సాక్షి, హైదరాబాద్/ ఏజీవర్సిటీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం అమలుకోసం గ్రామాల్లో తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులకు సూచించారు. ఈనెల 18 నుంచి కంటి వెలుగు రెండో విడత ప్రారంభించనున్న నేపథ్యంలో గ్రామాలలో ఈ కార్యక్రమం తేదీలను తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గురువారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన ఈ పథకంపై ఏర్పాట్లను సమీక్షించారు.
ఎస్‌హెచ్‌జీల ఆదాయం పెంచడమే లక్ష్యం..
స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ఆదాయ మార్గా లను పెంపొందించే లక్ష్యాన్ని మరువరాదని పీఆర్ ‘సెర్ప్’సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. గురువారం వివిధ జిల్లాల అధికారుల ఓరియెంటేషన్ వర్క్ షాపులో ఆయన మాట్లాడారు. గత సీజన్‌లో ఖమ్మం జిల్లాలో ఎస్‌హెచ్‌జీ ద్వారా ప్రయోగాత్మకంగా ఎండుమిర్చి కొనుగోలు, మార్కెటింగ్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంతో పాటు మహబూబాబాద్, వరంగల్, జనగామ, సూర్యాపేట జిల్లాలకు దీనిని విస్తరించనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment