ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కూడిన టెక్నాలజీతోనే ఆర్థిక వృద్ధి సాధ్యం. ఇది అత్యధిక మంది భారతీయులు నమ్ముతున్న మాట. సాంప్రదాయకంగా ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉన్న జనాభాను ఏకీకృతం చేయడంలో 89 శాతం మంది భారతీయులు సాంకేతికతను కీలక అంశంగా భావిస్తున్నారని హెచ్‌పీ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ సంఖ్య ప్రపంచ సగటు 76 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇది సాంకేతికత పరివర్తన శక్తిపై భారత్ బలమైన నమ్మకాన్ని నొక్కిచెబుతోందని హెచ్‌పీ ఒక ప్రకటనలో తెలిపింది.
పర్యావరణ, సామాజిక లక్ష్యాల దిశగా తన పురోగతిని తెలియజేస్తూ హెచ్‌పీ తన సుస్థిర ప్రభావ నివేదిక 2023తో పాటు ఈ ఫలితాలను ఆవిష్కరించింది. టెక్నాలజీ అందుబాటును పెంచడానికి, నైపుణ్యాలను పెంపొందించడానికి సానుకూల సామాజిక ప్రభావం కోసం కృత్రిమ మేధను ఉపయోగించడానికి హెచ్‌పీ చేస్తున్న ప్రయత్నాలను నివేదికలో వివరించింది. ఈ అంశంపై స్వతంత్ర పరిశోధనలు జరిపేందుకు హెచ్‌పీ ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్‌ను నియమించింది. 2023 అక్టోబర్ నుంచి నవంబర్ వరకు నిర్వహించిన ఈ సర్వేలో అమెరికా, ఫ్రాన్స్, ఇండియా, యూకే, జర్మనీ, జపాన్, చైనా, మెక్సికో, బ్రెజిల్, కెనడా వంటి 10 దేశాలకు చెందిన 1,036 మంది బిజినెస్ లీడర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
భారత్‌లో ఉచిత ఏఐ శిక్షణ ఇవ్వనున్న హెచ్‌పీ
తన లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా తన డిజిటల్ బిజినెస్ స్కిల్స్ ‘హెచ్‌పీ లైఫ్’ ప్రోగ్రామ్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉచిత కృత్రిమ మేధ శిక్షణను మిళితం చేయాలని హెచ్‌పీ యోచిస్తోంది. వర్క్, సృజనాత్మక ప్రక్రియలను పెంచడానికి హెచ్‌పీ భారత్‌లో నెక్ట్స్ జనరేషన్ ఏఐ పీసీలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.
అదనంగా 2030 నాటికి హెచ్‌పీ లైఫ్ ఉచిత నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమంలో 27.5 లక్షల మంది వినియోగదారులను నమోదు చేయాలనే తన లక్ష్యాన్ని హెచ్‌పీ విస్తరిస్తోంది. ఈ కార్యక్రమాన్ని హెచ్‌పీ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2016 నుంచి ఇప్పటికే 12 లక్షల మంది యూజర్లు నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా భారత్ అత్యధికంగా కొత్త యూజర్లను కలిగి ఉంది.
టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉండాలని హెచ్‌పీ గ్లోబల్ హెడ్ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్, హెచ్‌పీ ఫౌండేషన్ డైరెక్టర్ మిషెల్ మాలెజ్కీ సూచించారు. డిజిటల్ ఎకానమీలో వృద్ధి చెందడానికి అవసరమైన సాధనాలను యాక్సెస్ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. "పురోగతిని నడిపించడానికి సాంకేతికత ఒక గొప్ప శక్తివంతమైన సాధనం" అని మాలెజ్కీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment