సాక్షి, హైదరాబాద్: తప్పుడు బిల్లులు సమర్పించి మెడికల్ రీయింబర్స్‌మెంట్ డబ్బు స్వాహా చేసిన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ హైకోర్టుకు నివేదించారు. ఆరోపణలు వచ్చిన 143మంది ఉపాధ్యాయులపై విచారణ జరపగా.. అందులో 79మంది అక్రమ పద్ధతిలో మెడికల్ రీయింబర్స్‌మెంట్ మొత్తాలను స్వాహా చేసినట్లు రుజు వైందని వివరించారు. డ్రాయింగ్ అధికారులు, వారి సిబ్బందితో కలిసి పలువురు మండల విద్యాశాఖఅధికారులు, ఉపాధ్యాయులు ఈ చర్యలకు పాల్పడ్డారని, వారందరిపై ఇప్పటికే చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించామని కోర్టుకు నివేదించారు. టీచర్ల అక్రమ వైద్య బిల్లులపై దర్యాప్తుసంస్థతో విచారణ జరి పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారం విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ వ్యాజ్యంపై ఇంతటితో విచారణను ముగిస్తున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.