eye operations
-
కొత్త కళ్ల జోడుతో సరికొత్త వెలుగులు
సిద్దిపేటజోన్: కొత్త కళ్ల జోడు.. కళ్లలో కొత్త వెలుగులు నింపుతుందని, ప్రభుత్వం తరఫున గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి సమస్యలు ఉన్న ప్రతీ ఒక్కరికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. సోమవారం స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో కంటి అద్దాలు పంపిణీ చేశారు. ‘‘మీ చల్లని చూపుతో మా కంటికి కొత్త వెలుగులు వచ్చాయని, ఇప్పుడు అన్ని బాగా చూడగలుగుతున్నాం. బిడ్డా... నీవు సల్లంగా ఉండాలి’’అని మంత్రిని ఈ సందర్భంగా వృద్ధులు ఆశీర్వదించారు. దశాబ్దాలుగా కంటి సమస్యలతో బాధపడుతున్న పేదవారికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేసి మందులు ఇవ్వడం సంతృప్తినిచ్చిందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 762 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేసి మందులు పంపిణీ చేశామన్నారు. మరో 1,800మందికి చేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ దీపాలు కంటి వెలుగులు
ఆరుషి అగర్వాల్ గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన అమ్మాయి. తల్లిదండ్రుల వృత్తి వ్యాపారాల రీత్యా హాంగ్‌కాంగ్‌లో పుట్టింది. సింగపూర్, యూఎస్‌లలో చదువుకుంది. ఏడేళ్ల కిందట ఆమె తన సొంత దేశం ఇండియాకి వచ్చింది. ఆ రావడమే ఆమె జీవన ప్రస్థానాన్ని నిర్దేశించింది. సేవా కార్యక్రమాల అవసరాన్ని గుర్తించింది. అందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడానికి సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారింది. ఆరుషి యూఎస్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుని ఏడేళ్ల కిందట ఇండియాకి వచ్చింది. ఆ పర్యటన ఆమెను జాగృతం చేసింది. ఆమె సమాజంలోని అంతరాలను దగ్గరగా చూసిందప్పుడే. వాళ్లది వ్యాపార కుటుంబం. తండ్రి హోటల్ పరిశ్రమ నడిపేవాడు. వాళ్ల కుటుంబానికి ఉన్న చైన్ రెస్టారెంట్ల నిర్వహణ బాధ్యత తల్లి చూసుకునేది. కాటరాక్ట్ కారణంగా కంటి చూపు మసకబారితే ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేని కారణంగా చూపును శాశ్వతంగా కోల్పోయే వాళ్లుంటారనే కఠోరమైన వాస్తవం ఆమెకు అవగతమైంది ఇండియాకి వచ్చిన తర్వాత మాత్రమే. అది కూడా ముంబయిలోని పేద కుటుంబాలను దగ్గరగా చూసినప్పుడే. ముంబయిలో ఏ రోజుకు ఆ రోజు అన్నట్లు బతుకు వెళ్లదీస్తున్న అనేక కుటుంబాల్లో ఆదివాసీలే ఎక్కువ. వారికి కంటి ఆపరేషన్లు చేయించే బాధ్యత మనసావాచా చేపట్టింది ఆరుషి. ఇదీ ఓ మార్గమే! ఆలోచన మంచిదే, కానీ ఆచరణ ఎలాగ? ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా సరే... నిధులు సమకూర్చుకోవడం మొదట జరగాల్సిన పని. విరాళాల కోసం ఇంట్లో వాళ్ల ముందు కూడా చేయి చాచకూడదనుకుంది. సొంతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనుకుంది ఆరుషి. ‘సేవ’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. పదిహేను మంది మహిళలకు సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ తయారీలో శిక్షణనిచ్చి మరీ వారికి ఉద్యోగం ఇచ్చింది. ఇటలీ, ఫ్రాన్స్‌లలో తప్ప మనదేశంలో దొరకని అరోమాటిక్ క్యాండిల్స్ తయారు చేసి ఆన్లైన్లో అమ్మకాలు మొదలు పెట్టింది ఆరుషి. వాటి ధరలు సామాన్యులకు కాదు కదా మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతికి కూడా భారమే. ఒక్కో క్యాండిల్ పద్నాలుగు వందల నుంచి ఎనిమిది వేల రూపాయలుంటుంది. ‘ఈ క్యాండిల్ మీ ఇంట్లో చీకటిని తొలగించి వెలుగును నింపుతుంది. మీరు ఈ క్యాండిల్ కొనడం ద్వారా మరొకరికి కంటి వెలుగును ప్రసాదించినవారవుతారు’ అని చెప్పి మరీ ఆ ధరకు అమ్ముతోంది. పరోక్ష సాయం! ‘సమాజంలో అభాగ్యులకు నేరుగా సేవ చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఈ క్యాండిల్ కొనడం వల్ల పరోక్షంగా సహాయం చేయగలుగుతాం’ అనుకున్న వాళ్లు వీటిని విరివిగా కొంటున్నారు. పదిహేను మంది మహిళలకు ఉపాధి, కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోలేని వాళ్లకు ఆపరేషన్‌కు ఆసరా... ఈ రెండు ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. దీంతో వెలుగులు మన ఇంటికే పరిమితం కావాలనే స్వార్థం వీడి ఇతరుల జీవితాల్లో కూడా వెలుగులు నింపాలనుకునే వాళ్లు ఆరుషికి ఆలంబనగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె వెయ్యికి పైగా ఆపరేషన్లు చేయించింది. ‘ఇలాంటి క్యాండిల్స్‌ని ఇటలీ, ఫ్రాన్స్‌ల నుంచి కొనగలిగిన వారే నా కస్టమర్లు. వాళ్లు ఆ దేశాల నుంచి కొనడం కంటే మనదేశంలోని స్టార్టప్‌కి సహాయం చేయడానికే ఇష్టపడుతున్నారు, పైగా ఇది చారిటీ కోసం చేస్తున్న పని కావడంతో సంతోషంగా తమ వంతు విరాళం ఇచ్చినట్లు భావిస్తున్నారు’ అని చెప్తోంది ఆరుషి. మంచి పని చేయాలనే చిత్తశుద్ధి ఉంటే మార్గం కూడా దానంతట అదే గోచరిస్తుంది. -
కరోనా ఉంటే కంటి ఆపరేషన్లు వద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా పాజిటివ్ లేదా వైరస్ అనుమానిత లక్షణాలున్న బాధితులకు కంటి ఆపరేషన్లు చేయరాదని కేంద్ర ఆరోగ్య, కు టుంబ సంక్షేమశాఖ తాజా గా మార్గదర్శకాలు జారీచేసిం ది. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఉండే కంటి ఆసుపత్రులు లేదా క్లినిక్‌లు తెరవకూడదని ఆదేశించింది. ఇతర ప్రాంతాల్లోని కంటి ఆసుపత్రుల్లో పాటించాల్సిన సురక్షిత పద్ధతుల ను వెల్లడించింది. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారు, గర్భిణీలు, పదేళ్లలోపు పిల్ల లు ఇంట్లోనే ఉండాలని, చిన్నచిన్న దృష్టి లోపాలకే నేత్రాలయాలకు రాకూడదని తెలిపింది. అలాగని కంటి ఆసుపత్రులకు వచ్చే బాధితులను కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని రావాలంటూ ఒత్తిడి చేయరాదని పేర్కొంది. చికిత్స అవసరమైతే మాత్రం వారి ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా తెలుసుకోవాలని సూచించింది. కరోనా పాజిటివ్ నిర్ధారణైన వారికి శస్త్రచికిత్స చేయకూడదని స్పష్టంచేసింది. టెలీ కన్సల్టేషన్‌ను ప్రోత్సహించాలి ఆసుపత్రులకు రోగుల సందర్శనలను తగ్గించడానికి టెలి–కౌన్సెలింగ్, టెలి–కన్సల్టేషన్లను ప్రోత్సహించాలని కేంద్రం స్పష్టం చేసింది. కంటి సమస్యలున్న వారి కళ్లను అత్యంత సమీపం నుంచి పరీక్షించాలి. ఆ సమయంలో బాధితులు లేదా వైద్య సిబ్బంది నుంచి శ్వాస బిందువులు ఇతరుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. పైగా కరోనా వైరస్ ప్రధానంగా నోరు, ముక్కు, కళ్ల నుంచే ఇతరులకు సోకుతుంది కాబట్టి కంటి వైద్యం అత్యంత జాగ్రత్తలతో చేయాలి. కంటి పరీక్ష, ఇతరత్రా టెస్టులు చేయాల్సి వస్తే తగిన జాగ్రత్తలతో రోగులను కలవవచ్చు. కంటి ఆసుపత్రులకు ఇవీ మార్గదర్శకాలు ► కంటికి ప్రమాదం ఏర్పడుతుందని భావించిన, దృష్టిలోపం వచ్చే అవకాశం ఉందని గుర్తించిన, చికిత్స చేయకపోతే అంధకారం అవుతుందని భావించిన వాటినే అత్యవసర కేసులుగా గుర్తించాలి. ► కంటికి గాయమవడం, ఆకస్మిక దృష్టిలోపం, కంటిలో తీవ్రమైన నొప్పి, తీవ్రమైన కనురెప్పల గాయాలకు తగిన వైద్యం చేయాలి. ► అత్యవసర కేసులకే ప్రాధాన్యమివ్వాలి. ఒక రోగితో ఒక సహాయకుడినే అనుమతించాలి. ► బాధితులకు కనీసం ఆరడుగుల దూరంలో ఉండాలి. వైద్య సిబ్బంది, బాధితులు మాస్క్‌లు తప్పక వాడాలి. తరచూ చేతులు కడుక్కోవాలి. సాధ్యమైన చోట ఆల్క హాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను వాడాలి. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు మోచేతిని అడ్డుపెట్టుకోవాలి. ► వచ్చినవారిలో ఎవరిౖMðనా కరోనా అనుమానిత లక్షణాలుంటే రాష్ట్ర, జిల్లా హెల్ప్‌లైన్‌కు వెంటనే తెలపాలి. రోగులు, వారి సహాయకుల ఫోన్ నంబర్లు, గుర్తింపు కార్డుల వివరాలను తీసుకోవాలి. ► రోగి శ్వాస నుండి బిందువులు మీద పడకుండా నివారించడానికి శ్వాస కవచం వాడాలి. ► థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాకే ఆసుపత్రి లేదా క్లినిక్‌లోకి ప్రవేశం కల్పించాలి. రోగికి కరోనా లక్షణాలున్నాయో లేదో ఆరాతీయాలి. ► రిసెప్షన్లో ఎక్కువమంది గుమికూడకుండా చూడాలి. ► స్వచ్ఛమైన గాలి తీసుకునేలా ఏర్పాట్లు ఉండాలి. క్రాస్ వెంటిలేషన్ తగినంతగా ఉండాలి. ► సందర్శకులు లేదా రోగులు, ఇతర బాధితులు వదిలిపెట్టిన మాస్క్‌లను, గ్లోవ్స్‌ను బయో–మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలకు అనుగుణంగా పారవేయాలి. ఆసుపత్రిని హైపోక్లోరైడ్‌తో క్రిమిసంహారకం చేయాలి. ► డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలి. -
చిన్న‘చూపు’
సత్తుపల్లిటౌన్ (ఖమ్మం): కంటివెలుగు పేరిట నిర్వహిస్తున్న వైద్యశిబిరాలపై పట్టింపు కానరావట్లేదు. దృష్టి లోప నివారణే లక్ష్యంగా ఎంతో ప్రచారం చేసి..ఆర్భాటంగా శిబిరాలు నిర్వహించినప్పటికీ..కంటిచూపు సమస్యలతో బాధ పడేవారికి మాత్రం ఉపశమనం లభించడంలేదు. కావాల్సిన కళ్లజోళ్లు, ఇవ్వాల్సిన మందుల లోపాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ల కోసం ఎంపికచేసిన వారికి ఇంతరవకు..శస్త్రచికిత్సలు నిర్వహించకపోవడం ప్రధాన లోపంగా మారింది. అసలు..ఈ కంటివెలుగు ప్రక్రియపై చిన్నచూపు చూస్తున్నారని, ఎవ్వరూ పట్టించుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూపు మందగించడం, కళ్ల మంటలు, ఇతర నేత్ర సమస్యలతో వచ్చిన వారికి పరీక్షలు సాఫీగా సాగుతున్నా..శస్త్రచికిత్సలు నిర్వహించట్లేదు. ప్రత్యేక కళ్లద్దాలు అందకపోవడం, చుక్కల మందు, డి–విటమిన్ మందుబిల్లల కొరతతో జిల్లాలో కంటి వెలుగు మసకబారుతోంది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల హడావిడితో అధికార యంత్రాంగం ఇటువైపు దృష్టి పెట్టకపోవడంతో అవాంతరాలు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15న ప్రారంభించిన ఈ కార్యక్రమం రెండు నెలలుగా సాగుతోంది. పరీక్షలపై ఉన్న శ్రద్ధ.... శస్త్రచికిత్సలు, కళ్లద్దాలు, మందుల పంపిణీపై కనిపించట్లేదు. క్షేత్ర స్థాయిలో కంటి వెలుగు కేంద్రాల్లో విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బందికి సైతం వీటి సరఫరాపై సమాచారం లేకపోవడంతో ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు ఇస్తామో..? అని వైద్యసిబ్బందే సమాధానం చెప్పలేకపోతున్నారు. దీంతో కొన్నిచోట్ల రోగులు కంటి అద్దాల కోసం వైద్య సిబ్బందితో గొడవలకు దిగుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆపరేషన్లు ఎప్పుడు జేస్తరో..? నేత్ర పరీక్షల్లో 17,165 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించి రిఫర్ చేశారు. ఇప్పటి వరకు నామమాత్రంగానే చికిత్సలు జరిగాయి. మిగిలిన వారు తమకు కంటి ఆపరేషన్ల కోసం ఎప్పుడు పిలుపు వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. వీరిలో క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్నావారే ఎక్కువ. దగ్గర చూపులోపం ఉన్నవారికి అద్దాలు అరకొరగానే ఉండటం, దూరదృష్టిలోపం ఉన్నవారికి 60 రోజులు అవుతున్నా, ఇంతవరకు ప్రత్యేక అద్దాలు అందించకపోవడంతో ఆందోళన నెలకొంటోంది. వైద్య శిబిరాల్లో ఎంతో ఆశగా వరుసల్లో నిలబడి వేలాదిమంది కంటి పరీక్షలు చేయించుకుంటున్నా..చివరికి వీరికి లబ్ధిచేకూరట్లేదు. కళ్లజోళ్ల కొరతతోనే ఇబ్బందులు.. కంటి సమస్యలకు అవసరమైన వారికి అందించాల్సిన కళ్లజోళ్ల కొరత రోగులను ఇబ్బంది పెడుతోంది. గత రెండు నెలలుగా జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 162 గ్రామాలు, మున్సిపాలిటీల్లోని 23 వార్డుల్లో 1.07 లక్షల మందికి వైద్య బృందాలు కంటి పరీక్షలు నిర్వహించాయి. జిల్లాలోని 21 మండలాల్లో 32 వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. దగ్గరచూపు కళ్లజోళ్లు మినహా ఇతర ప్రత్యేక అద్దాలు అందించిన దాఖలాలు లేవు. రోగులకు ఇవి ఎప్పుడిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వేలాది మంది మధ్యవయస్సు వారు, వృద్ధులు కళ్లజోళ్లు అందక పోవడంతో నిరాశ చెందుతున్నారు. రెండు నెలలుగా చూస్తున్నా.. కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేశారు. ఆపరేషన్ చేయాలన్నారు. రెండు నెలలైంది. ఇంతవరకు ఏ జాడా లేదు. కళ్లు కనిపించక ఇబ్బంది పడుతున్నా. కంటి సమస్యకు ఆపరేషన్ చేస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నా. – సీహెచ్.సావిత్రి, సత్తుపల్లి -
అద్దాల్లేవ్..
వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లిలో మంగళవారం కంటి వెలుగు క్యాంపునకు 232 మంది హాజరుకాగా పరీక్షలు నిర్వహించి, వారిలో 135 మందికి కంటి అద్దాలు అవసరం అని నిర్ధారించారు. అలాగే 15 మందికి శస్త్ర చికిత్స అవసరమని సిఫార్సు చేశారు. దగ్గరి చూపు సమస్యతో బాధపడుతున్న 61 మందికే కంటి అద్దాలు అందుబాటులో ఉండగా వారికే అందించారు. దూరపు చూపు సమస్యతో బాధపడుతున్న 75 మందికి కంటి అద్దాల కోసం అర్డర్ కోసం ఆన్లైన్లో నమోదు చేశారు. వారికి అక్టోబర్ 5న వస్తాయని, ఇంటికి ఆశ వర్కర్ తీసుకొచ్చి ఇస్తారని చెప్పారు. దీంతో కంటి అద్దాలు అందిస్తారని ఆశతో వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. సాక్షి, వరంగల్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో పరీక్షలు చేయించుకున్న దూరపు చూపు బాధితులకు అద్దాలు అందుబాటులో లేవు. ఆ అద్దాల కోసం వైద్య సిబ్బంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టగా నెల రోజుల గడువు చూపిస్తోంది. దీంతో కంటి పరీక్షలకు వెళ్లిన దూరపు చూపు బాధితులు క్యాంపు నుంచి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు), ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి కేంద్రంలో కంటి పరీక్షలకు ఐదు గదులు ఏర్పాటు చేశారు. వీటిలో రిజిస్ట్రేషన్, తర్వాత కంటి పరీక్ష, వైద్యుడి పరీక్ష, కంప్యూటర్ పరీక్ష, కంటి అద్దాల పంపిణీ గదులు ఉన్నాయి. కాగా గ్రామాల్లో ప్రతి వంద మందిలో సగటున 30 మందికిపైగా కంటి సమస్యతో బాధపడుతున్నట్లు కంటి పరీక్షల నివేదికలు వెల్లడిస్తున్నాయి. దూరపు చూపు అద్దాలు.. నెల రోజులకు.. కంటి చూపులో దూరపు, దగ్గరి చూపు సమస్యతో బాధపడుతున్నవారు, అసలు కనబడని వారిని పరీక్షల్లో గుర్తిస్తున్నారు. దగ్గరి చూపు కనబడడం లేదని డాక్టర్లు నిర్ధారిస్తే వెంటనే వారికి కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. దూరపు చూపు కనబడని వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ఆర్డర్ పెడుతున్నారు. రెండు కళ్లకు ఒకే రకమైన సైట్ ఉంటేనే కంటి అద్దాలు అందిస్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేయగా 30 రోజుల తర్వాత కంటి అద్దాలు వస్తాయనే సమాచారం వస్తోంది. దీంతో బాధితులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అసలు కంటి అద్దాలు వస్తాయో.. రావో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుబాటులో తొమ్మిది రకాల అద్దాలే.. కంటి వెలుగు పథకంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి వెంటనే అందించేందుకు ప్రభుత్వం 9 రకాల కంటి అద్దాలనే అందుబాటులో ఉంచారు. 1.0 ఆర్‌ఎంబీఎఫ్ నుంచి 2.5 ఆర్‌ఎంబీఎఫ్, 1.0 నుంచి 2.5 ఆర్ఎంబీ వరకు మాత్రమే కంటి అద్దాలు ఉన్నాయి. అనుకూల ఆస్పత్రులకే శస్త్ర చికిత్సకు రెఫర్.. కంటి వెలుగులో పరీక్షలు చేయించుకున్న వారికి కంటి శస్త్ర చికిత్స చేయాలని నిర్ధారించిన వారిని కొన్ని రెఫరల్ ఆస్పత్రులకు మాత్రమే సిఫార్సు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఏ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటా నంటే ఆ వైద్యశాలకు రెఫర్ చేయాల్సి ఉండగా అలా క్యాంప్‌లో జరగడం లేదు. ఆయా కంటి ఆస్పత్రులతో కొందరు మిలాఖతై వారి ఆస్పత్రికే ఎక్కువగా రెఫర్ చేస్తున్నారని సమాచారం. నిరాశగా పోతున్నా కంటి పరీక్షలు చేస్తున్నారంటే వచ్చి చేయించుకున్నా. –1, –2 సైట్ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. కంటి అద్దాలు ఇచ్చే దగ్గరికి వెళ్లి చిట్టీ చూపిస్తే ట్యాబ్‌లో ఎంటర్ చేశారు. నెల రోజుల తర్వాత కంటి అద్దాలు వస్తాయని చెప్పారు. దీంతో నిరాశతో పోతున్నా. వస్తాయో లేదో మరి.. చూడాలి. – సారయ్య, దుగ్గొండి ఆర్డర్ తీసుకుంటున్నాం జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం బాగా జరుగుతోంది. అందుబాటులో లేని కంటి అద్దాలు ఆర్డర్ తీసుకుంటున్నాం. ఆర్డర్ పెట్టిన కంటి అద్దాలు రాగానే అందిస్తాం. ప్రభుత్వం నుంచి వచ్చిన అద్దాలను వెంటనే అందిస్తున్నాం. –డాక్టర్ వెంకటరమణ, డీఎంఅండ్‌హెచ్‌ఓ, వరంగల్ రూరల్ -
టార్చిలైట్ వెలుగులో కంటి ఆపరేషన్లు
ఉన్నావ్(ఉత్తరప్రదేశ్): టార్చిలైటు వెలుతురులో 32 మందికి కంటి శుక్లాల ఆపరేషన్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. ఉన్నావ్ దగ్గర్లోని నవాబ్‌గంజ్‌లోని ఓ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం ఘటనపై విచారణకు ఆదేశించింది. ఘటనపై ఆరోగ్య మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నావ్ ప్రధాన వైద్య అధికారి(సీఎంవో) రాజేంద్ర ప్రసాద్‌ను సస్పెండ్ చేశారు. హెల్త్ సెంటర్ ఇన్చార్జిని తొలగించారు. కాగా, ఆపరేషన్ తర్వాత రోగులను నేలమీద పడుకోబెట్టారని పలువురు ఆరోపించారు. ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తడం, పవర్ బ్యాకప్ లేకపోవడంతో టార్చిలైటు వెలుతురులో శస్త్రచికిత్సలు చేసినట్లు తెలుస్తోంది. -
షార్ప్ ఆపరేషన్
రోబోలు రోజురోజుకీ తెలివిమీరిపోతున్నాయి. ఎంతగానంటే... మన అవయవాలన్నింటిలో అతి ముఖ్యమని చెప్పుకునే కంటిపై ఏర్పడే అతి పలుచటి శుక్లాలను కూడా కచ్చితంగా తొలగించేంతగా! అవునండి... ఈ ఫొటోలో కనిపిస్తున్న ‘ఆక్సిస్’ రోబో.. కంటి శుక్లాల ఆపరేషన్‌ను అతిసులువుగా చేసేయగలదు. దీనిని కేంబ్రిడ్జ్ కన్సల్టెంట్స్ సంస్థ ఆవిష్కరించింది. వయసు మీదపడుతున్న కొద్దీ, లేదా ఇతర కారణాల వల్ల కనుగుడ్డుపై పలుచటి పొరలు ఏర్పడటాన్ని శుక్లాలు అంటారన్న విషయం తెలిసిందే. కనుగుడ్డుపై చిన్న గాటు పెట్టి ఈ పొరను తొలగించడంతోపాటు, ఆ స్థానంలో కాంటాక్ట్ లెన్స్‌ల మాదిరిగా ఒక ప్లాస్టిక్ లెన్స్‌ను ఏర్పాటు చేయడం ‘క్యాటరాక్ట్’ ఆపరేషన్ ఉద్దేశం. అతి సున్నితమైన ఈ శస్త్రచికిత్సను ప్రస్తుతానికైతే డాక్టర్లే చేస్తున్నారు. ఆక్సిస్ అందరికీ అందుబాటులోకి వస్తే మాత్రం పరిస్థితి మారిపోతుంది. చేతుల్లాంటి నిర్మాణాలు రెండు ఉన్న ఆక్సిస్ అరంగుళం సైజున్న కనుగుడ్డుపై కూడా స్పష్టంగా అటుఇటూ కదలగలదు. కొంచెం దూరంలో కూర్చున్న నిపుణుడు ఈ చేతులను నియంత్రిస్తుంటాడు. అంతే. వైద్యరంగంలో శస్త్రచికిత్సలు చేసే రోబోలు ఇప్పటికే అనేకం ఉన్నాయి. ‘డావిన్సీ’ రోబో గత ఏడాది ఒక్క అమెరికాలోనే ఊపిరితిత్తులు, అపెండిక్స్ వంటి ఆపరేషన్లు దాదాపు 5 లక్షల వరకూ చేసేసింది. ఇప్పుడీ ఆక్సిస్ కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తే మరెంతో మందికి మేలు జరుగుతుంది.