సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లను ఒకే రకమైన నిబంధనల పరిధిలోకి తీసుకువచ్చే ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యతో విద్యా వ్యవస్థ కుప్పకూలింది. 20 ఏళ్లుగా న్యాయ వివాదాల్లో నలుగుతున్న ఈ సమస్య కారణంగా రిటైర్‌మెంట్‌తో పోస్టులు ఖాళీ అవడం తప్ప వాటిని భర్తీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ అధికారులు లేక పాఠశాల విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. టీచర్లు బోధిస్తున్నారా? లేదా? చూసేవారు లేరు. దీంతో పాఠశాల విద్యా బోధన గందరగోళంగా మారింది. ప్రధానోపాధ్యాయులే ఇన్‌చార్జి ఎంఈవోలుగా రెండు మూడు మండలాలకు ఒకరు చొప్పున ఉండటంతో వారు కూడా సరిగ్గా పని చేయలేకపోతున్నారు. దీంతో విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాలకులు ఏకీకృత సర్వీసు రూల్స్ అమలును టీచర్ల సమస్యగానే చూస్తున్నారు తప్ప పాఠశాల విద్యా వ్యవస్థకు సంబంధించిన సమస్యగా చూడకపోవడం వల్లే ఇది పరిష్కారానికి నోచుకోవడం లేదన్న వాదనలు ఉన్నాయి. కనీసం పాఠశాలల పర్యవేక్షణకు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టకపోవడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో పాఠశాలల బాగుకోసం పర్యవేక్షణ పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
అడుగడుగునా అవాంతరాలే...
రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పంచాయతీరాజ్ టీచర్ పోస్టులను లోకల్ కేడర్‌గా పేర్కొనకపోవడంతో లోకల్ కేడర్‌గా ఉన్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (ఎంఈవో), డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్ వంటి పర్యవేక్షణ అధికారి పోస్టుల్లో వారికి పదోన్నతులు కల్పించవద్దని మొదటి నుంచీ ప్రభుత్వ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ పోస్టుల్లో తమకే పదోన్నతులు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే 1.40 లక్షల మంది టీచర్లలో 1.20 లక్షల వరకు పంచాయతీరాజ్ టీచర్లే ఉం డటంతో వారికి న్యాయం చేసేందుకు ప్రభు త్వం 1998లో రెండు మేనేజ్‌మెంట్ల టీచర్లకు ఒకే రకమైన సర్వీసు రూల్స్ తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మ డి సర్వీసు రూల్సుతో జీవో 505, 538లను జారీ చేసింది.
పంచాయతీరాజ్ టీచర్లు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని లోకల్ కేడర్ పరిధిలో లేనందున ఉమ్మడి సర్వీసు రూల్సును అమలు చేయడానికి వీల్లేదని ప్రభుత్వ టీచర్లు పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఆ తరువాత హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. చివరకు సుప్రీంకోర్టు 2015 అక్టోబర్ 30న తీర్పు ఇచ్చింది. పంచాయతీరాజ్ టీచర్లకు, ప్రభుత్వ టీచర్లకు కలిపి ఉమ్మడి సర్వీసు రూల్స్ తీసుకురావాలంటే రాష్ట్రపతి ఉత్తర్వులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా సవరణ చేయించాలని, ఆ సవరణ ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా పొందుపరచాలని (లోకల్ కేడర్ ఆర్గనైజ్ చేయడం), అప్పుడే ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలు సాధ్యం అవుతుందని చెప్పింది. 2017లో ఆ పోస్టులను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అయితే దాని పై ప్రభుత్వ టీచర్లు మళ్లీ హైకోర్టును ఆశ్రయించడంతో స్టేటస్‌కో ఇచ్చింది. ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నందున ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
472 ఎంఈవో పోస్టుల్లో 433 ఖాళీలే
క్షేత్ర స్థాయిలో పాఠశాలల పర్యవేక్షణలో ఎంఈవో, డిప్యూటీఈవోలే కీలకం. కానీ ఆ పోస్టులు అత్యధికశాతం ఖాళీగా ఉండటంతో పాఠశాలలను పట్టించుకునే వారు లేకుండా పోయారు. సర్వీసు రూల్స్ సమస్యనే దీనికి కారణంగా చెబుతున్నారు. ఇవేకాదు బీఎడ్ కాలేజీ లెక్చరర్లు, డైట్ లెక్చరర్లు, సీనియర్ డైట్ లెక్చరర్ పోస్టులను కూడా భర్తీ చేయని పరిస్థితి నెలకొంది. 1998 నుంచి ఇప్పటివరకు ఈ పోస్టుల్లో ఉన్న వారు రిటైర్ కావడమే తప్ప భర్తీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో పాఠశాలల పర్యవేక్షణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, డైరెక్టు రిక్రూట్‌మెంట్‌కు అవకాశం ఉన్న వాటిని భర్తీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పాత జిల్లాల ప్రకారమే రాష్ట్రంలో 472 ఎంఈవో పోస్టులు ఉంటే అందులో 433 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇక కొత్త జిల్లాల ప్రకారం చూస్తే మరో 125 మండలాలకు వీటికి అదనంగా 125 ఎంఈవో పోస్టుల అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment