
సాక్షి, మహబూబాబాద్: ‘మా పెద్దతండాకు అప్పట్లో సక్రమంగా రోడ్డు లేదు. బడి కూడా లేదు. ఈ దుస్థితిని చూసి నా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసేవారు. మన తండా బాగుపడదా.. అని ఎప్పుడూ బాధపడేవారు. ఇప్పుడు నేను మంత్రిగా తండాకు కావాల్సిన వసతులు కల్పించా. చక్కటి రోడ్డు వేయించా.
నా తల్లిదండ్రులు ఉండి ఉంటే ఈ అభివృద్ధిని చూసి సంతోషపడేవారు’అంటూ వారిని తలచుకుంటూ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కంటతడి పెట్టారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండా క్రాస్‌రోడ్డు నుంచి చెక్‌డ్యామ్ వరకు రూ.1.35 కోట్లలో నిర్మించతలపెట్టిన బీటీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రి సత్యవతి మాట్లాడుతూ గతంలో తన తండా పరిస్థితిని వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు.