సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యేలా నిర్వహించాలని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వంద రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేస్తే గిన్నిస్‌లోకి చేరుతుందని ఆయన చెప్పారు. జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించే కంటి వెలుగు–2 కార్యక్రమంపై జిల్లా వైద్యాధికారులు, జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లకు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని హరీశ్‌రావు మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి కంటి వెలుగు కార్యక్రమంలో 1.54 కోట్ల మందికి స్క్రీనింగ్, 50 లక్షల కళ్ళ అద్దాలు ఇచ్చామన్నారు. అది ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక కంటి పరీక్షల కార్యక్రమంగా నిలిచిందన్నారు. ఈసారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి 55 లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించామనీ, ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. మొదటి కంటి వెలుగును 8 నెలల్లో పూర్తి చేయగా, ఈసారి 100 పని దినాల్లో చేయాలని నిర్ణయించామన్నారు. వంద రోజుల్లో పూర్తి చేసేందుకు 1,500 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
969 మంది డాక్టర్లు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 969 మంది డాక్టర్లను నియమించేందుకు వచ్చే నెల ఒకటో తేదీన తుది జాబితాను విడుదల చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. పల్లె దవాఖానాల్లో 811 మంది బీఏఎంఎస్ డాక్టర్లను నియమించామని చెప్పారు. 1,500 ఆప్టో మెట్రిషన్స్, 1,500 డేటా ఎంట్రీ ఆపరేటర్లను త్వరగా నియమించాలన్నారు. కంటి వెలుగును విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, కలెక్టర్ల సహకారం తీసుకోవాలని కోరారు.
మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. జనవరి 1వ తేదీ నాటికి ఆటో రీఫ్రాక్తో మెషీన్లు జిల్లాలకు వస్తాయని చెప్పారు. కార్యక్రమం ప్రారంభించడానికి ముందుగానే రీడింగ్ గ్లాసెస్ వస్తాయని, పరీక్షలు చేసిన నెల రోజుల్లో ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేస్తామని వివరించారు. ఆఖరి సంవత్సరం వైద్య విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చి వినియోగిస్తామన్నారు.
రాష్ట్రస్తాయిలో 10, జిల్లాకొకటి చొప్పున క్వాలిటీ కంట్రోల్ టీంలు ఏర్పాటు చేస్తామని హరీశ్‌రావు వివరించారు. ప్రభావవంతంగా కార్యక్రమం జరుగుతుందా లేదా అని ఈ టీంలు పరిశీలన చేస్తాయన్నారు. ఎల్ వీ ప్రసాద్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రుల సహకారంతో ఆ టీంలకు రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అద్దాల డిమాండ్ తీర్చేలా ఆటోమేటిక్ ఆర్డర్ ఫెసిలిటీ ఉంటుందన్నారు. జనవరి 10 వరకే 10 నుంచి 15 లక్షల కళ్ళ జోళ్లు జిల్లాలకు చేరతాయన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కంటి వెలుగు కార్యక్రమానికి తమ శాఖ పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment