వైవీయూ, న్యూస్‌లైన్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు నైతికంగా ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు చేసిన తప్పులు వారిని వెంటాడుతున్నాయి. ఉపాధ్యాయుల ఆరోగ్య ప్రయోజనాల కోసం రూపొందించిన మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తమ స్వార్థం కోసం బోగస్ బిల్లులు పెట్టి డబ్బులు కాజేశారు. దీనిపై 2009-10 సంవత్సరంలో ఆడిట్ అండ్ జనరల్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విచారణలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఉపాధ్యాయులు దొంగ బిల్లులతో డబ్బును కాజేసినట్లు గుర్తించారు. దీంతో విజిలెన్స్ విభాగం వారు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. రాష్ట్ర స్థాయిలో వందలాది మంది ఉపాధ్యాయులు లేని జబ్బులకు సైతం బిల్లులు పెట్టి సొమ్ము కాజేసినట్లు గుర్తించారు. ఇలా గుర్తించిన వారిలో జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక ఉపాధ్యాయురాలు ఉండటంతో వీరిపై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల డీఈఓ కార్యాలయానికి దస్త్రాలు వచ్చాయి.
దీంతో పాటు సంబంధిత ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇద్దరు ఉపాధ్యాయులపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదైనట్లు సమాచారం. మరో ఉపాధ్యాయుడిపై కేసు నమోదు కాలేదు. ముగ్గరిలో ఓ ఉపాధ్యాయుడు ఏకంగా రూ.1.52 లక్షలకు దొంగబిల్లులు సమర్పించినట్లు తెలిసింది. మరో ఇద్దరు మాత్రం ఒకరు రూ.10 వేలు, మరొకరు రూ.3 వేలకు బిల్లులు సమర్పించారు. అయినా దొంగబిల్లులు చిన్నవైనా పెద్దవైనా ఒక్కటే అని భావించిన విజిలెన్స్ వారు చర్యలకు సిఫార్సు చేశారు.
వీరిలో ఇద్దరు మాత్రం ఇప్పటికే తీసుకున్న సొమ్మును తిరిగి ప్రభుత్వానికి చెల్లించారు. చిన్నమొత్తంలో సొమ్మును తీసుకున్న ఉపాధ్యాయులు మాత్రం ప్రొసీజర్ ఫాల్స్ కారణంగానే తాము బిల్లులు పెట్టామని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు బిల్లులు సమర్పించలేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. బిల్లులను స్క్రూట్నీ చేయాల్సిన సంబంధిత రిమ్స్ సిబ్బంది ఎటువంటి అభ్యంతరం తెలుపకపోవడంతో తాము బిల్లులు పెట్టుకున్నామని, ఇందులో తమ తప్పేం లేదని వాపోయినట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించిన దస్త్రాలు డీఈఓ కార్యాలయానికి వచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదు.
డీఈఓ అంజయ్య ఏమంటున్నారంటే..
ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే ఇద్దరిపై కేసులు నమోదు చేశాం. మరొకరిపై నమోదు చేయాలని ఆదేశించాం. దీనిపై పూర్తిస్థాయి విచారణ అనంతరం రెండు నివేదికను డెరైక్టరేట్‌కు పంపుతాం.
అయ్యవార్లకు అరదండాలు
Published Sat, Nov 9 2013 3:17 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM
Advertisement
Advertisement