సాక్షి, సిద్దిపేట : కంటి వెలుగు పథకం అమలులోని అక్రమాలపై జిల్లా కేంద్రంలో రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు. నెలలు గడిచినా యూసీలు సమర్పించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ‘సాక్షి’ 19న ప్రచురించిన ‘కాకి లెక్కలు!’ కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రంలోని ద్యారోగ్యశాఖ కార్యాలయాన్ని 21న సందర్శించి ఇందుకు సంబంధించిన పలు అంశాలపై ఆరా తీశారు. జిల్లాలో కంటి వెలుగు పథకం అమలు తీరు, వైద్యులు పరీక్షించిన రోగుల వివరాలు, పంపిణీ చేసిన కంటి అద్దాలు, ప్రభుత్వం నుంచి మంజూరైన అద్దాలతో పాటు పలు వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా కంటి వెలుగు పథకంలో భాగంగా వైద్యులకు చెల్లించిన వేతనాలు, క్యాంపుల నిర్వహణకు సంబంధించిన ఖర్చులను, రవాణా కోసం వినియోగించిన వాహనాల వివరాలు, వాటికి చెల్లించిన ఖర్చుల వివరాలపై ఆరా తీశారు.
జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలంలోని స్టోర్ రూంను పరిశీలించి లబ్ధిదారులకు అందాల్సిన కంటి అద్దాలు పెండింగ్‌లో ఉండడంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పంపిణీ చేసిన కంటి అద్దాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో పూర్తి వివరాలతో కూడిన నివేదికలను పంపాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా అదనపు ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ మనోహర్ నంగునూర్ మండలం రాజగోపాల్‌పేట పీహెచ్‌సీలో లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన అద్దాలు, మండలంలో కంటి వెలుగు పథకం నిర్వహణకు అయిన ఖర్చుల వివరాలను సంబంధిత మెడికల్ ఆఫీసర్‌లతో సమావేశం నిర్వహించి తెలుసుకున్నారు. మూడు రోజులుగా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సంబంధిత ఏఎన్‌ఎంలతో ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయిస్తున్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయరాణి వెద్య సిబ్బందితో సమావేశం నిర్వహించి కంటి వెలుగుకు జిల్లాలో అయిన ఖర్చుల పూర్తి వివరాలతో కూడిన ఫైల్‌ను పరిశీలించారు.
నెలరోజుల్లోపు పూర్తి వివరాలతో కూడిన యూసీలను సమర్పించాలని జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల పరిధిలోని మెడికల్ ఆఫీసర్‌లను ఆదేశించామని డీఎంహెచ్‌ఓ తెలిపారు. గడువులోపు సమర్పించని వారి బిల్లులను క్యాన్సల్ చేస్తామని, పూర్తి వివరాలతో కూడిన ఫైల్‌ను కలెక్టర్‌కు సమర్పిస్తామని తెలిపారు. తప్పుడు నివేధికలు తయారుచేస్తే అట్టి వారిపై చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ హెచ్చరించారు. దీంతో పలువరు డాక్టర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో విధులు నిర్వహించే సిబ్బంది రెండు రోజులుగా చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment