సాక్షి, మహబూబాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నూతన జిల్లాగా ఏర్పడిన తరువాత నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంతోపాటు, సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీ శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా సీఎం పర్యటించే ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మరమ్మతుల పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌లతోపాటు మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావులతో సమీక్ష నిర్వహించారు. బీఆర్‌ఎస్, కలెక్టర్ కార్యాలయాల ప్రారంభంతోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కో–ఆర్డినేటర్లు, ఇతర ముఖ్య నాయకులు, అధికారులు మొత్తం 10వేల మందితో సీఎం సమావేశం నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో సమావేశానికి ఎవరెవరిని ఆహ్వా నించాలి, ఏ మండలం నుంచి ఎంత మంది వస్తున్నారనే విషయంపై మంత్రులు, అధికారులు చర్చించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం మహబూబాబాద్‌లో గడపనున్నారు. అనంతరం సీఎం మహబూబాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడం జిల్లాకు వెళ్లనున్నారు. పోడు భూములకు పట్టాలిచ్చే విషయంలో జాప్యం చోటుచేసుకోవడం, గిరిజనేతరులకు పట్టాల పంపిణీ విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేకపోవడం, నారాయణపురం గ్రామంలోని కొందరు కైతులకు పట్టాలు ఇవ్వని విషయంపై ఆందోళనలు, నిరసలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు వారిపై గట్టి నిఘా పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment