ఉద్యోగులకు ఊరట
మెడికల్ రీయింబర్స్‌మెంట్ గడువు పొడిగింపు.. వచ్చే ఏడాది మార్చి 31 వరకు అవకాశం
తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
గుండెజబ్బు రోగుల స్టెంట్ల ధరల నిర్ధారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు ఊరట లభించింది. వారికి ఆరోగ్య ధీమా కల్పించింది. మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం గడువును ప్రభుత్వం పొడిగించింది. ఇది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌కు సమాంతరంగా కొనసాగనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు (జీవో నం.40) జారీ చేసింది. ఉద్యోగులు, పింఛన్‌దారులు, ఉద్యోగుల కుటుంబసభ్యులకు నగదు రహిత వైద్యసేవలు అందించేందుకు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని గత నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం మొదలుపెట్టింది. అయితే, ఈ పథకం అమలులో ఉండగా రీయింబర్స్‌మెంటు పథకం వర్తించదని తొలుత ప్రకటించింది.
ఆయా కార్పొరేటు ఆసుపత్రులతో ప్రభుత్వానికి ఒప్పందం కుదరకపోవడం, ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యసేవలు అందకపోవడంతో తేరుకున్న ప్రభుత్వం మెడికల్ రీయింబర్స్‌మెంటు పథకాన్ని నవంబరు 30వ తేదీ వరకు పొడిగించింది. ఈలోగా కూడా కార్పొరేటు ఆసుపత్రులతో ప్రభుత్వానికి ఎలాంటి ఒప్పందం కుదరలేదు. దీంతో ఉద్యోగులకు వైద్యసేవలు అందించడంలో ఎక్కడా ఇబ్బం దులు తలెత్తకుండా నగదు రహిత వైద్యసేవలతోపాటు, రీయింబర్స్‌మెంటు పథకాన్ని వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వం తరఫున వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం రాజయ్య ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. అయినా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లోని ఆసుపత్రుల్లోనూ నగదురహిత వైద్య అందడం లేదు. ప్రభుత్వం ఇంకా ఎలాంటి ధరలు నిర్ణయించకపోవడం, ‘ఆరోగ్య శ్రీ’కి మాదిరిగానే డబ్బులు చెల్లించాలని యోచించడం కార్పొరేట్ ఆసుపత్రులకు రుచించడంలేదు. ప్రత్యేక రేట్లను ఖరారు చేయాలని కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వాన్ని కోరాయి. ఒప్పందం కుదిరే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు నెలలపాటు రెండు పథకాలకూ అవకాశమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంప్లాయీస్ హెల్త్ స్కీం, ఆరోగ్యశ్రీ సేవల్లో భాగంగా గుండెజబ్బు రోగులకు స్టెంట్లు అమర్చేందుకు చెల్లించాల్సిన ఖర్చులకు సంబంధించి మరో ఉత్తర్వు (జీవో నెం.39)ను జారీ చేసింది. బేర్ మెటల్ స్టెంట్‌కు రూ.55 వేలు, అదనపు స్టెంట్‌కు రూ.10 వేలు, ‘డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్’కు రూ.65 వేలు, అదనపు స్టెంట్‌కు రూ.20 వేలుగా ప్యాకేజీని నిర్ణయించింది. ఈ మేరకే చెల్లింపులు చేయాలని ఆరోగ్య శ్రీ సీఈవోకు అనుమతినిచ్చింది.