ఖజానాకు తాళం! | Developments completely stalled in srikakulam | Sakshi
Sakshi News home page

ఖజానాకు తాళం!

Published Wed, May 21 2014 1:27 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

ఖజానాకు తాళం! - Sakshi

ఖజానాకు తాళం!

 ఎన్నికల కారణంగా గత మూడు నెలలుగా అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల కోడ్‌ను కూడా ఎత్తివేశారు. అయినా పనులు జరిగే అవకాశం లేదు. రాష్ట్ర విభజన ముహూర్తం సమీపించడమే దీనికి కారణం. విభజన ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఖజానాకు తాళం పడనుంది. కొత్త రాష్ట్రంలో కొత్త అకౌంట్లు తెరిచి.. నిధులు మంజూరు చేసే వరకు నిధులు, పనుల మంజూరీలు స్తంభించిపోనున్నాయి. మరోవైపు విభజన ప్రభావంతో ఖజానా శాఖలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఖజానా.. మరికొన్ని శాఖలు విలీనమై, ఉద్యోగులు తగ్గిపోయే అవకాశం ఉంది.
 
 శ్రీకాకుళంకలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన కారణంగా అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. గతంలో మంజూరైన నిధులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజనతోపాటే ఖజానా శాఖ కూడా రెండుగా విడిపోనుండటంతో ఈ శాఖ సేవలను ఈ నెల 24 నుంచి పూర్తిస్థాయిలో నిలిపివేస్తున్నారు. జూన్ 2న కొత్త రాష్ట్రం ఏర్పాటై కొత్త అకౌంట్లు తెరవడంతోపాటు బడ్జెట్ నిధులు జమ అయ్యే వరకు కనీసం 10 రోజుల పాటు ఖజానా సేవలు స్తంభించిపోనున్నాయి. ఈ కారణంగానే ఇప్పటికే అందిన బిల్లుల చెల్లింపుల్లో  ఆ శాఖ సిబ్బంది బిజీ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపునకే ప్రాధాన్యమిస్తున్నారు. దాంతో పంచాయతీరాజ్, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల నియోజకవర్గ అభివృద్ధి పనుల బిల్లులు, డైట్, కాంట్రాక్టు, మెడికల్ రీయింబర్స్‌మెంట్, ఇతరత్రా ప్రభుత్వపరమైన బిల్లులన్నీ నిలిచిపోయాయి.
 
 జీతాల చెల్లింపునకే సమయం కేటాయింపు
 జీతాల చెల్లింపునకే ఖజానా శాఖ ఉన్నతాధికారులు జిల్లాల వారీగా సమయా లు కేటాయించడంతో మిగిలిన బిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  కేటాయించిన సమయాల ప్రకారం ఆయా జిల్లాల వారు జీతాలకు సంబంధించిన బిల్లులను ఆన్‌లైన్‌లో ఖజానా శాఖకు సమర్పించాలి. వీటికి సంబంధించిన టోకెన్ రిలీజ్ ఇప్పటికే పూర్తయింది. మిగిలిన విషయాలను పెద్దగా పట్టించుకోకపోవడంతో సీడీపీవో, ఎంపీ ల్యాడ్స్, పంచాయతీరాజ్, ఇతర శాఖల పనులకు సంబంధించి సుమా రు రూ. 30కోట్ల బిల్లులు నిలిచిపోయా యి. కొత్త రాష్ట్రం ఏర్పడేవరకు వీటిని చెల్లించే పరిస్థితి కన్పించడం లేదు. కనీసం ఉద్యోగి లేదా పింఛన్‌దారు మరణించిన సందర్భాల్లో దహన సం స్కారాలకు ఇవ్వాల్సిన నగదు సహా యం కూడా చెల్లించే అవకాశం లేదు.
 
 ఖజానా చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు
 ఈ నెల 24వ తేదీలోపు ఆర్థిక లావాదేవీలు ముగించాల్సి ఉండటంతో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు తమ జీతభత్యాలు, బకాయిలు, ఇతర బిల్లు లు మంజూరు చేయించుకునేందుకు ఖజానా శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చాలా మంది సిబ్బంది బిల్లులు పెట్టడం తెలియక సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే అష్టకష్టాలు పడి బిల్లులు తయారు చేసి ట్రెజరీకి తీసుకువెళితే అక్కడ సర్వర్ మొరాయించడం, ఆన్‌లైన్‌లో జమ కాకపోవడంతో నానా అవస్థలు పడా ల్సి వస్తోంది. గత మూడునాలుగు రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు జీతాల బిల్లుల కోసం ఖజానా శాఖ వద్ద పడిగాపులు కాస్తున్నారు.
 
 ఉద్యోగాల కుదింపు
 విభజన నేపథ్యంలో ఖజానా శాఖలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ శాఖ పరిధిలో 24 మంది డిప్యూటీ డెరైక్టర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సీమాంధ్ర ప్రాంతం వారే. వారంతా కొత్తగా 13 జిల్లాలో ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌లో పని చేసేందుకు ఆప్షన్ ఇస్తే ఈ జిల్లాల్లో పని చేస్తున్న ఏటీవో, డీటీవో క్యాడర్ అధికారులకు రివర్షన్ తప్పదు. అలాగే ఈ శాఖ నుంచి ప్లానింగ్, అకౌంట్స్, తదితర శాల్లో  ఫారెన్ సర్వీసుల్లో ఉన్న సిబ్బంది తిరిగి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఒక డీడీ, ఐదుగురు ఏటీవోలు,  28 మంది ఎస్టీవోలు, 73 మంది సీనియర్, 33 మంది జూనియ ర్ గణాంకకులు, 16 మంది సర్ప్‌లు, 26 మంది కార్యాలయ సహాయకులు, 11 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. మరో 42 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీ పోస్టులను రద్దు చేసి ఉన్నవారితోనే సరిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజన నేపథ్యంలో ఖజానా, పే అండ్ అకౌంట్స్, వర్క్ డిపార్టుమెంట్లు ఒకే గొడుగు కిందకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే ఇప్పటికే ఈ శాఖల మధ్య కొరవడిన సమన్వయం మరింత పెరగడంతోపాటు ఆధిపత్య పోరు తలెత్తే ప్రమా దం ఉంది. ఇప్పటి వరకు వేర్వేరు శాఖాధిపతులుగా ఉన్నవారు ఒకే శాఖలోకి వస్తే కొందరి అధికారులు తగ్గిపోతాయి. కొత్త సమస్యలు తలెత్తుతాయి. పైగా సిబ్బందికి పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement