వారసత్వమున్నా.. వార్‌తత్వమే మిన్న | artatvame heritage of superior .. | Sakshi
Sakshi News home page

వారసత్వమున్నా.. వార్‌తత్వమే మిన్న

Published Sun, Jan 11 2015 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

వారసత్వమున్నా.. వార్‌తత్వమే మిన్న

వారసత్వమున్నా.. వార్‌తత్వమే మిన్న

ఒక రంగంలో ప్రముఖుడిగా వెలుగుతున్న వ్యక్తికి వారసులు కావడం అంటే గోల్డెన్ స్పూన్‌తో ‘రంగ’ప్రవేశం చేసినట్టే అనుకోవడం లేదు నవ యువత. పెద్దల కీర్తి ప్రతిష్టల వెలుగుల్లో తమ జీవితం ప్రకాశించాలని కాకుండా.. స్వీయ ప్రతిభ మీద తమను తాము నిరూపించుకోవాలని కోరుకుంటోంది. తద్వారా తమకంటూ ప్రత్యేక గుర్తింపును స్పష్టంగా డిమాండ్ చేస్తోంది. పెద్దోళ్ల ముద్రలో వచ్చేది పేరూ కాదు యుద్ధం చేయకుండా వరించేది విజయమూ కాదంటున్నారు నవ యువ‘వార్’సులు.
- ఎస్.సత్యబాబు
 
‘నాన్నగారితో నన్ను ఎలా పోలుస్తారు? ఆయనది 40 ఏళ్ల అనుభవం. నాది అందులో సగం కూడా లేదు. ఇక నా పెయింటింగ్ శైలి వేరు. ఆయనది వేరు. ఆయన సమయంలో ఉన్న కాలమాన పరిస్థితులు నేడు లేవు. ఇప్పుడున్న ఆధునిక సమాజం అప్పుడు ఊహకు కూడా అందదు’ అంటూ ఓర్పుగా వివరిస్తారు అఫ్జా. ప్రసిద్ధ చిత్రకారుడు ఫవాద్ తమకానత్ కుమార్తె అనే కేరాఫ్‌తో కళారంగంలోకి ప్రవేశించిన అఫ్జా.. సిటీలో యువ చిత్ర కళాకారిణిగా రాణిస్తున్నారు.

అఫ్జాకు.. తరచుగా ఆర్ట్ సర్కిల్‌లో ఆమె తండ్రితో పోలిక వస్తుంటుంది. ఇది సహజమైన విషయమంటూనే, తనను, తన ప్రతిభను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆమె విన్నవిస్తుంటారు. ఎందుకంటే  తండ్రి పేరు ప్రతిష్టల నీడ నుంచి బయటపడి తనను తాను నిరూపించుకోవాలని తపన పడే నవతరానికి ప్రతినిధి అఫ్జా.
 
ప్లస్సూ అదే మైనస్సూ అదే...
తల్లి లేదా తండ్రి రాణించిన రంగంలో వారసులుగా ప్రవేశించడం సులభమే. అయితే వారి ఇమేజ్ తాలూకు బరువు వీరిపై పడుతోంది. ఈ లాభనష్టాలను సమన్వయం చేసుకుంటూ యువతరం ముందుకు సాగుతోంది. ‘నాన్న రచయిత అయినా.. ఎప్పుడూ ‘రాసే’పనిలోకి వెళ్లాలని అనుకోలేదు. అందాల రాక్షసి చిత్రంలో పాటకు సరదాగా డమ్మీ లిరిక్స్ రాస్తే.. చాలా బాగున్నాయని అనడం, వాటినే వినియోగించడంతో.. రచయితగా నా ప్రస్థానం మొదలైంది’ అంటూ చెప్పిన సినీర చయిత వెన్నెలకంటి తనయుడు
 
రాకేన్‌డుమౌళి.. ప్రస్తుతం తండ్రికి తన శైలి భిన్నం అని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. రచనలతో ఆగిపోకుండా, గాయకుడిగా మారారు. సినీ నటుడిగానూ మారనున్నారు. ‘నాన్నకు రచయితగా ఉన్న నేమూ, ఫేమూ ఒక తనయుడిగా నాకు ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే వాటి మీదే ఆధారపడి నా భవిష్యత్తును నిర్మించుకోవాలని నేను ఆశించడం లేదు. సొంతంగా సాధించుకున్నది ఇచ్చే సంతృప్తి ఎలా ఉంటుందో నాకు తెలుసు’ అంటారు రాకేన్‌డుమౌళి. తామేంటో నిరూపించుకుంటేనే తమకు భవిష్యత్తు అంటున్నారు. వెన్నెల కంటి పెద్ద కుమారుడు, తండ్రిలాగే రచయితగా కొనసాగుతున్న శశాంక్ సైతం స్ట్రెయిట్ చిత్రాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన రైటింగ్ స్టైల్‌ను ఏర్పాటు చేసుకుని తండ్రి ముద్ర పడకుండా ప్రయత్నిస్తున్నానన్నారు.
 
తప్పని నీడ...
ప్రముఖుల  ముద్ర  నుంచి బయటకు రావాలని స్వీయ ప్రతిభ ఉన్న ప్రతి కళాకారుడూ తపించినా అంత సులభం కాదంటున్నారు అజిత్‌నాగ్. ప్రముఖ దర్శకుడు బి.నర్సింగరావు కుమారుడిగా చిత్రాల రూపకల్పనలోకి ప్రవేశించిన అజిత్.. స్వల్ప కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, యాడ్‌ఫిల్మ్స్‌ను రూపొందించడంలో బిజీగా ఉన్నారు.  ఇంకా తన తండ్రి నీడ తనను వెంటాడటంపై... ‘నాన్న తీసిన చిత్రాలు పూర్తిగా సోషల్ ఓరియెంటెడ్. నావన్నీ కమర్షియల్.

నా స్టైల్‌లో నాకంటూ ఒక ఇమేజ్ వచ్చినా.. నర్సింగరావు గారి అబ్బాయిగానే మరింత రెస్పెక్ట్ దొరుకుతుందని చాలా సందర్భాల్లో తెలిసి వచ్చింది. దీనిని నేను అంగీకరించక తప్పదు’ అని అంటున్నారు అజిత్. అయితే, నిజమైన ఆర్టిస్ట్ చివరి శ్వాస వరకూ తనదైన ముద్ర వేసేందుకు పోరాడుతూనే ఉంటాడు.

‘ఎప్పటికైనా మా ఫాదర్ షాడో నుంచి బయటకు వస్తాననే నమ్మకం ఉంది’ అని అంటారు అజిత్. తాతలు, తండ్రుల పేర్లు చెప్పుకుని ఊరేగాలనో, ఊళ్లేలాలనో చేసే నిరరథక యత్నాలకు స్వస్తి చెప్పి.. తమ పేరెంట్స్‌కు తామే కేరాఫ్‌లుగా మారాలనే నవ యువ ఆలోచన అభినందనీయం. నిన్నటి వివేకానందుడి స్ఫూర్తితో నేటి వివేకవంతులైన యువతరం ముందుకు సాగాలని, తమనితాము నిరూపించుకోవాలని కోరుకుందాం.. జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు అందిద్దాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement