
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ప్రపంచంలో చాట్‌జీపీటీ (ChatGPT) రాక సంచలనాన్ని సృష్టించింది. తర్వాత క్రమంగా, మరిన్ని కంపెనీలు తమ సొంత ఏఐ సాధనాలతో ముందుకు వచ్చాయి. ఈ ఏఐ టూల్స్‌తో కొలువుల కోత తప్పదని, వేలాది ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళన సర్వత్రా నెలకొంది. దీనికి తోడు ఎలాన్ మస్క్ సహా అనేక టెక్ కంపెనీ అధినేతలు, సీఈవోలు సైతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఉద్యోగాలకు ముప్పు తప్పదని హెచ్చరించారు.
ఈ భయాందోళనల నేపథ్యంలో టెక్ ఉద్యోగులకు ఊరట కలిగించే విషయాన్ని చెప్పింది ఐక్యరాజ్యసమితి (UN)కి చెందిన అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ (ILO). ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదని, ఏఐ టెక్నాలజీ ఉద్యోగులను రీప్లేస్ చేయలేదని ఐఎల్‌వో తాజా అధ్యయనం వెల్లడించింది.
ఐఎల్ఓ ఇటీవలి అధ్యయనం ప్రకారం.. ఏఐ టెక్నాలజీ మనుషులు చేసే పనులను మార్చేస్తుంది తప్ప ఉద్యోగాలకు ముప్పు కాబోదు. అయితే ఏఐ రాకతో చాలా ఉద్యోగాలు, పరిశ్రమలు పాక్షికంగా యాంత్రీకరణకు గురవుతాయని ఐఎల్ఓ స్టడీ పేర్కొంది. చాట్‌జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్ వల్ల ప్రయోజనమే తప్ప విధ్వంసం ఉండదని వివరిచింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలేం ఊడిపోవని, కాకపోతే పనిలో నాణ్యత, ఉద్యోగుల పనితీరు మెరుగు వంటి అంశాలకు దోహదం చేస్తుందని ఐఎల్ఓ అధ్యయనం పేర్కొంది. నూతన టెక్నాలజీ ప్రభావం వివిధ ఉద్యోగాలు, ప్రాంతాలకు వేర్వేరుగా ఉంటాయని, పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగాలపైనే ఈ ప్రభావం కాస్త ఉండే అవకాశం ఉందని ఐఎల్ఓ స్టడీ అంచనా వేసింది.
ఇదీ చదవండి: ఏఐ ముప్పు లేని టెక్ జాబ్‌లు! ఐటీ నవరత్నాలు ఇవే..