కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా నేత్ర పరీక్షలు
వికారాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం పూర్తయ్యింది. వంద పని దినాల్లో ప్రోగ్రామ్‌ను పూర్తిచేయాల్సి ఉండగా.. గడువులోపే ముగించి సర్కారు సంకల్పాన్ని విజయవవంతం చేశారు. ఇందుకోసం వైద్య సిబ్బంది, అధికారులు ఎంతగానో శ్రమించారు. రోజువారీ విధులు నిర్వర్తిస్తూనే కంటివెలుగు శిబిరాలు కొనసాగించారు. ఇదిలా ఉండగా అద్దాలు పంపిణీ చేసే విషయంలో మిగితా జిల్లాలతో పోలిస్తే వికారాబాద్ ముందు వరుసలో నిలిచింది. కలెక్టర్, డీఎంఅండ్‌హెచ్‌ఓ ఇతర అధికారుల నిరంతర పర్యవేక్షణతో పరీక్షలు, చికిత్సలు, అద్దాల పంపిణీ పూర్తయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతీ వ్యక్తికి నేత్ర పరీక్షలు చేయాలని ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం జిల్లాలో త్వరగా పూర్తి కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
పరీక్షలు.. అవగాహన
జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలు, 97 వార్డులు ఉన్నాయి. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలోని 20 మండలాల్లో సుమారు 9.27 లక్షల జనాభా ఉంది. వీరందరికీ నేత్ర పరీక్షలు చేసేందుకు 42 వైద్య బృందాలను నియమించారు. ఓ పక్క కంటి వెలుగు స్క్రీనింగ్ చేస్తూనే.. మరోపక్క నేత్ర సమస్యల నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో స్క్రీనింగ్ కేంద్రాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నవారిలో 25శాతం (1,24,364) మంది ఏదో ఒక కంటి సమస్యతో బాధ పడుతున్నట్లు తేలింది. ఇందులో కొందరికి రీడింగ్ గ్లాసెస్ అవసరమవగా మరికొందరికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని గుర్తించిన వైద్యులు వీటిని పంపిణీ చేశారు.
మనమే నంబర్ వన్
జిల్లాలో జనవరి 19న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణాల్లో నిత్యం 42 బృందాలతో శిబిరాలు నిర్వహించారు. ఒక్కో క్యాంపులో నిత్యం 150 నుంచి 170 మందికి కళ్ల స్క్రీనింగ్ చేశారు. ప్రతీ శిబిరంలో వైద్యాధికారితో పాటు నేత్రవైద్యుడు, సిబ్బంది కలిపి ఎనిమిది మంది పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 9.27 లక్షల జనాభా ఉండగా.. ఇందులో 18 ఏళ్లు పైబడిన 4,83,794 మందికి నేత్ర పరీక్షలు పూర్తిచేశారు. వీరిలో 64,798 మందికి రీడింగ్ గ్లాసెస్ అవసరమని తేల్చి ఆరుగురు మినహా 64,792 మందికి అద్దాలు అందజేశారు. 59,566 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని నిర్ధారించి.. ఇప్పటివరకు 50,235 మందికి అద్దాలు అందజేశారు. మిగిలిన వారికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన అద్దాలను పంపిణీ చేయడంలో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
సమష్టి కృషితోనే..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తిచేశాం. పరీక్షలు నిర్వహించిన వారిలో తొంభైశాతం మందికి పైగా అద్దాలు పంపిణీ చేశాం. మిగిలిన వారికి త్వరలోనే అందజేస్తాం. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితోనే కార్యక్రమం విజయవంతమైంది.
– పల్వాన్‌కుమార్, డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment