అద్దాల్లేవ్‌.. | Kanti Velugu Scheme Is Not Implemented Warangal | Sakshi
Sakshi News home page

అద్దాల్లేవ్‌..

Published Wed, Sep 5 2018 12:02 PM | Last Updated on Sat, Sep 15 2018 10:55 AM

Kanti Velugu Scheme Is Not Implemented Warangal - Sakshi

వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లిలో మంగళవారం కంటి వెలుగు క్యాంపునకు 232 మంది హాజరుకాగా పరీక్షలు నిర్వహించి, వారిలో 135 మందికి కంటి అద్దాలు అవసరం అని నిర్ధారించారు. అలాగే 15 మందికి శస్త్ర చికిత్స అవసరమని సిఫార్సు చేశారు. దగ్గరి చూపు సమస్యతో బాధపడుతున్న 61 మందికే కంటి అద్దాలు అందుబాటులో ఉండగా వారికే అందించారు. దూరపు చూపు సమస్యతో బాధపడుతున్న 75 మందికి కంటి అద్దాల కోసం అర్డర్‌ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వారికి అక్టోబర్‌ 5న వస్తాయని, ఇంటికి ఆశ వర్కర్‌ తీసుకొచ్చి ఇస్తారని చెప్పారు. దీంతో కంటి అద్దాలు అందిస్తారని ఆశతో వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరిగారు.

సాక్షి, వరంగల్‌ రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో పరీక్షలు చేయించుకున్న దూరపు చూపు బాధితులకు అద్దాలు అందుబాటులో లేవు. ఆ అద్దాల కోసం వైద్య సిబ్బంది ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టగా నెల రోజుల గడువు చూపిస్తోంది. దీంతో కంటి పరీక్షలకు వెళ్లిన దూరపు చూపు బాధితులు క్యాంపు నుంచి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు), ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి కేంద్రంలో కంటి పరీక్షలకు ఐదు గదులు ఏర్పాటు చేశారు. వీటిలో రిజిస్ట్రేషన్, తర్వాత కంటి పరీక్ష, వైద్యుడి పరీక్ష, కంప్యూటర్‌ పరీక్ష, కంటి అద్దాల పంపిణీ గదులు ఉన్నాయి. కాగా గ్రామాల్లో ప్రతి వంద మందిలో సగటున 30 మందికిపైగా కంటి సమస్యతో బాధపడుతున్నట్లు కంటి పరీక్షల నివేదికలు వెల్లడిస్తున్నాయి.

దూరపు చూపు అద్దాలు.. నెల రోజులకు..
కంటి చూపులో దూరపు, దగ్గరి చూపు సమస్యతో బాధపడుతున్నవారు, అసలు కనబడని వారిని పరీక్షల్లో గుర్తిస్తున్నారు. దగ్గరి చూపు కనబడడం లేదని డాక్టర్లు నిర్ధారిస్తే వెంటనే వారికి కంటి అద్దాలను పంపిణీ  చేస్తున్నారు. దూరపు చూపు కనబడని వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఆర్డర్‌ పెడుతున్నారు. రెండు కళ్లకు ఒకే రకమైన సైట్‌ ఉంటేనే కంటి అద్దాలు అందిస్తున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేయగా 30 రోజుల తర్వాత కంటి అద్దాలు వస్తాయనే సమాచారం వస్తోంది. దీంతో బాధితులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అసలు కంటి అద్దాలు వస్తాయో.. రావో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అందుబాటులో తొమ్మిది రకాల అద్దాలే.. 
కంటి వెలుగు పథకంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి వెంటనే అందించేందుకు ప్రభుత్వం 9 రకాల కంటి అద్దాలనే అందుబాటులో ఉంచారు. 1.0 ఆర్‌ఎంబీఎఫ్‌ నుంచి 2.5 ఆర్‌ఎంబీఎఫ్, 1.0 నుంచి 2.5 ఆర్‌ఎంబీ వరకు మాత్రమే కంటి అద్దాలు ఉన్నాయి.

అనుకూల ఆస్పత్రులకే శస్త్ర చికిత్సకు రెఫర్‌..  
కంటి వెలుగులో పరీక్షలు చేయించుకున్న వారికి కంటి శస్త్ర చికిత్స చేయాలని నిర్ధారించిన వారిని కొన్ని రెఫరల్‌ ఆస్పత్రులకు మాత్రమే సిఫార్సు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఏ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేయించుకుంటా నంటే ఆ వైద్యశాలకు రెఫర్‌ చేయాల్సి ఉండగా అలా క్యాంప్‌లో జరగడం లేదు. ఆయా కంటి ఆస్పత్రులతో కొందరు మిలాఖతై వారి ఆస్పత్రికే ఎక్కువగా రెఫర్‌ చేస్తున్నారని సమాచారం. 

నిరాశగా పోతున్నా
కంటి పరీక్షలు చేస్తున్నారంటే వచ్చి చేయించుకున్నా. –1, –2 సైట్‌ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. కంటి అద్దాలు ఇచ్చే దగ్గరికి వెళ్లి చిట్టీ చూపిస్తే ట్యాబ్‌లో ఎంటర్‌ చేశారు. నెల రోజుల తర్వాత కంటి అద్దాలు వస్తాయని చెప్పారు. దీంతో నిరాశతో పోతున్నా. వస్తాయో లేదో మరి.. చూడాలి. – సారయ్య, దుగ్గొండి

ఆర్డర్‌ తీసుకుంటున్నాం
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం బాగా జరుగుతోంది. అందుబాటులో లేని కంటి అద్దాలు ఆర్డర్‌ తీసుకుంటున్నాం. ఆర్డర్‌ పెట్టిన కంటి అద్దాలు రాగానే అందిస్తాం. ప్రభుత్వం నుంచి వచ్చిన అద్దాలను వెంటనే అందిస్తున్నాం.   –డాక్టర్‌ వెంకటరమణ, డీఎంఅండ్‌హెచ్‌ఓ, వరంగల్‌ రూరల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement