షార్ప్ ఆపరేషన్
రోబోలు రోజురోజుకీ తెలివిమీరిపోతున్నాయి. ఎంతగానంటే... మన అవయవాలన్నింటిలో అతి ముఖ్యమని చెప్పుకునే కంటిపై ఏర్పడే అతి పలుచటి శుక్లాలను కూడా కచ్చితంగా తొలగించేంతగా! అవునండి... ఈ ఫొటోలో కనిపిస్తున్న ‘ఆక్సిస్’ రోబో.. కంటి శుక్లాల ఆపరేషన్‌ను అతిసులువుగా చేసేయగలదు. దీనిని కేంబ్రిడ్జ్ కన్సల్టెంట్స్ సంస్థ ఆవిష్కరించింది. వయసు మీదపడుతున్న కొద్దీ, లేదా ఇతర కారణాల వల్ల కనుగుడ్డుపై పలుచటి పొరలు ఏర్పడటాన్ని శుక్లాలు అంటారన్న విషయం తెలిసిందే. కనుగుడ్డుపై చిన్న గాటు పెట్టి ఈ పొరను తొలగించడంతోపాటు, ఆ స్థానంలో కాంటాక్ట్ లెన్స్‌ల మాదిరిగా ఒక ప్లాస్టిక్ లెన్స్‌ను ఏర్పాటు చేయడం ‘క్యాటరాక్ట్’ ఆపరేషన్ ఉద్దేశం.
అతి సున్నితమైన ఈ శస్త్రచికిత్సను ప్రస్తుతానికైతే డాక్టర్లే చేస్తున్నారు. ఆక్సిస్ అందరికీ అందుబాటులోకి వస్తే మాత్రం పరిస్థితి మారిపోతుంది. చేతుల్లాంటి నిర్మాణాలు రెండు ఉన్న ఆక్సిస్ అరంగుళం సైజున్న కనుగుడ్డుపై కూడా స్పష్టంగా అటుఇటూ కదలగలదు. కొంచెం దూరంలో కూర్చున్న నిపుణుడు ఈ చేతులను నియంత్రిస్తుంటాడు. అంతే. వైద్యరంగంలో శస్త్రచికిత్సలు చేసే రోబోలు ఇప్పటికే అనేకం ఉన్నాయి. ‘డావిన్సీ’ రోబో గత ఏడాది ఒక్క అమెరికాలోనే ఊపిరితిత్తులు, అపెండిక్స్ వంటి ఆపరేషన్లు దాదాపు 5 లక్షల వరకూ చేసేసింది. ఇప్పుడీ ఆక్సిస్ కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తే మరెంతో మందికి మేలు జరుగుతుంది.