సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో అధికార బీఆర్‌ఎస్ దూసుకుపోతోంది. మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్.. ప్రతిపక్ష పార్టీలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. 24 ఏళ్ల క్రితం పిడికెడు మందితో ఉద్యమాన్ని ప్రారంభించాం. తెలంగాణ వచ్చింది కాబట్టే మహబూబాబాద్ జిల్లా అయ్యింది. మన బాధలు ఎవరూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ ఎన్నిసార్లు మోసం చేసినా పట్టుబట్టి తెలంగాణ సాధించాం. మహబూబాబాద్ తండాల్లో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి కళకళలాడుతున్నాయి. గిరిజన ప్రాంతంలోనూ మెడికల్ కాలేజీని ప్రారంభించుకున్నాం. ఎన్నికల కోసం అబద్దాలు చెప్పడం లేదు. మొన్న మ్యానిఫెస్టో ప్రకటించాం. అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే బీఆర్‌ఎస్ గెలవాలి. మరింత ప్రగతి సాధించడానికి మీ దీవెన ఉండాలి. వెనుకబడిన గిరిజన ప్రాంతాన్ని మహబూబాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేసి రూపు రేఖలు మార్చాం.
కాంగ్రెస్ నాయకులు రేవంత్, ఉత్తమ్ రెడ్డిలు రైతు బంధు వద్దంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటలే కరెంట్ ఇవ్వాలంటున్నాడు. రైతులు ఆలోచించి మేలు చేసే ప్రభుత్వానికి ఓటు వేయాలి. కాంగ్రెస్ నాయకుల మాటలు వింటే గోస పడుతాం. కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలకు మోస పోవొద్దు.రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి శంకర్ నాయక్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని కోరారు.
రైతుబంధు వృథా అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అంటున్నారు. ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామని కొందరు అంటున్నారు. వారిని ముందుగా బంగాళాఖాతంలో వేయాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. కర్ణాటకలో కరెంట్ కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు ఎరువుల కోసం యుద్ధాలు జరిగేవి. పోలీసు స్టేషన్‌లో ఎరువులను అందించిన దాఖలు చూశాం. నేడు ఎరువులు కొరత లేదు అని అన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24గంటల కరెంట్ లేదు. రైతుబంధు, రైతుబీమా నేరుగా ఖాతాల్లో జమ అవుతున్నాయి. రైతుబంధు, పెన్షన్లను పెంచుకుంటూ ముందుకు వెళ్తాం అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment