సాక్షి, అమరావతి: విద్యా రంగ సంస్కరణలతో విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వారి ఆరోగ్యం విషయంలోనూ అంతే శ్రద్ధ తీసుకుంటోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బాలల భవితపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగానే బాలల కంటి లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూలు పిల్లలకు తొలిసారిగా చేపట్టిన కంటి పరీక్షలు దాదాపు పూర్తి అయ్యాయి.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 66.17 లక్షల మంది స్కూలు పిల్లలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. రెండు దశల్లో బాలలకు కంటి పరీక్షలు నిర్వహించారు. తొలి దశలో ప్రాథమిక కంటి స్క్రీనింగ్ చేశారు. ఆశా వర్కర్లు, వలంటీర్ల సహాయంతో శిక్షణ పొందిన సిబ్బంది దీనిని పూర్తి చేశారు. ఈ పిల్లల మెడికల్ రికార్డు, ఇతర వివరాలన్నింటినీ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్‌లో నమోదు చేశారు. 1.58 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. వారందరికీ కళ్లద్దాలు కూడా ఇప్పటికే పంపిణీ చేశారు. 500 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని తేలగా ఇప్పటికే 459 మందికి ఆపరేషన్లు పూర్తి చేశారు.
పిల్లలందరికీ పరీక్షలు పూర్తి
రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉన్న బాలలందరికీ కంటి పరీక్షలు పూర్తయ్యాయి. కళ్ల జోళ్లూ ఇచ్చాము. అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయించాము. ఇంకా 41 మందికి మాత్రమే శస్త్ర చికిత్సలు చేయించాల్సి ఉంది. వీలైనంత త్వరగా వారికి కూడా ఆపరేషన్లు చేయిస్తాం. దీంతో పూర్తి స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమం పూర్తి అయినట్లే.
– డా.హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు (నోడల్ అధికారి, వైఎస్సార్ కంటి వెలుగు)
Comments
Please login to add a commentAdd a comment