కంటివెలుగు పరీక్షలు చేస్తున్ననేచురోపతి వైద్యుడు
కామారెడ్డి అర్బన్ : జిల్లా కేంద్రంలోని ఆయుష్ విభాగంలో ఆయుర్వేదం, నాచురోపతి, హోమి యోపతి వైద్యశాలలు ఒకే ప్రదేశంలో నిర్వహి స్తున్నారు. కాగా హోమియోపతి ఆసుపత్రికి కొనేళ్లుగా వైద్యుడు లేడు. ఆయుర్వేద, నేచురోపతికి జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇద్దరు కాంట్రాక్టు వైద్యులు సేవలు అందిస్తున్నారు. హోమియోపతి వైద్యానికి వచ్చే వారికి కాంపౌండరే తనకు తెలిసిన మందులు అందిస్తున్నారు.
ఇక్కడికి వచ్చే రోగులు ఎక్కువ మంది దీర్ఘకాలిక వ్యాధులైన కాళ్లు, మోకాళ్ల నొప్పులు, కిడ్నీ, చర్మసంబంధిత వ్యాధులు, అలర్జీలు, గర్భాశయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యం కోసం వస్తున్నారు. వీరికి నాచురోపతి, ఆయుర్వేదంలో మంచి మందులు లభిస్తున్నాయి. దీంతో రోజు దాదాపు 50 మంది వరకు రోగులు వస్తున్నారు. జిల్లాలో కామారెడ్డితోపాటు పిట్లం, మాచారెడ్డి, పెద్దకొడప్‌గల్, ఎర్రాపహాడ్‌లలోని ఆయుష్ వెద్యశాలల కాంట్రాక్ట్ వైద్యులందరికీ కంటివెలుగు డ్యూటీలు వేశారు. దీంతో ఆయుష్ వైద్య సేవలు అందకుండాపోయాయి.
కంటి వెలుగు డ్యూటీ..
రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 వ తేదీ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.. కామారెడ్డి ఆయుష్‌లో పనిచేస్తున్న వైద్యులను ఆరు నెలల పాటు డిప్యూటేషన్‌పై కంటి వెలుగు బాధ్యతలు అప్పగించారు. దీంతో సంప్రదాయ వైద్య సేవల కోసం వస్తున్న రోగులకు వైద్యం అందకుండాపోయింది. వైద్య సేవల కోసం ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ఆవేదన చెందుతున్నారు. కాగా కంటి వెలుగు కార్యక్రమంలో కంటివైద్యానికి ఎలాంటి సంబంధం, అర్హత లేని ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలతో పాటు ఆయుర్వేద, హోమియోపతి వైద్యుల సేవలు వినియోగించుకుంటుండడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కంటి వెలుగు డ్యూటీలను రద్దుచేసి తమకు న్యాయం చేయాలని రోగులు కోరుతున్నారు.
సీఎం ఆదేశాలు ఇలా...వైద్య అధికారులు మరోలా...
ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగుపై పలు సూచనలు చేశారు. కంటి పరీక్షల కోసం నియమించే సిబ్బంది వల్ల సాధారణ వైద్యసేవలకు అటంకం కలుగకుండా చూడాలన్నారు. కంటి పరీక్షల శిబిరంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యుల సేవలను తాత్కాలిక పద్ధతిలో వినియోగించుకోవాలని సూచించారు. వివిధ ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేస్తున్న వారిని వినియోగించవద్దని సూచించగా.. అందుకు విరుద్ధంగా జిల్లా వైద్య ఆర్యోగశాఖ అధికారులు ఆయుష్ కాంట్రాక్ట్ వైద్యులకు కంటి వెలుగు డ్యూటీలు వేసి రెగ్యులర్ వైద్యులను మినహాయించడంపై విమర్శలు వస్తున్నాయి.
జిల్లా కేంద్రమైనా పరిస్థితి మారలే..
తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని నియామకాలు జరిగి కామారెడ్డి ఆయుష్ ఆస్పత్రి పరిస్థితి మెరుగు పడుతుందని ప్రజలు భావించారు. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఆవిర్భవించినప్పటికీ వైద్య సేవలు మెరుగుపడడం లేదు. కనీసం డిప్యూటేషన్‌పైకూడా హోమియోపతి వైద్యుడిని నియమించడం లేదు. ఈ విషయమై పలుమార్లు ప్రజావాణిలో ప్రజలు వినతులూ ఇచ్చారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment