సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘కంటి వెలుగు’కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి 14,92,450 మంది కంటి పరీక్షలు చేయుంచుకున్నారు. మంగళవారం ఒక్కరోజే 2,11,184 మంది వైద్య పరీక్షలు చేయించుకోగా...42 వేల మందికి కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,38,608 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు.
జనవరి 19 నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం
జనవరి 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. కంటి వెలుగు వైద్య శిబిరాలు స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయంతో సందడిగా ఉన్నాయి. క్యాంపుల నిర్వహణకు జిల్లా అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు..
ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య శిబిరాలు కంటి పరీక్షలు చేస్తున్నాయి. వైద్య శిబిరాల్లో ప్రత్యేక సాప్ట్‌వేర్ సహాయంతో కంటి పరీక్షలు చేస్తున్నారు. డీఈవో, ఏఎన్‌ఎంలు ట్యాబ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తున్నారు.
కంటి పరీక్షల తర్వాత అదే వైద్య శిబిరంలో అవసరమైతే అక్కడికక్కడే రీడింగ్ గ్లాసులు పంపిణీ చేస్తున్నారు. దీంతో కంటి వైద్య శిబిరాల నిర్వహణపై ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రభుత్వ సిబ్బందికి సంబంధిత కార్యాలయాలలో, పత్రిక విలేకరులకు ఆయా ప్రెస్‌క్లబ్‌ల వద్ద, పోలీస్ బెటాలియన్ సిబ్బందికి వారి కార్యాలయాల్లోనే ప్రత్యేకంగా కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment