AP: వృద్ధులకు వరం.. ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ | Complete Eye Examination For 15 Lakh Senior Citizens In AP | Sakshi
Sakshi News home page

AP: వృద్ధులకు వరం.. ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’

Published Mon, Dec 27 2021 8:09 AM | Last Updated on Mon, Dec 27 2021 8:09 AM

Complete Eye Examination For 15 Lakh Senior Citizens In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కంటిచూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం వరంగా మారింది. ఈ కార్యక్రమం కింద 60 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోంది. వచ్చే సెప్టెంబర్‌ నాటికి రాష్ట్రంలోని వృద్ధులందరి కంటిచూపు సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో వైద్య, ఆరోగ్యశాఖ చురుగ్గా చర్యలు తీసుకుంటోంది.

చదవండి: మీ ఆనందమే నా తపన: సీఎం జగన్‌ 

13 జిల్లాల్లోని 378 వైద్యబృందాలు ఇప్పటివరకు 15,64,710 (అర్హుల్లో 27.51 శాతం) మందికి కంటిపరీక్షలు చేశాయి. 6.04 లక్షల మందికి మందుల ద్వారా నయం అయ్యే సమస్యలున్నట్లు గుర్తించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 8,23,264 మందికి కళ్లద్దాలు అవసరం ఉండగా 5,33,789 మందికి ఇచ్చారు. వైఎస్సార్‌ కంటివెలుగు పథకం మొదటి రెండు దశల్లో విద్యార్థులకు కంటిపరీక్షలు చేశారు. మొత్తం 70.36 లక్షల మంది (మొదటిదశలో 66 లక్షల మంది, రెండోదశలో 4.36 లక్షల మంది) విద్యార్థులకు కంటిపరీక్షలు నిర్వహించారు.

796 ఆపరేషన్లు చేసిన మచిలీపట్నం వైద్యుడు భాస్కర్‌రెడ్డి
రాష్ట్రంలో 1,27,632 మంది వృద్ధులు శుక్లాల సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యబృందాలు గుర్తించాయి. వీరందరికి ప్రభుత్వం ఉచితంగా కేటరాక్ట్‌ ఆపరేషన్లు చేయించింది. రాష్ట్రంలో వారానికి సుమారు ఆరువేల మందికి ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ పథకం కింద అనేకమంది వైద్యులు అత్యధిక సర్జరీలు చేస్తున్నారు. గత ఏడాది నవంబర్‌ నుంచి 60 ఏళ్లు దాటిన 796 మందికి, 60 ఏళ్లలోపున్న 552 మందికి మొత్తం 1,348 ఆపరేషన్లు చేసి మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి వైద్యుడు భాస్కర్‌రెడ్డి రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచారు.

964 సర్జరీలతో ఏలూరు ప్రభుత్వాస్పత్రి వైద్యుడు ఎ.ఎస్‌.రామ్, 921 సర్జరీలతో విజయనగరం జిల్లా ఆస్పత్రి వైద్యుడు కె.ఎన్‌.మూర్తి తరువాత స్థానాల్లో ఉన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ఒక ప్రొఫెసర్, పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు ఏరియా ఆస్పత్రి వైద్యుడు ఇప్పటివరకు ఒక్క సర్జరీ కూడా చేయని వారిలో ఉన్నారు. డీఎంఈ, ఏపీవీవీపీ పరిధిలో సర్జరీలు చేయని, మొక్కుబడిగా చేస్తున్న వైద్యులకు అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.

సెప్టెంబర్‌ నాటికి లక్ష్యసాధన
వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి వృద్ధులందరికీ కంటిపరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. ఈ లోగానే పరీక్షలు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వేగంగా పరీక్షలు పూర్తిచేయడానికి జిల్లా అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తున్నాం. వైద్యుల వారీగా చేస్తున్న సర్జరీలను సమీక్షిస్తున్నాం. అవసరాన్ని బట్టి వైద్యులకు శిక్షణ ఇప్పిస్తున్నాం.
– డాక్టర్‌ ఆర్‌.ఆర్‌.రెడ్డి, జేడీ, రాష్ట్ర అంధత్వ నివారణ, కంటివెలుగు సంస్థ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement