సాక్షి, మంచిర్యాల : చిన్నారి చూపు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం గతేడాది ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దృష్టి లోపమున్న విద్యార్థినీవిద్యార్థులకు నేత్ర పరీక్షలు చేసి కళ్లజోడు, అవసరముంటే శస్త్రచికిత్సలు చేయించాలన్నది పథకం ఉద్దేశం. గ తేడాది పథకం కింద చిన్నారులకు కంటి స్క్రీనింగ్ చేశారు. దృష్టి లోపమున్న వారిలో కొందరికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. తీవ్ర సమస్య ఉన్న 98 మందికి శస్త్ర చికిత్సలకు రెఫర్ చేశారు. 50 మంది విద్యార్థులకు మించి శస్త్రచికిత్సలు జరగలేదు. ఈ సారైనా కళ్లజోళ్లు అందుతాయని, శస్త్రచికిత్సలు చేయించుకోవచ్చని ఇప్పటివరకు ఎదురుచూసిన చిన్నారుల ఆశలపై రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) నీళ్లు చల్లింది. విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా విద్యార్థులకు కంటి స్క్రీనింగ్, శస్త్ర చికిత్సలు చేయించలేదు.
చిన్నారి చూపు..
ఈ విద్యా సంవత్సరంతోనే రద్దయిందని చెప్పి చేతులు దులుపుకుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది చిన్నారులు కంటి వైద్య సేవలకు దూరమయ్యారు.
పథక విశేషాలు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఐదు నుంచి పదిహేనేళ్ల వయస్సు ఉన్న విద్యార్థులు, బడిబయట చిన్నారుల కోసం ప్రభుత్వం అక్టోబర్ 29, 2012న ‘చిన్నారి చూపు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. నిర్వహణ బాధ్యతను ఆర్వీఎంకు అప్పగించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పర్యటించి, కంటి సమస్యతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి వారికి ఉచితంగా కళ్లజోడు పంపిణీ, ఆపరేషన్లు చేయించాలని ఆర్వీఎంను ఆదేశించింది.
కొందరికే లబ్ధి
కంటి సమస్యతో బాధపడుతున్న ఐదు వేల మంది విద్యార్థులను గుర్తించిన ఆప్తాల్మిక్ అసిస్టెంట్లు వారిని శస్త్ర చికిత్సల కోసం రెఫర్ చేశారు. దీంతో రాజీవ్ విద్యామిషన్, జిల్లా కేంద్రంలోని రిమ్స్, వెస్ట్‌మరెడ్‌పల్లి(సికింద్రాబాద్)లోని విశ్వగిరి కంటి ఆస్పత్రిలో సుమా రు 50 మంది విద్యార్థులకు శస్త్ర చికత్సలు నిర్వహించింది. పలువురు విద్యార్థులకు హైపవర్ క ళ్లజోళ్లు పంపిణీ చేసింది. ఇదిలా ఉంటే.. నార్నూర్, తిర్యాణి, కోటపల్లి, బెజ్జూరు ఇంకా చాలా మండలాల్లోని వందలాది పాఠశాలలకు ఐఆర్‌టీ, ఐఐటీ, విద్యావలంటీర్లు వెళ్లలేదు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు.
విద్యార్థుల ఎదురుచూపులు
జిల్లాలో 4,500 ప్రాథమిక, 2,700 ప్రాథమికోన్నత, 572 ఉన్నత పాఠశాలలున్నాయి. సుమారు మూడు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. బడిబయట ఉన్న వారి సంఖ్య వేలలోనే ఉంటుంది. పథకం ప్రారంభంలో కొన్ని పాఠశాలల్లోనే పర్యటించిన సిబ్బంది 5వేల మంది దృష్టి లోపంతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో దృష్టి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 70 వేలపైనే ఉండే అవకాశం ఉంది.
కనీసం ఈ విద్యా సంవత్సరమైనా ఆయా స్కూళ్లలో కంటి స్క్రీనింగ్ చేపడితే శస్త్ర చికిత్సలు చేయించుకోలేని నిరుపేద విద్యార్థులకు ఆపరేషన్ చేసుకునే వీలుంటుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. పథకం విషయమై ఆర్వీఎం చిన్నారిచూపు పథక ఇన్‌చార్జి సంతోష్‌ను అడుగగా.. ఈ విద్యా సంవత్సరం పథక నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కాలేదన్నారు.
చిన్న‘చూపు’
Published Thu, Feb 20 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM
Advertisement
Advertisement