రోడ్‌సైడ్ ఫుడ్ అదుర్స్
టీనేజ్‌లో దోస్తీ కట్టిన సిటీ అంటే హీరో అల్లూ శిరీష్‌కు చాలా ఇష్టం. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన తనకులైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలో నేర్పింది మాత్రం హైదరాబాదే అంటాడు. జూబ్లీహిల్స్‌లో రిచ్‌లైఫ్.. యూసుఫ్‌గూడలో రోడ్‌సైడ్ రుచులు.. మెగామాల్స్‌లో షాపింగ్.. ఇవన్నీ మనోడికి కిక్ ఇచ్చేవే. ఈ ఫ్రెండ్లీ సిటీని సొంతిల్లులా ఫీలవుతానని చెబుతున్న.. అల్లూ వారి చిన్నోడు ఐ లవ్ హైదరాబాద్ అంటున్నాడు. ఈ నగరంతో తనకున్న రిలేషన్‌ను ‘సిటీప్లస్’తో పంచుకున్నాడు.
..:: శిరీష చల్లపల్లి
పుట్టింది చెన్నైలో. నాకు 13 ఏళ్లు వచ్చే వరకు అక్కడే పెరిగాను. తర్వాతి సంవత్సరం హైదరాబాద్ వచ్చేశా. స్కూల్‌డేస్‌లో టీచర్లను బాగా ఇమిటేట్ చేసేవాణ్ని. అప్పట్నుంచే సినిమాలంటే పిచ్చి. ఫ్రెండ్స్‌తో కలసి విపరీతంగా సినిమాలు చూసేవాడిని. వారానికి రెండు చొప్పున ఏటా ఓ వంద సినిమాలు నా అకౌంట్లో పడేవి. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ ఇలా అన్ని భాషల సినిమాలు చూసేవాడిని.
ఇప్పుడైతే మల్టీప్లెక్స్‌లు వచ్చాయి గాని.. అప్పట్లో సత్యం, గోకుల్, లక్ష్మీకళ థియేటర్లలో ఆడియన్స్ గోల మధ్య.. ఫ్రెండ్స్‌తో కలసి సినిమా చూస్తే ఆ థ్రిల్లే వేరు. సినిమా అయిపోయాక ఆ స్టోరీ డిస్కస్ చేయడం ఇంకా సరదాగా అనిపించేది. ఇప్పటికీ నేను సినిమాలంటే మామూలు థియేటర్సే ప్రిఫర్ చేస్తాను. ఇంట్లో పెద్ద జిమ్ సెటప్ ఉన్నా.. ఫ్రెండ్స్‌తో బయట జిమ్‌కు వెళ్తుంటాను.
ఆహా ఏమి రుచి..
సిటీ రోడ్లపై కార్లపై తిరగడం కన్నా ఫ్రెండ్స్‌తో బైక్ మీద చక్కర్లు కొడితేనే మజాగా ఉంటుంది. ఈవినింగ్ యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ ఏరియాలో రోడ్ సైడ్ చైనీస్ బండి మీద ఫ్రైడ్‌రైస్ టే స్ట్ అదిరిపోతుంది. జూబ్లీహిల్స్ మహారాజా చాట్ సూపర్బ్‌గా ఉంటుంది. టోలిచౌకీ లోని షా గౌస్ లో హలీం రుచి ఇంకెక్కడా దొరకదు. షాపింగ్ అంటే ఇనార్బిట్ మాల్ వెళ్తుంటాను అదీ వీక్ డేస్‌లోనే. ఫ్రీ టైం దొరికితే రిలేటివ్ ఇళ్లకు వెళ్తుంటాను.
చిల్డ్ ఆటిట్యూడ్..
సిటీ నాకు సొంతిల్లులా అనిపిస్తుంటుంది. హైదరాబాదీలు చాలా స్పెషల్‌గా కనిపిస్తారు. చిల్డ్ ఆటిట్యూడ్ ఉంటుంది వారిలో. వీళ్ల లైఫ్‌స్టైల్ డిఫరెంట్. చాలా సరదాగా ఉంటారు. నాకు ఎంజాయ్‌మెంట్ నేర్పింది ఈ సిటీనే. ఇక్కడ జనాలను చూస్తుంటే సెకండ్ ఇండియాలా కనిపిస్తుంది. రంజాన్ మాసంలో చార్మినార్ అందాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. రంగురంగుల కాంతులీనే చార్మినార్.. చుట్టూ ఆ షాపింగ్ కోలాహలం..జబర్దస్త్‌గా ఉంటుంది.
లాస్ట్ దట్ ఫీల్
నేను సిటీకొచ్చిన కొత్తలో జూబ్లీహిల్స్ సూపర్‌గా ఉండేది. విశాలమైన రోడ్లు ఖాళీగా ఉండేవి. ఇళ్లు విసిరి పారేసినట్టు అక్కడొకటి.. ఇక్కడొకటి ఉండేవి. వెదర్ కూడా చాలా కూల్‌గా ఉండేది. అప్పటికి, ఇప్పటికి అసలు పోలికే లేదు. కాంక్రిట్ బిల్డింగ్స్, భారీ మాల్స్, ట్రా‘ఫికర్’ ఇవన్నీ సిటీని మనసుకు దూరం చేస్తున్నాయనిపిస్తుంది. జూబ్లీహిల్స్ క్లబ్‌లో అప్పట్లో షటిల్ గేమ్ ఆడి మూవీస్ చూసి అక్కడే స్విమింగ్ చేసి అక్కడే తినేవాడిని. ఇప్పుడు ఆ ఫీలింగ్ రావడం లేదు. ఐ రియల్లీ లాస్ట్ దట్ ఫీల్.