విజయవాడ : రాష్ట్ర ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టారు. విద్యా రంగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తున్న ప్రభుత్వపు తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నాకు దిగారు. ఇందులో భాగంగా విజయవాడను వేదికగా చేసుకొని ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించడానికి సమాయత్తం అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఈ ధర్నాకు తరలివస్తున్నారు. పోలీసులు మాత్రం మహా ధర్నాకు అనుమతి లేదంటూ అడ్డుకోనే ప్రయత్నం చేస్తున్నారు. నిరసనల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయ సంఘాల నేతలను ఎక్కడిక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
విజయవాడ పరిధిలో ఇప్పటికే 16 మంది యూటీఎఫ్ నాయకులను అరెస్టు చేసి తిరువూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై ఉపాధ్యాయ సంఘాలు, నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసుల నిరంకుశ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. అక్రమ కేసుల పెట్టి ఉపాధ్యాయులను స్టేషన్లకు తరలిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదివేల మంది ఉపాధ్యాయలను పోలీసులు అరెస్టు చేశారని వారిని తక్షణమే విడుదల చేయాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయమని అడుగుతున్నామని ఉపాధ్యాయ సంఘ నేతలు తెలిపారు. తామేమీ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి స్థానం అడగలేదని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, సైకిళ్లతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. ఉపాధ్యాయ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని కోరామని కానీ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట తప్పి రాష్ట్రంలో యుద్ధ వాతారణం ఏర్పరచిందని మండిపడ్డారు.
ఉపాధ్యాయ ఉద్యమ చరిత్రలో ఇలాంటి చీకటి అధ్యాయాన్ని ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. అర్ధరాత్రి వేళ ఉపాధ్యాయులపై బైండోవర్ కేసులు పెట్టి అరెస్టు చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ఎప్పుడూ ఉపాధ్యాయులపై ఇంత దుర్మార్గంగా వ్యహరించలేదని అన్నారు. ఈ చర్యలకు అన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. బలవంతంగా అడ్డుకొని పోలీస్‌స్టేషన్‌లో పెట్టడానికి ఉపాధ్యాయులు ఏమైనా దోశద్రోహులా అని సంఘాల నేతలు ప్రశ్నించారు. మహాధర్నాకు మొదట అనుమతి ఇచ్చామని చెప్పిన ఏసీపీ తరువాత మాట మార్చి నోటీసులు పంపించారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment