అంగన్‌వాడీ అక్రమాలకు చెక్‌  | Biometric System Implements In Anganwadi Centers Medak | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ అక్రమాలకు చెక్‌ 

Published Fri, Jan 25 2019 11:58 AM | Last Updated on Fri, Jan 25 2019 11:58 AM

Biometric System Implements In Anganwadi Centers  Medak - Sakshi

మెదక్‌ అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహారం అందచేస్తున్న సిబ్బంది (ఫైల్‌)

మెదక్‌ అర్బన్‌:  అంగన్‌వాడీ కేంద్రాల్లో జరిగే అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. దీనికోసం పోషణ అభియాన్‌ పథకం ద్వారా అంగన్‌వాడీ సూపర్‌వైజర్లకు ట్యాబ్‌లు, టీచర్లకు దశల వారీగా స్మార్ట్‌ ఫోన్లలోని బయోమెట్రిక్‌ యాప్‌ ద్వారా లబ్ధిదారుల ఫొటోలు, వివరాలు నమోదు చేసి వేలి ముద్రలు తీసుకొని పౌష్టికాహారం అందించాలని నిర్ణయించింది. ఫలితంగా గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్లు, మధ్యాహ్న భోజనం, చిన్నారులకు బాలామృతం, మురుకులు అర్హులకు మాత్రమే అందనున్నాయి. రిజిస్టర్లలో పేర్లు నమోదు చేయడం, కుళ్లిన గుడ్లు, నాసిరకం భోజనాన్ని వడ్డించడం, సరుకులు పక్కదారి పట్టించడం వంటి అక్రమాలకు ఈ విధానంతో కాలం చెల్లనుంది. పౌష్టికాహారం పంపిణీ పరంగా ఉన్న అవకతవకలను తొలగించి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చెక్‌ పెట్టనుంది.

పైలెట్‌ ప్రాజెక్టు పూర్తి..
జిల్లాలో నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులుఉన్నాయి. ఈ  ప్రాజెక్టు పరిధిల్లో మొత్తం 1,076 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో 885  ప్రధాన కేంద్రాలు, 191 మినీ కేంద్రాలున్నాయి. వాటిలో మెదక్‌ ప్రాజెక్టు పరిధిలో 248 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 30 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు, అల్లాదుర్గం ప్రాజెక్టు పరిధిలో 188 ప్రధాన అంగన్‌వాడీ, 42 మినీ అంగన్‌వాడీలు, రామాయంపేట ప్రాజెక్టు పరిధిలో 241 ప్రధాన అంగన్‌వాడీ, 39 మినీ అంగన్‌వాడీలు, నర్సాపూర్‌ ప్రాజెక్టు పరిధిలో 208 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 80 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటన్నింటి ద్వారా బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ప్రభుత్వం పోషకాహారం అందిస్తోంది.  చాలా చోట్ల పౌష్టికాహారం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

కొన్ని చోట్ల అంగన్‌వాడీ కేంద్రాలను తూతూ మంత్రంగా నిర్వహిస్తుంటే... మరికొన్ని చోట్ల అసలు కేంద్రాలు తెరుచుకోవడంలేదు. రికార్డుల్లో మాత్రం పక్కాగా నడుస్తున్నట్లు చూపుతున్నారు. కాగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ పరంగా నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ అక్రమాలకు తావులేకుండా చూడటానికి ఇప్పటికే పలుచోట్ల పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ సూపర్‌వైజర్లకు ట్యాబ్‌లు, టీచర్లకు బయోమెట్రిక్‌ యాప్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు అందించి పరిశీలించింది. ఇవి సత్ఫలితాలనివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో విడతల వారీగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్లకు ట్యాబ్‌లు, టీచర్లకు బయోమెట్రిక్‌ యాప్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్లు అందించి పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా నిర్ణయించింది. ఈ యాప్‌ను ప్రారంభించి పాలు, గుడ్లు తదితర పౌష్టికాహారం అందిస్తున్న కొన్ని చోట్ల సాంకేతికపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని... ఈ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని జిల్లా అధికారులు తెలిపారు.

పారదర్శకత పెరుగుతుంది..

అంగన్‌వాడీ కేంద్రాల్లో పప్పులు, పాలు, నూనె, గుడ్లు ఆయా అంగన్‌వాడీ కేంద్రాల్లోని టీచర్లతో బయోమెట్రిక్‌ విధానం ద్వారా కేంద్రాలకు సరఫరా చేస్తున్నాం. బియ్యం రేషన్‌ దుకాణాల ద్వారా అందించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేయడానికి బయోమెట్రిక్‌ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఆన్‌లైన్‌ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో గుడ్లు, పాలు అందించడానికి ఆలస్యం జరిగింది. ఈ విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందకూడదు. కొద్ది రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తాం. – జ్యోతిపద్మ, మహిళా, శిశుసంక్షేమ శాఖ జిల్లా అధికారిణి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement