
ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు శంకర నేత్రాలయ, ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రి, ఇతర ఎన్‌జీఓల సహకారం తీసుకుంటాం.ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తాం.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 5.3 కోట్ల మంది ప్రజలకు ఆరు విడతలుగా వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం కింద కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మూడేళ్ల కాలంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటికి సంబంధించిన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రూ.560 కోట్లతో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టనున్నామని.. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలన్నీ ఈ పథకం కింద జరుగుతాయని చెప్పారు. ‘స్పందన’ కార్యక్రమంపై మంగళవారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. అక్టోబరు 10 నుంచి 16 వరకు తొలి దశలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 70 లక్షల మందికి పైగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని, రెండో విడతలో నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అవసరమైన విద్యార్థులకు శస్త్రచికిత్సలు చేయిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మూడు, నాలుగు, ఐదు, ఆరు విడతల్లో మిగిలిన ప్రజలందరికీ దశల వారీగా కంటి పరీక్షలు, చికిత్సలు అందిస్తామని స్పష్టం చేశారు. జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి పటిష్టంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం సూచించారు. మొదటి స్క్రీనింగ్‌లో చికిత్స అవసరమున్న విద్యార్థులను గుర్తించి ఆ మేరకు వారికి తదుపరి చికిత్స అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించామని చెప్పారు.
రక్తహీనతను అధిగమించాల్సిందే
పౌష్టికాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు రోజుకు రూ.43, చిన్నారులకైతే రూ.18 ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా పౌష్టికాహార లోపం, రక్తహీనతను అధిగమించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, అంగన్‌వాడీ కేంద్రాలను సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే ఈ సమస్యను అధిగమించవచ్చన్న విశ్వాసం ఉందని సీఎం పేర్కొన్నారు. వలంటీర్లు ప్రతి ఇంటినీ సర్వే చేసి, పిల్లలను, తల్లులను, మహిళలను అంగన్‌వాడీ కేంద్రాల దగ్గరకు వెళ్లేలా మోటివేట్ చేయించి, అక్కడ వారికి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
రక్తహీనత పరీక్షలు నిర్వహించాక వారి ఆరోగ్య కార్డులో వివరాలు పొందుపరిచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పర్యవేక్షణ బాధ్యతను వలంటీర్లకు అప్పగించాలన్నారు. అంగన్‌వాడీల ద్వారా ఏమేమి ఇవ్వబోతున్నామో వలంటీర్లకు సమాచారం ఇచ్చి, ఆ మేరకు అవన్నీ కూడా పిల్లలు, తల్లులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. పారిశుద్ధ్యం, ఆహారం, తాగునీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వచ్చే సమీక్షా సమావేశానికి దీనిపై ఏం చర్యలు తీసుకున్నారన్న దానిపై నివేదించాలని అధికారులను ఆదేశించారు.
గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్
అక్టోబర్ 2 నుంచి ప్రారంభిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో సామాజిక తనిఖీలు పూర్తి చేయాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులోకి రాగానే అక్కడే ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలను ఉంచాలన్నారు. పెన్షన్లు, రేషన్‌కార్డులు ఉన్న వారి జాబితాను బోర్డులో పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా కూడా పెట్టే ప్రయత్నం చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలన్నింటినీ బోర్డులో ఉంచాలని చెప్పారు. ఈ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలుంటే, పథకం ఎవరికైనా అందకపోతే ఆ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కొత్త రేషన్‌కార్డులు, పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబర్ నుంచి ఇవ్వాలన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలని, వారికి అందించాల్సిన ధర్మం, బాధ్యత మనదేనని సీఎం స్పష్టం చేశారు.
వైఎస్సార్ రైతు భరోసాపై అవగాహన కల్పించాలి
కౌలు రైతులకు సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా మార్గదర్శకాలపై గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. దరఖాస్తులు, ప్రొఫార్మాలు అన్నీ కూడా అక్టోబర్ 2 నాటికి అందుబాటులో ఉంచడంతో పాటు లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేయాలన్నారు. ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు లబ్ధిదారుల ఎంపిక, వెరిఫికేషన్ వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి డేటా కలెక్షన్, వెరిఫికేషన్ పూర్తి కావాలన్నారు. అక్టోబర్ చివరి నాటికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి ఎంతో తేల్చాలని, నవంబర్ నుంచి అవసరమైన చోట భూముల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు. అధికారులందరూ ఈ కార్యక్రమంపై దృష్టి పెట్టాలని సూచించారు. సొంతంగా ఆటో, ట్యాక్సీ, మాక్సీ కాబ్‌లు నడుపుకుంటున్న వారికి ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం పథకానికి సంబంధించి దరఖాస్తులు, తనిఖీలు, ఆమోదంపై ఆరా తీశారు.
వరద జలాలు సద్వినియోగం చేసుకోవాలి
కర్నూలు, వైఎస్సార్, ప్రకాశం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాల సమాచారం వస్తోందని, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అనంతపురంలో చిరుధాన్యాల విత్తనాలను పంపిణీ చేస్తున్నామని ఈ సందర్భంగా ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు. వచ్చే ఏడాది నాటికి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నింపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. 117 టీఎంసీల నీరు వెళ్లినా రిజర్వాయర్లు నిండలేదంటే.. కాల్వల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందోని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్
వరద జలాలు సద్వినియోగం చేసుకునే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు, వరదల కారణంగా ఇసుక అందుబాటులోకి రాలేదని వివిధ జిల్లాల అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. గోదావరి, కృష్ణా నదుల్లో ఇంకా ప్రవాహం కొనసాగుతోందని, వరద తగ్గిన వెంటనే రీచ్‌లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. వరద తగ్గగానే వీలైనంత ఇసుకను స్టాక్ యార్డుల్లోకి తరలించడానికి ముమ్మర ప్రయత్నాలు చేయాలని సీఎం ఆదేశించారు.
మానవీయ దృక్పథంతో ప్రజల వినతులు పరిష్కరించాలి
ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారంలో మరింత మానవీయ దృక్పథంతో ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రధానంగా ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు మానవీయ కోణంలో ప్రజల వినతులకు పరిష్కారం చూపాలని కోరారు. వినతులు ఇచ్చే వారి స్థానంలో మనం ఉంటే ఎలా ఆలోచిస్తామో అదే రీతిలో మనం స్పందించాలని, అప్పుడే స్పందనకు అర్థం ఉంటుందన్నారు. స్పందన ద్వారా అందే వినతుల పరిష్కారంలో నాణ్యత కోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని, ఇందులో భాగంగా ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు వర్క్‌షాపు నిర్వహిస్తామని చెప్పారు. సమస్యలు తీరుస్తామన్న ఆశతో ప్రజలు మన దగ్గరకు వస్తారని, అందుకు అనుగుణంగానే అధికారులు స్పందించాలని కోరారు.
ఇందు కోసమే ఈ వర్క్‌షాపులని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ నెల 24, 27 తేదీల్లో, అక్టోబర్‌లో జిల్లాల స్థాయిలో రెండు రోజుల పాటు వర్క్‌షాపులు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దిగువ స్థాయి అధికారుల్లో మరింత మోటివేషన్ పెంచడమే దీని ఉద్దేశమని, కలెక్టర్లు కూడా ఈ వర్క్‌షాపులో పాల్గొనాలని సూచించారు. నవంబర్ నుంచి స్పందన వినతుల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు శంకర నేత్రాలయ, ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రి, ఇతర ఎన్‌జీఓల సహకారం తీసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తాం.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర వర్గాల్లో పేదరికంతో ఉన్న మహిళలు, తల్లులు, పిల్లలను పౌష్టికాహార లోపం సమస్య నుంచి గట్టెక్కించాల్సిందే. ప్రభుత్వం ఇంతగా ఖర్చు చేస్తున్నా, పౌష్టికాహార లోపం ఎందుకు వస్తోంది? అవసరమైతే మరింత ఖర్చు చేద్దాం.. కానీ సమస్య పరిష్కారం కావాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment