
కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ చిక్కుల్లో పడ్డారు. తన దర్శకత్వం వహించిన రోబో సినిమా విషయంలో ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన రూ. 10 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ జప్తు చేసింది.మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ నెల 17న ఆయన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఒక సినిమా కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడినట్లు వచ్చిన కేసులలో ఇలా స్థిరాస్తులను ఎటాచ్ చేయడం ఇదే తొలిసారని ఈడీ అధికారులు పేర్కొంటున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ రోబో. శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సైంటిఫిక్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంలో ఎంథిరన్ పేరుతో ఈ మూవీని శంకర్ తెరకెక్కించారు. అయితే, ఈ కథను ‘జిగుబా’ను కాపీ కొట్టిసినిమా తెరకెక్కించారంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాపీరైట్ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని పిటిషన్‌లో తెలిపారు. ఈ కేసు విషయంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) నివేదిక శంకర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఈ క్రమంలో జిగుబా కథకు, రోబో సినిమాకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తేల్చేసింది. దీంతో శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. పూర్తి దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
2010లో రోబో రిలీజైన విషయం తెలిసిందే. రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా సుమారు రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా కోసం డైరెక్టర్ శంకర్ రెమ్యునరేషన్‌గా రూ.11.5 కోట్లు తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment