వైఎస్‌ జగన్‌ : నేడు ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ ప్రారంభం | YSR Kanti Velugu Scheme Launch on 10th October 2019 - Sakshi
Sakshi News home page

నేడు ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ ప్రారంభం

Published Thu, Oct 10 2019 3:42 AM | Last Updated on Thu, Oct 10 2019 10:50 AM

YSR Kanti Velugu launch in Anantapur on 10-10-2019 - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజారోగ్య రంగంలో మరో విప్లవాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కంటి సమస్యలను దూరం చేయడానికి ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. దీన్ని ఈ నెల 10 (గురువారం)న అనంతపురం జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. ‘కంటి వెలుగు’ కింద రాష్ట్రంలో 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలతోపాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైద్యం, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన తనకు అత్యంత ప్రాధాన్య రంగాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అధికారులతో సమీక్షల సందర్భంగా ఈ రంగాల్లో చేపట్టాల్సిన ముఖ్యమైన అంశాలపైన కూడా సీఎం దృష్టి సారించారు.

ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది ప్రజలు పౌష్టికాహార లోపం, రక్తహీనతతోపాటు కంటి సమస్యలతో కూడా ఎక్కువగా బాధపడుతున్నారని, వీటిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంట్లో భాగంగానే వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. ప్రతి మంగళవారం ‘స్పందన’పై సమీక్ష సందర్భంగా వైఎస్సార్‌ కంటి వెలుగును ఎలా నిర్వహించాలనే అంశంపై వైద్యారోగ్య శాఖ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్లతోనూ సీఎం సమీక్షించారు. సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుని ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’కు కార్యాచరణ సిద్ధం చేశారు.  

నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు చికిత్సలు
వైఎస్సార్‌ కంటి వెలుగులో భాగంగా మొదటి దశలో సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ పరీక్షలు జరుగుతాయి. ప్రపంచ దృష్టి దినం సందర్భంగా అక్టోబర్‌ 10 నుంచి 16 వరకు ఆరు పనిదినాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. తర్వాత రెండో దశలో కంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా గుర్తించిన వారిని నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు విజన్‌ సెంటర్లకు పంపించి అవసరమైన చికిత్స చేస్తారు. కళ్లద్దాలు, క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు, ఇతర సేవలు ఉచితంగా అందిస్తారు. జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు జిల్లా స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేస్తాయి.

160 మంది జిల్లా ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు, 1,415 మంది వైద్యాధికారులు దీంట్లో భాగస్వాములవుతారు. ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ)కు నేత్ర పరీక్షలకు సంబంధించిన కిట్లను పంపించారు. 42,360 మంది ఆశా వర్కర్లు, 62,500 మంది టీచర్లు, 14 వేల మంది ఏఎన్‌ఎంలు, 14 వేల మంది ప్రజారోగ్య సిబ్బంది అన్ని స్కూళ్లలో జరిగే కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటారు. మూడు, నాలుగు, ఐదు, ఆరో దశల్లో కమ్యూనిటీ బేస్‌ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1, 2020 నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలుపెడతారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని మొత్తం ఆరు దశల్లో మూడేళ్లపాటు అమలు చేస్తారు. 

నేడు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న సీఎం 
అనంతపురం జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌లో గురువారం ఉదయం 11.30 గంటలకు కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తారు. నేత్రదాన శిబిరం, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, పోషణ్‌ అభియాన్, తల్లీబిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన స్టాళ్లను సందర్శిస్తారు. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేస్తారు. తర్వాత జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కంటి వెలుగు లబ్ధిదారులతో మాట్లాడతారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement