సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజ కవర్గంలో రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ వర్గీయులు దుర్భాలాడుకుంటూ తన్నులాడుకున్నారు. పరస్పరం బాహాబాహీకి దిగారు. రూ. 5 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసేందుకు రెడ్యానాయక్ బుధవారం ఉదయం కురవి మండలం బంగ్యా తండాకు చేరుకున్నారు.
మా ఊరికి ఏం అభివృద్ధి చేశావంటూ తండాకు చెందిన మంత్రి సత్యవతి వర్గీయుడైన మాజీ సర్పంచ్ హచ్చా నాయక్ అనుచరులు ఎమ్మెల్యే ప్రచార రథానికి అడ్డుతగిలారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనం ముందు భాగంలో టైర్ల కింద పడుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్యే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయకుండానే తండాలో ఏర్పాటు చేసిన సభ వద్దకు వెళ్లారు.
సభ వద్ద హచ్చానాయక్ తమ్ముడు కిషన్‌నాయక్ రభస చేస్తుండగా ఎమ్మెల్యే అనుచరుడు సింగ్యానాయక్, ఇతర వర్గీయులు అతనిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రతిగా మంత్రి సత్యవతి వర్గీయులు పెద్ద సంఖ్యలో రావడంతో ఇరువర్గాలూ ఒకరినొకరు కొట్టుకున్నారు. అంగీలు చిరిగిపోయినా ఎవ్వరూ తగ్గలేదు. చివరికి పోలీసులు వారించినా వినలేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ తండానుంచి బయటకు వెళ్తుండగా కారుకు అడ్డంగా పడుకున్నారు. పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించడంతో ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.
చదవండి: జడ్జి భర్తపై బీఆర్‌ఎస్ కార్యకర్తల దాడి.. ‘ఆస్పత్రికి వెళ్లాలి, దారి ఇవ్వండి’ అని అడిగినందుకు..
Comments
Please login to add a commentAdd a comment