ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డుల పథకం ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి రానందున మరో 2 నెలల (ఫిబ్రవరి ఆఖరు వరకు) మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం జీవో జారీ చేసింది. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌తోపాటు హెల్త్ కార్డుల పథకమూ అమల్లో ఉంటుందని ఆ జీవోలో పేర్కొన్నారు.
ఈ జీవోలోని ఇతర ముఖ్యాంశాలు..
* ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖలతో చర్చించి అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లు అందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలి.
* కార్పొరేట్ ఆసుపత్రులు, ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు ఉన్న ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులపై ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్యం అందేలా ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖలు, ఆరోగ్యశ్రీ ట్రస్టు చర్యలు తీసుకోవాలి. మెడికల్ డెరైక్టర్‌తో కలసి ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు ఉన్న ఆసుపత్రుల యాజమాన్యాలతో ఆరోగ్యశ్రీ ట్రస్టు చర్చించాలి.
* ఉద్యోగ సంఘాల నుంచి మరిన్ని వివరాలు, ఫిర్యాదులు స్వీకరించడానికి త్వరలో స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలి.
* హెల్త్‌కార్డులు రూపొందించేందుకు ఆర్థిక శాఖ వద్ద ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఆధార్ నంబర్లు వంటి సకల వివరాలూ ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఇవ్వాలి. సీఎఫ్‌ఎంఎస్ ద్వారా ఉద్యోగుల వివరాలు ఆర్థిక శాఖకు అందడంలో జాప్యం జరిగే పక్షంలో.. ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ స్కీం (ఈహెచ్‌ఎస్) పోర్టల్‌లో ఉద్యోగులు, పెన్షనర్లు నేరుగా డేటా నమోదుకు అవకాశమివ్వాలి.
మరో 2 నెలలు మెడికల్ రీయింబర్స్‌మెంట్
Published Tue, Dec 23 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM
Advertisement