Eye Screening
-
నేత్ర దరహాసం... వికారాబాద్ జిల్లాలో ‘కంటి వెలుగు’ సంపూర్ణం
వికారాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం పూర్తయ్యింది. వంద పని దినాల్లో ప్రోగ్రామ్‌ను పూర్తిచేయాల్సి ఉండగా.. గడువులోపే ముగించి సర్కారు సంకల్పాన్ని విజయవవంతం చేశారు. ఇందుకోసం వైద్య సిబ్బంది, అధికారులు ఎంతగానో శ్రమించారు. రోజువారీ విధులు నిర్వర్తిస్తూనే కంటివెలుగు శిబిరాలు కొనసాగించారు. ఇదిలా ఉండగా అద్దాలు పంపిణీ చేసే విషయంలో మిగితా జిల్లాలతో పోలిస్తే వికారాబాద్ ముందు వరుసలో నిలిచింది. కలెక్టర్, డీఎంఅండ్‌హెచ్‌ఓ ఇతర అధికారుల నిరంతర పర్యవేక్షణతో పరీక్షలు, చికిత్సలు, అద్దాల పంపిణీ పూర్తయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతీ వ్యక్తికి నేత్ర పరీక్షలు చేయాలని ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం జిల్లాలో త్వరగా పూర్తి కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పరీక్షలు.. అవగాహన జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలు, 97 వార్డులు ఉన్నాయి. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలోని 20 మండలాల్లో సుమారు 9.27 లక్షల జనాభా ఉంది. వీరందరికీ నేత్ర పరీక్షలు చేసేందుకు 42 వైద్య బృందాలను నియమించారు. ఓ పక్క కంటి వెలుగు స్క్రీనింగ్ చేస్తూనే.. మరోపక్క నేత్ర సమస్యల నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో స్క్రీనింగ్ కేంద్రాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నవారిలో 25శాతం (1,24,364) మంది ఏదో ఒక కంటి సమస్యతో బాధ పడుతున్నట్లు తేలింది. ఇందులో కొందరికి రీడింగ్ గ్లాసెస్ అవసరమవగా మరికొందరికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని గుర్తించిన వైద్యులు వీటిని పంపిణీ చేశారు. మనమే నంబర్ వన్ జిల్లాలో జనవరి 19న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణాల్లో నిత్యం 42 బృందాలతో శిబిరాలు నిర్వహించారు. ఒక్కో క్యాంపులో నిత్యం 150 నుంచి 170 మందికి కళ్ల స్క్రీనింగ్ చేశారు. ప్రతీ శిబిరంలో వైద్యాధికారితో పాటు నేత్రవైద్యుడు, సిబ్బంది కలిపి ఎనిమిది మంది పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 9.27 లక్షల జనాభా ఉండగా.. ఇందులో 18 ఏళ్లు పైబడిన 4,83,794 మందికి నేత్ర పరీక్షలు పూర్తిచేశారు. వీరిలో 64,798 మందికి రీడింగ్ గ్లాసెస్ అవసరమని తేల్చి ఆరుగురు మినహా 64,792 మందికి అద్దాలు అందజేశారు. 59,566 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని నిర్ధారించి.. ఇప్పటివరకు 50,235 మందికి అద్దాలు అందజేశారు. మిగిలిన వారికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన అద్దాలను పంపిణీ చేయడంలో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. సమష్టి కృషితోనే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తిచేశాం. పరీక్షలు నిర్వహించిన వారిలో తొంభైశాతం మందికి పైగా అద్దాలు పంపిణీ చేశాం. మిగిలిన వారికి త్వరలోనే అందజేస్తాం. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితోనే కార్యక్రమం విజయవంతమైంది. – పల్వాన్‌కుమార్, డీఎంహెచ్ఓ -
రెండు రోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు కార్యక్రమం క్షేత్రస్థాయి క్యాంప్‌ల నిర్వహణ విజయవంతంగా జరుగుతుండటంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొదటి రెండు రోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 97,335 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కంటి వెలుగు అమలుపై శనివారం ఆమె బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం. రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి ఇందులో పాల్గొన్నారు. కాగా, అన్ని జిల్లాల్లోని బఫర్ టీమ్స్‌ను ఉపయోగించి ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కోర్టు భవన సముదాయాలు, పోలీస్ బెటాలియన్లు, జర్నలిస్టుల కోసం ప్రెస్‌క్లబ్‌ల వద్ద ప్రత్యేక కంటి వెలుగు క్యాంప్‌లను నిర్వహించాలని శాంతి కుమారి సూచించారు. -
రెండో రోజు 2.14 లక్షల మందికి కంటి వెలుగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం రెండో రోజు శుక్రవారం 2.14 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో రెండ్రోజుల్లో 3.81 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లయింది. రెండో రోజు 53,719 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. 38 వేలమందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని గుర్తించారు. కంటి సమస్యలు లేనివారు 1.22 లక్షల మంది ఉన్నట్లు తెలిపారు. -
కంటి‘వెలుగు’ షురూ
సాక్షి నెట్వర్క్: రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఖమ్మంలో దీనిని ప్రారంభించగా, గురువారం నుంచి రాష్ట్రంలోని 1,500 కేంద్రాల్లో కంటి పరీక్షలు చేపట్టారు. తొలిరోజు 1.60 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 72,580 మంది పురుషులు, 87,889 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు పరీక్షలు చేయించుకున్నారు. మొత్తం 70 వేల మందిలో సమస్యలు గుర్తించారు. 37 వేల మందికి దగ్గరి చూపు లోపానికి సంబంధించి అద్దాలు అందజేశారు. మరో 33 వేల మందిలో ఇతరత్రా సమస్యలు గుర్తించి అద్దాల కోసం సిఫారసు చేశారు. అతి తక్కువ మందికి శస్త్ర చికిత్సలు అవసరమని తేల్చారు. మొత్తం మీద తొలిరోజు పరీక్షించిన వారిలో 43.75 శాతం మందికి రకరకాల చూపు సమస్యలు ఉన్నట్లు తేలింది. పట్టణ ప్రాంతాల్లో రద్దీ తక్కువగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 40 ఏళ్ల పైబడ్డ వారితో క్యూ లైన్లు నిండిపోయాయి. పలువురు ప్రముఖులకు అద్దాలు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లో కంటి పరీక్ష చేసుకోగా, ఆయనకు దగ్గరి చూపు (షార్ట్ విజన్) లోపం ఉన్నట్లు గుర్తించి అద్దాలు అందజేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వేములపల్లి మండల కేంద్రంలో పరీక్ష చేసుకోగా లోపం ఉందని గుర్తించి రీడింగ్ గ్లాసులు అందజేశారు. సూర్యాపేటలో పరీక్ష చేయించుకున్న రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి ఎలాంటి అద్దాలు అవసరం లేదని నిర్ధారించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి పరీక్షలు చేయించుకున్నారు. వీరిద్దరికీ అద్దాలు అందజేశారు. ఎక్కడ కావాలంటే అక్కడికే.. గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్లు.. ఎక్కడ సేవలు కావాలన్నా ట్విట్టర్ లేదా వెబ్సైట్లో రిక్వెస్ట్ పెడితే అక్కడికే కంటి వెలుగు బృందాలు వస్తాయని మంత్రి హరీశ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఏపని చేపట్టినా ప్రజల మంచి గురించి ఆలోచించి చేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. టీఎస్‌ఎంఐడీసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత మహంతి తదితరులు పాల్గొన్నారు. అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యం.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో కలిసి హైదరాబాద్ అమీర్‌పేటలో కంటి వెలుగు పరీక్షా శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అంధత్వ రహిత తెలంగా ణ కంటి వెలుగు లక్ష్యమని చెప్పారు. ఎవరూ కంటి చూపు సమస్యతో బాధపడకూడదనే ఉద్దేశంతో 2018లో సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గతంలో 8 నెలల పాటు కంటి వెలుగు నిర్వహిస్తే ఈసారి 100పనిదినాల్లో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ దఫా కంటి వెలుగు ద్వారా 55 లక్షల కళ్ళ జోళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. -
100 రోజుల్లో కోటిన్నర మందికి స్క్రీనింగ్
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం బుధవారం మొదలుకానుంది. ఖమ్మంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. దీనికోసం వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 19 నుంచి రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తారు. ఇందులో ప్రజాప్రతినిధులందరూ పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,500 కేంద్రాల్లో కంటి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. 100 పనిదినాల్లో కోటిన్నర మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. తద్వారా గిన్నిస్ బుక్‌లో నమోదయ్యేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. 18 ఏళ్లు నిండిన వారందరికీ పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి కళ్లద్దా్దలు ఇస్తారు. మొత్తం 55 లక్షల కళ్లద్దాలు సిద్ధం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాల్లో ఒక్కోచోట 300 మందికి, పట్టణ ప్రాంతాల్లో 400 మందిని పరీక్షించాలన్నది లక్ష్యం. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరాలు నిర్వహిస్తారు. 15 వేల మంది సిబ్బంది : కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 15 వేల మంది సిబ్బంది పాల్గొంటారు. కంటి పరీక్షలకు అవసరమైన ఏఆర్ యంత్రాలు, కళ్లద్దాలు సిద్ధంగా ఉంచారు. కంటి వెలుగు శిబిరాల్లో కంటి శుక్లం, మెల్ల కన్ను, టెరీజియం పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి చుక్కల మందులు, మాత్రలు ఇస్తారు. శిబిరాల్లో స్క్రీనింగ్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
Andhra Pradesh: కంటి వెలుగుల పరీక్షలు పూర్తి
సాక్షి, అమరావతి: విద్యా రంగ సంస్కరణలతో విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వారి ఆరోగ్యం విషయంలోనూ అంతే శ్రద్ధ తీసుకుంటోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బాలల భవితపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగానే బాలల కంటి లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూలు పిల్లలకు తొలిసారిగా చేపట్టిన కంటి పరీక్షలు దాదాపు పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 66.17 లక్షల మంది స్కూలు పిల్లలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. రెండు దశల్లో బాలలకు కంటి పరీక్షలు నిర్వహించారు. తొలి దశలో ప్రాథమిక కంటి స్క్రీనింగ్ చేశారు. ఆశా వర్కర్లు, వలంటీర్ల సహాయంతో శిక్షణ పొందిన సిబ్బంది దీనిని పూర్తి చేశారు. ఈ పిల్లల మెడికల్ రికార్డు, ఇతర వివరాలన్నింటినీ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్‌లో నమోదు చేశారు. 1.58 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. వారందరికీ కళ్లద్దాలు కూడా ఇప్పటికే పంపిణీ చేశారు. 500 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని తేలగా ఇప్పటికే 459 మందికి ఆపరేషన్లు పూర్తి చేశారు. పిల్లలందరికీ పరీక్షలు పూర్తి రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉన్న బాలలందరికీ కంటి పరీక్షలు పూర్తయ్యాయి. కళ్ల జోళ్లూ ఇచ్చాము. అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయించాము. ఇంకా 41 మందికి మాత్రమే శస్త్ర చికిత్సలు చేయించాల్సి ఉంది. వీలైనంత త్వరగా వారికి కూడా ఆపరేషన్లు చేయిస్తాం. దీంతో పూర్తి స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమం పూర్తి అయినట్లే. – డా.హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు (నోడల్ అధికారి, వైఎస్సార్ కంటి వెలుగు) -
చిన్న‘చూపు’
సాక్షి, మంచిర్యాల : చిన్నారి చూపు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం గతేడాది ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దృష్టి లోపమున్న విద్యార్థినీవిద్యార్థులకు నేత్ర పరీక్షలు చేసి కళ్లజోడు, అవసరముంటే శస్త్రచికిత్సలు చేయించాలన్నది పథకం ఉద్దేశం. గ తేడాది పథకం కింద చిన్నారులకు కంటి స్క్రీనింగ్ చేశారు. దృష్టి లోపమున్న వారిలో కొందరికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. తీవ్ర సమస్య ఉన్న 98 మందికి శస్త్ర చికిత్సలకు రెఫర్ చేశారు. 50 మంది విద్యార్థులకు మించి శస్త్రచికిత్సలు జరగలేదు. ఈ సారైనా కళ్లజోళ్లు అందుతాయని, శస్త్రచికిత్సలు చేయించుకోవచ్చని ఇప్పటివరకు ఎదురుచూసిన చిన్నారుల ఆశలపై రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) నీళ్లు చల్లింది. విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా విద్యార్థులకు కంటి స్క్రీనింగ్, శస్త్ర చికిత్సలు చేయించలేదు. చిన్నారి చూపు.. ఈ విద్యా సంవత్సరంతోనే రద్దయిందని చెప్పి చేతులు దులుపుకుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది చిన్నారులు కంటి వైద్య సేవలకు దూరమయ్యారు. పథక విశేషాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఐదు నుంచి పదిహేనేళ్ల వయస్సు ఉన్న విద్యార్థులు, బడిబయట చిన్నారుల కోసం ప్రభుత్వం అక్టోబర్ 29, 2012న ‘చిన్నారి చూపు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. నిర్వహణ బాధ్యతను ఆర్వీఎంకు అప్పగించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పర్యటించి, కంటి సమస్యతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి వారికి ఉచితంగా కళ్లజోడు పంపిణీ, ఆపరేషన్లు చేయించాలని ఆర్వీఎంను ఆదేశించింది. కొందరికే లబ్ధి కంటి సమస్యతో బాధపడుతున్న ఐదు వేల మంది విద్యార్థులను గుర్తించిన ఆప్తాల్మిక్ అసిస్టెంట్లు వారిని శస్త్ర చికిత్సల కోసం రెఫర్ చేశారు. దీంతో రాజీవ్ విద్యామిషన్, జిల్లా కేంద్రంలోని రిమ్స్, వెస్ట్మరెడ్పల్లి(సికింద్రాబాద్)లోని విశ్వగిరి కంటి ఆస్పత్రిలో సుమా రు 50 మంది విద్యార్థులకు శస్త్ర చికత్సలు నిర్వహించింది. పలువురు విద్యార్థులకు హైపవర్ క ళ్లజోళ్లు పంపిణీ చేసింది. ఇదిలా ఉంటే.. నార్నూర్, తిర్యాణి, కోటపల్లి, బెజ్జూరు ఇంకా చాలా మండలాల్లోని వందలాది పాఠశాలలకు ఐఆర్టీ, ఐఐటీ, విద్యావలంటీర్లు వెళ్లలేదు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. విద్యార్థుల ఎదురుచూపులు జిల్లాలో 4,500 ప్రాథమిక, 2,700 ప్రాథమికోన్నత, 572 ఉన్నత పాఠశాలలున్నాయి. సుమారు మూడు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. బడిబయట ఉన్న వారి సంఖ్య వేలలోనే ఉంటుంది. పథకం ప్రారంభంలో కొన్ని పాఠశాలల్లోనే పర్యటించిన సిబ్బంది 5వేల మంది దృష్టి లోపంతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో దృష్టి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 70 వేలపైనే ఉండే అవకాశం ఉంది. కనీసం ఈ విద్యా సంవత్సరమైనా ఆయా స్కూళ్లలో కంటి స్క్రీనింగ్ చేపడితే శస్త్ర చికిత్సలు చేయించుకోలేని నిరుపేద విద్యార్థులకు ఆపరేషన్ చేసుకునే వీలుంటుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. పథకం విషయమై ఆర్వీఎం చిన్నారిచూపు పథక ఇన్చార్జి సంతోష్‌ను అడుగగా.. ఈ విద్యా సంవత్సరం పథక నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కాలేదన్నారు.