ఆరుషి అగర్వాల్ గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన అమ్మాయి. తల్లిదండ్రుల వృత్తి వ్యాపారాల రీత్యా హాంగ్‌కాంగ్‌లో పుట్టింది. సింగపూర్, యూఎస్‌లలో చదువుకుంది. ఏడేళ్ల కిందట ఆమె తన సొంత దేశం ఇండియాకి వచ్చింది. ఆ రావడమే ఆమె జీవన ప్రస్థానాన్ని నిర్దేశించింది. సేవా కార్యక్రమాల అవసరాన్ని గుర్తించింది. అందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడానికి సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారింది.
ఆరుషి యూఎస్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుని ఏడేళ్ల కిందట ఇండియాకి వచ్చింది. ఆ పర్యటన ఆమెను జాగృతం చేసింది. ఆమె సమాజంలోని అంతరాలను దగ్గరగా చూసిందప్పుడే. వాళ్లది వ్యాపార కుటుంబం. తండ్రి హోటల్ పరిశ్రమ నడిపేవాడు. వాళ్ల కుటుంబానికి ఉన్న చైన్ రెస్టారెంట్‌ల నిర్వహణ బాధ్యత తల్లి చూసుకునేది.
కాటరాక్ట్ కారణంగా కంటి చూపు మసకబారితే ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేని కారణంగా చూపును శాశ్వతంగా కోల్పోయే వాళ్లుంటారనే కఠోరమైన వాస్తవం ఆమెకు అవగతమైంది ఇండియాకి వచ్చిన తర్వాత మాత్రమే. అది కూడా ముంబయిలోని పేద కుటుంబాలను దగ్గరగా చూసినప్పుడే. ముంబయిలో ఏ రోజుకు ఆ రోజు అన్నట్లు బతుకు వెళ్లదీస్తున్న అనేక కుటుంబాల్లో ఆదివాసీలే ఎక్కువ. వారికి కంటి ఆపరేషన్‌లు చేయించే బాధ్యత మనసావాచా చేపట్టింది ఆరుషి.
ఇదీ ఓ మార్గమే!
ఆలోచన మంచిదే, కానీ ఆచరణ ఎలాగ? ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా సరే... నిధులు సమకూర్చుకోవడం మొదట జరగాల్సిన పని. విరాళాల కోసం ఇంట్లో వాళ్ల ముందు కూడా చేయి చాచకూడదనుకుంది. సొంతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనుకుంది ఆరుషి. ‘సేవ’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. పదిహేను మంది మహిళలకు సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ తయారీలో శిక్షణనిచ్చి మరీ వారికి ఉద్యోగం ఇచ్చింది.
ఇటలీ, ఫ్రాన్స్‌లలో తప్ప మనదేశంలో దొరకని అరోమాటిక్ క్యాండిల్స్ తయారు చేసి ఆన్‌లైన్‌లో అమ్మకాలు మొదలు పెట్టింది ఆరుషి. వాటి ధరలు సామాన్యులకు కాదు కదా మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతికి కూడా భారమే. ఒక్కో క్యాండిల్ పద్నాలుగు వందల నుంచి ఎనిమిది వేల రూపాయలుంటుంది. ‘ఈ క్యాండిల్ మీ ఇంట్లో చీకటిని తొలగించి వెలుగును నింపుతుంది. మీరు ఈ క్యాండిల్ కొనడం ద్వారా మరొకరికి కంటి వెలుగును ప్రసాదించినవారవుతారు’ అని చెప్పి మరీ ఆ ధరకు అమ్ముతోంది.
పరోక్ష సాయం!
‘సమాజంలో అభాగ్యులకు నేరుగా సేవ చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఈ క్యాండిల్ కొనడం వల్ల పరోక్షంగా సహాయం చేయగలుగుతాం’ అనుకున్న వాళ్లు వీటిని విరివిగా కొంటున్నారు. పదిహేను మంది మహిళలకు ఉపాధి, కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోలేని వాళ్లకు ఆపరేషన్‌కు ఆసరా... ఈ రెండు ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. దీంతో వెలుగులు మన ఇంటికే పరిమితం కావాలనే స్వార్థం వీడి ఇతరుల జీవితాల్లో కూడా వెలుగులు నింపాలనుకునే వాళ్లు ఆరుషికి ఆలంబనగా నిలుస్తున్నారు.
ఇప్పటి వరకు ఆమె వెయ్యికి పైగా ఆపరేషన్‌లు చేయించింది. ‘ఇలాంటి క్యాండిల్స్‌ని ఇటలీ, ఫ్రాన్స్‌ల నుంచి కొనగలిగిన వారే నా కస్టమర్లు. వాళ్లు ఆ దేశాల నుంచి కొనడం కంటే మనదేశంలోని స్టార్టప్‌కి సహాయం చేయడానికే ఇష్టపడుతున్నారు, పైగా ఇది చారిటీ కోసం చేస్తున్న పని కావడంతో సంతోషంగా తమ వంతు విరాళం ఇచ్చినట్లు భావిస్తున్నారు’ అని చెప్తోంది ఆరుషి. మంచి పని చేయాలనే చిత్తశుద్ధి ఉంటే మార్గం కూడా దానంతట అదే గోచరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment