ అవార్డులను అందుకున్నారు.
రాజా పుట్టింది కోయంబత్తూరులోని తారాపురం గ్రామంలో కాగా, పెరిగింది చెన్నై మహానగరంలోనే. ఈయన తమిళంలోను కన్నా, జగన్మోహిని చిత్రాల్లో హీరోగా నటించారు. వివాహానంతరం తమిళంలోను హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు. వివాహానంతరం అదే రోజు సాయంత్రం చెన్నై అడయార్‌లోని లీలా ప్యాలెస్‌లో విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 30న హైదరాబాదు బంజారాహిల్స్ రోడ్డులోని జేకేసీ కన్‌స్ట్రక్షన్ సెంటర్‌లో వివాహ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు బుధవారం చెన్నైలో విలేకరుల సమావేశంలో రాజా వెల్లడించారు. ఈ సమావేశంలో ఆయన కాబోయే శ్రీమతి అమృత విన్సెంట్, ఆయన పిన తండ్రి చంద్రమౌళి పాల్గొన్నారు.