బడి పక్కింట్లో పాఠాలు వింటున్న విద్యార్థులు
కురవి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు–2 కార్యక్రమా న్ని నిర్వహించడంతో విద్యార్థులకు పక్కింట్లో తరగతులు నిర్వహించారు. పైగా ఈ కార్యక్రమాన్ని జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించడం గమనార్హం. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(జీ) శివారు తాట్య తండాలో గురువారం జరిగింది. తాట్య తండాలోని ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు–2 కార్యక్రమానికి ఆరోగ్య, వైద్య శాఖ సిబ్బంది ఏర్పాట్లు చేయగా, మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.
పాఠశాలలో కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేయడంతో ఆ పక్కనే భూక్య భద్రు అనే వ్యక్తి ఇంట్లో ఉపాధ్యాయురాలు పద్మ విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని సైతం అదే ఇంటి ఆవరణలో వడ్డించారు. దీనిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. కంటివెలుగు కార్యక్రమాన్ని వేరేచోట కాకుండా బడిలో నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం ఏమిటని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును తప్పుపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment