Golden Spoon
-
ఈ దీపాలు కంటి వెలుగులు
ఆరుషి అగర్వాల్ గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన అమ్మాయి. తల్లిదండ్రుల వృత్తి వ్యాపారాల రీత్యా హాంగ్‌కాంగ్‌లో పుట్టింది. సింగపూర్, యూఎస్‌లలో చదువుకుంది. ఏడేళ్ల కిందట ఆమె తన సొంత దేశం ఇండియాకి వచ్చింది. ఆ రావడమే ఆమె జీవన ప్రస్థానాన్ని నిర్దేశించింది. సేవా కార్యక్రమాల అవసరాన్ని గుర్తించింది. అందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడానికి సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారింది. ఆరుషి యూఎస్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుని ఏడేళ్ల కిందట ఇండియాకి వచ్చింది. ఆ పర్యటన ఆమెను జాగృతం చేసింది. ఆమె సమాజంలోని అంతరాలను దగ్గరగా చూసిందప్పుడే. వాళ్లది వ్యాపార కుటుంబం. తండ్రి హోటల్ పరిశ్రమ నడిపేవాడు. వాళ్ల కుటుంబానికి ఉన్న చైన్ రెస్టారెంట్ల నిర్వహణ బాధ్యత తల్లి చూసుకునేది. కాటరాక్ట్ కారణంగా కంటి చూపు మసకబారితే ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేని కారణంగా చూపును శాశ్వతంగా కోల్పోయే వాళ్లుంటారనే కఠోరమైన వాస్తవం ఆమెకు అవగతమైంది ఇండియాకి వచ్చిన తర్వాత మాత్రమే. అది కూడా ముంబయిలోని పేద కుటుంబాలను దగ్గరగా చూసినప్పుడే. ముంబయిలో ఏ రోజుకు ఆ రోజు అన్నట్లు బతుకు వెళ్లదీస్తున్న అనేక కుటుంబాల్లో ఆదివాసీలే ఎక్కువ. వారికి కంటి ఆపరేషన్లు చేయించే బాధ్యత మనసావాచా చేపట్టింది ఆరుషి. ఇదీ ఓ మార్గమే! ఆలోచన మంచిదే, కానీ ఆచరణ ఎలాగ? ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా సరే... నిధులు సమకూర్చుకోవడం మొదట జరగాల్సిన పని. విరాళాల కోసం ఇంట్లో వాళ్ల ముందు కూడా చేయి చాచకూడదనుకుంది. సొంతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనుకుంది ఆరుషి. ‘సేవ’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. పదిహేను మంది మహిళలకు సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ తయారీలో శిక్షణనిచ్చి మరీ వారికి ఉద్యోగం ఇచ్చింది. ఇటలీ, ఫ్రాన్స్‌లలో తప్ప మనదేశంలో దొరకని అరోమాటిక్ క్యాండిల్స్ తయారు చేసి ఆన్లైన్లో అమ్మకాలు మొదలు పెట్టింది ఆరుషి. వాటి ధరలు సామాన్యులకు కాదు కదా మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతికి కూడా భారమే. ఒక్కో క్యాండిల్ పద్నాలుగు వందల నుంచి ఎనిమిది వేల రూపాయలుంటుంది. ‘ఈ క్యాండిల్ మీ ఇంట్లో చీకటిని తొలగించి వెలుగును నింపుతుంది. మీరు ఈ క్యాండిల్ కొనడం ద్వారా మరొకరికి కంటి వెలుగును ప్రసాదించినవారవుతారు’ అని చెప్పి మరీ ఆ ధరకు అమ్ముతోంది. పరోక్ష సాయం! ‘సమాజంలో అభాగ్యులకు నేరుగా సేవ చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఈ క్యాండిల్ కొనడం వల్ల పరోక్షంగా సహాయం చేయగలుగుతాం’ అనుకున్న వాళ్లు వీటిని విరివిగా కొంటున్నారు. పదిహేను మంది మహిళలకు ఉపాధి, కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోలేని వాళ్లకు ఆపరేషన్‌కు ఆసరా... ఈ రెండు ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. దీంతో వెలుగులు మన ఇంటికే పరిమితం కావాలనే స్వార్థం వీడి ఇతరుల జీవితాల్లో కూడా వెలుగులు నింపాలనుకునే వాళ్లు ఆరుషికి ఆలంబనగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె వెయ్యికి పైగా ఆపరేషన్లు చేయించింది. ‘ఇలాంటి క్యాండిల్స్‌ని ఇటలీ, ఫ్రాన్స్‌ల నుంచి కొనగలిగిన వారే నా కస్టమర్లు. వాళ్లు ఆ దేశాల నుంచి కొనడం కంటే మనదేశంలోని స్టార్టప్‌కి సహాయం చేయడానికే ఇష్టపడుతున్నారు, పైగా ఇది చారిటీ కోసం చేస్తున్న పని కావడంతో సంతోషంగా తమ వంతు విరాళం ఇచ్చినట్లు భావిస్తున్నారు’ అని చెప్తోంది ఆరుషి. మంచి పని చేయాలనే చిత్తశుద్ధి ఉంటే మార్గం కూడా దానంతట అదే గోచరిస్తుంది. -
వారసత్వమున్నా.. వార్‌తత్వమే మిన్న
ఒక రంగంలో ప్రముఖుడిగా వెలుగుతున్న వ్యక్తికి వారసులు కావడం అంటే గోల్డెన్ స్పూన్‌తో ‘రంగ’ప్రవేశం చేసినట్టే అనుకోవడం లేదు నవ యువత. పెద్దల కీర్తి ప్రతిష్టల వెలుగుల్లో తమ జీవితం ప్రకాశించాలని కాకుండా.. స్వీయ ప్రతిభ మీద తమను తాము నిరూపించుకోవాలని కోరుకుంటోంది. తద్వారా తమకంటూ ప్రత్యేక గుర్తింపును స్పష్టంగా డిమాండ్ చేస్తోంది. పెద్దోళ్ల ముద్రలో వచ్చేది పేరూ కాదు యుద్ధం చేయకుండా వరించేది విజయమూ కాదంటున్నారు నవ యువ‘వార్’సులు. - ఎస్.సత్యబాబు ‘నాన్నగారితో నన్ను ఎలా పోలుస్తారు? ఆయనది 40 ఏళ్ల అనుభవం. నాది అందులో సగం కూడా లేదు. ఇక నా పెయింటింగ్ శైలి వేరు. ఆయనది వేరు. ఆయన సమయంలో ఉన్న కాలమాన పరిస్థితులు నేడు లేవు. ఇప్పుడున్న ఆధునిక సమాజం అప్పుడు ఊహకు కూడా అందదు’ అంటూ ఓర్పుగా వివరిస్తారు అఫ్జా. ప్రసిద్ధ చిత్రకారుడు ఫవాద్ తమకానత్ కుమార్తె అనే కేరాఫ్తో కళారంగంలోకి ప్రవేశించిన అఫ్జా.. సిటీలో యువ చిత్ర కళాకారిణిగా రాణిస్తున్నారు. అఫ్జాకు.. తరచుగా ఆర్ట్ సర్కిల్లో ఆమె తండ్రితో పోలిక వస్తుంటుంది. ఇది సహజమైన విషయమంటూనే, తనను, తన ప్రతిభను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆమె విన్నవిస్తుంటారు. ఎందుకంటే తండ్రి పేరు ప్రతిష్టల నీడ నుంచి బయటపడి తనను తాను నిరూపించుకోవాలని తపన పడే నవతరానికి ప్రతినిధి అఫ్జా. ప్లస్సూ అదే మైనస్సూ అదే... తల్లి లేదా తండ్రి రాణించిన రంగంలో వారసులుగా ప్రవేశించడం సులభమే. అయితే వారి ఇమేజ్ తాలూకు బరువు వీరిపై పడుతోంది. ఈ లాభనష్టాలను సమన్వయం చేసుకుంటూ యువతరం ముందుకు సాగుతోంది. ‘నాన్న రచయిత అయినా.. ఎప్పుడూ ‘రాసే’పనిలోకి వెళ్లాలని అనుకోలేదు. అందాల రాక్షసి చిత్రంలో పాటకు సరదాగా డమ్మీ లిరిక్స్ రాస్తే.. చాలా బాగున్నాయని అనడం, వాటినే వినియోగించడంతో.. రచయితగా నా ప్రస్థానం మొదలైంది’ అంటూ చెప్పిన సినీర చయిత వెన్నెలకంటి తనయుడు రాకేన్డుమౌళి.. ప్రస్తుతం తండ్రికి తన శైలి భిన్నం అని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. రచనలతో ఆగిపోకుండా, గాయకుడిగా మారారు. సినీ నటుడిగానూ మారనున్నారు. ‘నాన్నకు రచయితగా ఉన్న నేమూ, ఫేమూ ఒక తనయుడిగా నాకు ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే వాటి మీదే ఆధారపడి నా భవిష్యత్తును నిర్మించుకోవాలని నేను ఆశించడం లేదు. సొంతంగా సాధించుకున్నది ఇచ్చే సంతృప్తి ఎలా ఉంటుందో నాకు తెలుసు’ అంటారు రాకేన్డుమౌళి. తామేంటో నిరూపించుకుంటేనే తమకు భవిష్యత్తు అంటున్నారు. వెన్నెల కంటి పెద్ద కుమారుడు, తండ్రిలాగే రచయితగా కొనసాగుతున్న శశాంక్ సైతం స్ట్రెయిట్ చిత్రాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన రైటింగ్ స్టైల్‌ను ఏర్పాటు చేసుకుని తండ్రి ముద్ర పడకుండా ప్రయత్నిస్తున్నానన్నారు. తప్పని నీడ... ప్రముఖుల ముద్ర నుంచి బయటకు రావాలని స్వీయ ప్రతిభ ఉన్న ప్రతి కళాకారుడూ తపించినా అంత సులభం కాదంటున్నారు అజిత్నాగ్. ప్రముఖ దర్శకుడు బి.నర్సింగరావు కుమారుడిగా చిత్రాల రూపకల్పనలోకి ప్రవేశించిన అజిత్.. స్వల్ప కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, యాడ్ఫిల్మ్స్ను రూపొందించడంలో బిజీగా ఉన్నారు. ఇంకా తన తండ్రి నీడ తనను వెంటాడటంపై... ‘నాన్న తీసిన చిత్రాలు పూర్తిగా సోషల్ ఓరియెంటెడ్. నావన్నీ కమర్షియల్. నా స్టైల్లో నాకంటూ ఒక ఇమేజ్ వచ్చినా.. నర్సింగరావు గారి అబ్బాయిగానే మరింత రెస్పెక్ట్ దొరుకుతుందని చాలా సందర్భాల్లో తెలిసి వచ్చింది. దీనిని నేను అంగీకరించక తప్పదు’ అని అంటున్నారు అజిత్. అయితే, నిజమైన ఆర్టిస్ట్ చివరి శ్వాస వరకూ తనదైన ముద్ర వేసేందుకు పోరాడుతూనే ఉంటాడు. ‘ఎప్పటికైనా మా ఫాదర్ షాడో నుంచి బయటకు వస్తాననే నమ్మకం ఉంది’ అని అంటారు అజిత్. తాతలు, తండ్రుల పేర్లు చెప్పుకుని ఊరేగాలనో, ఊళ్లేలాలనో చేసే నిరరథక యత్నాలకు స్వస్తి చెప్పి.. తమ పేరెంట్స్‌కు తామే కేరాఫ్‌లుగా మారాలనే నవ యువ ఆలోచన అభినందనీయం. నిన్నటి వివేకానందుడి స్ఫూర్తితో నేటి వివేకవంతులైన యువతరం ముందుకు సాగాలని, తమనితాము నిరూపించుకోవాలని కోరుకుందాం.. జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు అందిద్దాం. -
రోడ్‌సైడ్ ఫుడ్ అదుర్స్
టీనేజ్‌లో దోస్తీ కట్టిన సిటీ అంటే హీరో అల్లూ శిరీష్‌కు చాలా ఇష్టం. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన తనకులైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలో నేర్పింది మాత్రం హైదరాబాదే అంటాడు. జూబ్లీహిల్స్‌లో రిచ్లైఫ్.. యూసుఫ్‌గూడలో రోడ్‌సైడ్ రుచులు.. మెగామాల్స్లో షాపింగ్.. ఇవన్నీ మనోడికి కిక్ ఇచ్చేవే. ఈ ఫ్రెండ్లీ సిటీని సొంతిల్లులా ఫీలవుతానని చెబుతున్న.. అల్లూ వారి చిన్నోడు ఐ లవ్ హైదరాబాద్ అంటున్నాడు. ఈ నగరంతో తనకున్న రిలేషన్‌ను ‘సిటీప్లస్’తో పంచుకున్నాడు. ..:: శిరీష చల్లపల్లి పుట్టింది చెన్నైలో. నాకు 13 ఏళ్లు వచ్చే వరకు అక్కడే పెరిగాను. తర్వాతి సంవత్సరం హైదరాబాద్ వచ్చేశా. స్కూల్‌డేస్‌లో టీచర్లను బాగా ఇమిటేట్ చేసేవాణ్ని. అప్పట్నుంచే సినిమాలంటే పిచ్చి. ఫ్రెండ్స్‌తో కలసి విపరీతంగా సినిమాలు చూసేవాడిని. వారానికి రెండు చొప్పున ఏటా ఓ వంద సినిమాలు నా అకౌంట్లో పడేవి. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ ఇలా అన్ని భాషల సినిమాలు చూసేవాడిని. ఇప్పుడైతే మల్టీప్లెక్స్‌లు వచ్చాయి గాని.. అప్పట్లో సత్యం, గోకుల్, లక్ష్మీకళ థియేటర్లలో ఆడియన్స్ గోల మధ్య.. ఫ్రెండ్స్‌తో కలసి సినిమా చూస్తే ఆ థ్రిల్లే వేరు. సినిమా అయిపోయాక ఆ స్టోరీ డిస్కస్ చేయడం ఇంకా సరదాగా అనిపించేది. ఇప్పటికీ నేను సినిమాలంటే మామూలు థియేటర్సే ప్రిఫర్ చేస్తాను. ఇంట్లో పెద్ద జిమ్ సెటప్ ఉన్నా.. ఫ్రెండ్స్‌తో బయట జిమ్‌కు వెళ్తుంటాను. ఆహా ఏమి రుచి.. సిటీ రోడ్లపై కార్లపై తిరగడం కన్నా ఫ్రెండ్స్‌తో బైక్ మీద చక్కర్లు కొడితేనే మజాగా ఉంటుంది. ఈవినింగ్ యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ ఏరియాలో రోడ్ సైడ్ చైనీస్ బండి మీద ఫ్రైడ్‌రైస్ టే స్ట్ అదిరిపోతుంది. జూబ్లీహిల్స్ మహారాజా చాట్ సూపర్బ్‌గా ఉంటుంది. టోలిచౌకీ లోని షా గౌస్ లో హలీం రుచి ఇంకెక్కడా దొరకదు. షాపింగ్ అంటే ఇనార్బిట్ మాల్ వెళ్తుంటాను అదీ వీక్ డేస్‌లోనే. ఫ్రీ టైం దొరికితే రిలేటివ్ ఇళ్లకు వెళ్తుంటాను. చిల్డ్ ఆటిట్యూడ్.. సిటీ నాకు సొంతిల్లులా అనిపిస్తుంటుంది. హైదరాబాదీలు చాలా స్పెషల్‌గా కనిపిస్తారు. చిల్డ్ ఆటిట్యూడ్ ఉంటుంది వారిలో. వీళ్ల లైఫ్‌స్టైల్ డిఫరెంట్. చాలా సరదాగా ఉంటారు. నాకు ఎంజాయ్మెంట్ నేర్పింది ఈ సిటీనే. ఇక్కడ జనాలను చూస్తుంటే సెకండ్ ఇండియాలా కనిపిస్తుంది. రంజాన్ మాసంలో చార్మినార్ అందాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. రంగురంగుల కాంతులీనే చార్మినార్.. చుట్టూ ఆ షాపింగ్ కోలాహలం..జబర్దస్త్‌గా ఉంటుంది. లాస్ట్ దట్ ఫీల్ నేను సిటీకొచ్చిన కొత్తలో జూబ్లీహిల్స్ సూపర్‌గా ఉండేది. విశాలమైన రోడ్లు ఖాళీగా ఉండేవి. ఇళ్లు విసిరి పారేసినట్టు అక్కడొకటి.. ఇక్కడొకటి ఉండేవి. వెదర్ కూడా చాలా కూల్‌గా ఉండేది. అప్పటికి, ఇప్పటికి అసలు పోలికే లేదు. కాంక్రిట్ బిల్డింగ్స్, భారీ మాల్స్, ట్రా‘ఫికర్’ ఇవన్నీ సిటీని మనసుకు దూరం చేస్తున్నాయనిపిస్తుంది. జూబ్లీహిల్స్ క్లబ్లో అప్పట్లో షటిల్ గేమ్ ఆడి మూవీస్ చూసి అక్కడే స్విమింగ్ చేసి అక్కడే తినేవాడిని. ఇప్పుడు ఆ ఫీలింగ్ రావడం లేదు. ఐ రియల్లీ లాస్ట్ దట్ ఫీల్.