
సమావేశంలో మంత్రి హరీశ్, ఎంపీలు నామా, వద్దిరాజు రవిచంద్ర
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్టంలో చేపడుతున్న కంటివెలుగు రెండో దశ కార్యక్రమానికి అన్ని శాఖలు సహకరించాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈనెల 18న ఖమ్మంలో కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. శిబిరానికి వచ్చే ప్రజలు తప్పనిసరిగా ఆధార్ కార్డు తెచ్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి సోమవారం ఆయన సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వి, కమిషనర్ శ్వేతతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
శిబిరాల నిర్వహణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన భద్రత కల్పించాలని హరీశ్‌రావు సూచించారు. ఈనెల 18న ఖమ్మంలో సీఎం లాంఛనంగా ప్రారంభించనుండగా, జిల్లాల్లో ఈనెల 19న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్లు తదితరులు కంటివెలుగును ప్రారంభించాలని చెప్పారు. వైద్యబృందాలు సమీప పట్టణాలు, మండల కేంద్రాల్లోనే రాత్రిబస చేసేలా పర్యవేక్షిస్తూ ప్రతిరోజూ ఉదయం 8–45 గంటలకల్లా తప్పనిసరిగా శిబిరాలను తెరవాలని స్పష్టంచేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగును నిర్వహిస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. ఈ సమావేశంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment