eye tests
-
నేత్ర దరహాసం... వికారాబాద్ జిల్లాలో ‘కంటి వెలుగు’ సంపూర్ణం
వికారాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం పూర్తయ్యింది. వంద పని దినాల్లో ప్రోగ్రామ్‌ను పూర్తిచేయాల్సి ఉండగా.. గడువులోపే ముగించి సర్కారు సంకల్పాన్ని విజయవవంతం చేశారు. ఇందుకోసం వైద్య సిబ్బంది, అధికారులు ఎంతగానో శ్రమించారు. రోజువారీ విధులు నిర్వర్తిస్తూనే కంటివెలుగు శిబిరాలు కొనసాగించారు. ఇదిలా ఉండగా అద్దాలు పంపిణీ చేసే విషయంలో మిగితా జిల్లాలతో పోలిస్తే వికారాబాద్ ముందు వరుసలో నిలిచింది. కలెక్టర్, డీఎంఅండ్‌హెచ్‌ఓ ఇతర అధికారుల నిరంతర పర్యవేక్షణతో పరీక్షలు, చికిత్సలు, అద్దాల పంపిణీ పూర్తయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతీ వ్యక్తికి నేత్ర పరీక్షలు చేయాలని ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం జిల్లాలో త్వరగా పూర్తి కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పరీక్షలు.. అవగాహన జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలు, 97 వార్డులు ఉన్నాయి. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలోని 20 మండలాల్లో సుమారు 9.27 లక్షల జనాభా ఉంది. వీరందరికీ నేత్ర పరీక్షలు చేసేందుకు 42 వైద్య బృందాలను నియమించారు. ఓ పక్క కంటి వెలుగు స్క్రీనింగ్ చేస్తూనే.. మరోపక్క నేత్ర సమస్యల నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో స్క్రీనింగ్ కేంద్రాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నవారిలో 25శాతం (1,24,364) మంది ఏదో ఒక కంటి సమస్యతో బాధ పడుతున్నట్లు తేలింది. ఇందులో కొందరికి రీడింగ్ గ్లాసెస్ అవసరమవగా మరికొందరికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని గుర్తించిన వైద్యులు వీటిని పంపిణీ చేశారు. మనమే నంబర్ వన్ జిల్లాలో జనవరి 19న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణాల్లో నిత్యం 42 బృందాలతో శిబిరాలు నిర్వహించారు. ఒక్కో క్యాంపులో నిత్యం 150 నుంచి 170 మందికి కళ్ల స్క్రీనింగ్ చేశారు. ప్రతీ శిబిరంలో వైద్యాధికారితో పాటు నేత్రవైద్యుడు, సిబ్బంది కలిపి ఎనిమిది మంది పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 9.27 లక్షల జనాభా ఉండగా.. ఇందులో 18 ఏళ్లు పైబడిన 4,83,794 మందికి నేత్ర పరీక్షలు పూర్తిచేశారు. వీరిలో 64,798 మందికి రీడింగ్ గ్లాసెస్ అవసరమని తేల్చి ఆరుగురు మినహా 64,792 మందికి అద్దాలు అందజేశారు. 59,566 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమని నిర్ధారించి.. ఇప్పటివరకు 50,235 మందికి అద్దాలు అందజేశారు. మిగిలిన వారికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన అద్దాలను పంపిణీ చేయడంలో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. సమష్టి కృషితోనే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తిచేశాం. పరీక్షలు నిర్వహించిన వారిలో తొంభైశాతం మందికి పైగా అద్దాలు పంపిణీ చేశాం. మిగిలిన వారికి త్వరలోనే అందజేస్తాం. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితోనే కార్యక్రమం విజయవంతమైంది. – పల్వాన్‌కుమార్, డీఎంహెచ్ఓ -
కోటి దాటిన కంటి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కంటి పరీక్షలు కోటి దాటాయి. రెండోవిడత కంటి వెలుగు కార్యక్రమం కింద ఇప్పటివరకు 1.01 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 18న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించడం తెలిసిందే. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో 47.70 లక్షల మంది పురుషులు, 53.85 లక్షల మంది మహిళలు, 3,360 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వివిధ రకాల కంటి సమస్యలున్న వారిలో 16.33 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. చత్వారం సమస్యలున్న 12.31 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసులు ఇవ్వాలని నిర్ణయించారు. -
వంద రోజుల్లో అందరికీ కంటి పరీక్షలు
గజ్వేల్: వందరోజుల్లో అందరికీ కంటి పరీక్షలు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంటి పరీక్షల తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటివెలుగు శిబిరాల నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 70 లక్షల పైచిలుకు మంది కంటి పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. వారిలో 32 లక్షలమంది పురుషులు, 37 లక్షల పైచిలుకు మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో 48.91 లక్షల మందికి ఎలాంటి సమస్యల్లేవని తేలిందన్నారు. కంటి సమస్యలు ఉన్న 12 లక్షల మందికి రీడింగ్ అద్దాలు ఇప్పటికే పంపిణీ చేయగా, మరో 8 లక్షల మందికి 15 రోజుల్లో డాక్టర్లు సూచించిన అద్దాలను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 4,565 పంచాయతీలు, 1,616 మున్సిపల్ వార్డుల్లో శిబిరాల నిర్వహణ పూర్తయ్యిందన్నారు. తనిఖీ సందర్భంగా శిబిరాల్లో మెరుగైన సేవలందుతున్నాయని మహిళలు చెప్పడం తనకు ఆనందాన్నిచ్చిందని మంత్రి చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ సిబ్బంది, ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఎంపీపీ అమరావతి, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, బీఆర్ఎస్ గజ్వేల్ మండల శాఖ అధ్యక్షులు బెండె మధు, గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కంటి ‘వెలుగు’ కావాలి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం రెండో విడత మొదలవనుండటంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. గతంలో కంటి పరీక్షలు చేసినప్పుడు ఇచ్చిన అద్దాలు ఇప్పుడు పనిచేయడం లేదని, కొత్తవి ఇవ్వాలన్న విజ్ఞప్తులతోపాటు.. ఆపరేషన్లు అవసరమయ్యే వారికి వెంటనే చేయించేలా ఏర్పాట్లు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. కేవలం పరీక్షలు జరిపి అద్దాలు, మందులతో సరిపెట్టవద్దని.. శస్త్రచికిత్స చేయించాలని బాధితులు కోరుతున్నారు. ఘనంగా ప్రారంభించినా.. రాష్ట్రంలో ప్రజల దృష్టి సమస్యలను నివారించేందుకు ప్రభుత్వం 2018 ఆగస్టు 15న ‘కంటి వెలుగు’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్ర జనాభాలో 25% మంది ఏదో ఒక స్థాయిలో కంటి సమస్యలతో బాధపడుతున్నారన్న విషయాన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డులు, పట్టణాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎనిమిది మందితో కూడిన వైద్యబృందాలు పరీక్షలు చేపట్టాయి. రూ.196.79 కోట్ల వ్యయంతో 826కిపైగా బృందాలతో నాలుగున్నర నెలలపాటు కార్యక్రమం కొనసాగింది. తొలిరోజున 1,09,000 మందిని పరీక్షించారు. గరిష్టంగా ఒక రోజున లక్షన్నర మందికి కంటి పరీక్షలు చేశారు. మొత్తంగా 38 లక్షల మందికిపైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో అవసరమైన వారికి అద్దాలు, మందులు ఇచ్చారు. ఆరున్నర లక్షల మందికిపైగా శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. ఇందులో మూడో వంతు మందికి ఆపరేషన్లు చేసినా.. ఆస్పత్రుల్లో సిబ్బంది, పరికరాలు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా మిగతా వారికి నిర్వహించలేకపోయారు. ఈసారి ఆపరేషన్లు చేస్తారా? ‘కంటి వెలుగు’ పథకం రెండో విడత ఈనెల 18న ఖమ్మం వేదికగా మొదలుకానుంది. శస్త్రచికిత్సలు అవసరమయ్యే పలు రకాల కంటి వ్యాధులతో బాధపడేవారు ఈసారి తమకు ఊరట లభిస్తుందనుకున్నా.. అధికారుల తీరుతో ఆందోళన నెలకొంది. ‘కంటి వెలుగు’కు సంబంధించిన ప్రకటనల్లో, వివరాల్లో ఎక్కడా శస్త్రచికిత్సల ప్రస్తావన రావడం లేదు. గతంలో చేసిన పరీక్షల ప్రకారమే నాలుగున్నర లక్షల మందికిపైగా శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి దానికి అదనంగా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ఆపరేషన్లు చేయించే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు వయసు మీద పడుతున్న కొద్దీ కంటి సమస్యలు తీవ్రమవుతుంటాయని, అందువల్ల ఏటా కంటి పరీక్షలు నిర్వహించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మసకబారుతున్న చూపు! క్రితంసారి ఇచ్చిన కంటి అద్దాల్లో చాలామందికి ఇప్పుడవి పనిచేయడం లేదు. వారిలో చూపు మసకబారి దృష్టి లోపాలు పెరిగిపోతున్నాయి. వీరిలో కొందరు శస్త్రచికిత్స అవసరమైన స్థితికి చేరినట్టు అంచనా. కంటిచూపు బాధితుల్లో అధికులు పేద, మధ్య తరగతివారే. వీరిలో కొందరు అప్పోసప్పో చేసి ప్రైవేటులో చికిత్స చేయించుకుంటున్నా.. చాలామందికి ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేక అంధత్వం బారిన పడుతున్నారు. అప్పుడిచ్చిన అద్దాలు సరిగా పనిచేయట్లేదు.. ప్రభుత్వం కంటి వెలుగు పథకం కింద కంటి అద్దాలు ఇచ్చింది. అయితే కొన్నిరోజుల నుంచి అవి సరిగా పనిచేయట్లేదు. సరిగా కనిపించడం లేదు. ఆ అద్దాలు పెట్టుకోవట్లేదు. కొత్త అద్దాలు ఇవ్వాలి. – తోకునూరి నర్సమ్మ, చింతపల్లి, సీరోలు మండలం, మహబూబాబాద్ జిల్లా ఈసారైనా ఆపరేషన్ చేస్తారో..లేదో! నాకు ఒక కన్ను పూర్తిగా కనిపించదు. తొలివిడత కంటి వెలుగు కార్యక్రమంలో డాక్టర్లు పరీక్షించి.. ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇంతవరకు చేయలేదు. చాలా ఇబ్బంది అవుతోంది. ఈసారి చేయిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడైనా అవుతుందో లేదో.. – రంగమ్మ, సోంపురం, కేటీదొడ్డి, జోగుళాంబ గద్వాల జిల్లా కంటి వెలుగుకు సహకరిస్తాం ప్రభుత్వం పేదల కోసం మంచి కార్య క్రమం చేపట్టింది. దృష్టి సమస్యలతో బాధపడుతున్న వారికి కంటి పరీక్షలు నిర్వ హించి అద్దాలు ఇవ్వడం అభినందనీయం. ప్రభుత్వం పిలిస్తే ప్రైవేటుగా ప్రాక్టీసు చేస్తున్న వేలమంది ఆప్తా ల్మాలజిస్టులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తరఫున స్వచ్ఛందంగా కంటివెలుగులో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. – డాక్టర్ బీఎన్ రావు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు -
అవ్వాతాతల కంటికి వెలుగు
సాక్షి, అమరావతి: మలిసంధ్యలో కంటిచూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు ‘డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు’ కార్యక్రమం చూపు ప్రసాదిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా 60ఏళ్లు పైబడిన వృద్ధులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. చూపు సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి మందులు, కళ్లద్దాలు అందించడంతో పాటు, కేటరాక్ట్ సర్జరీలు ఉచితంగా చేస్తోంది. రాష్ట్రంలోని 5.60 కోట్ల మందికి కంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేయాలనే ఉద్దేశ్యంతో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ 2019 అక్టోబర్ 10న శ్రీకారం చుట్టారు. ఆరు దశల్లో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా తొలి రెండు దశల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 66.17 లక్షల మంది పిల్లలకు వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 1.58 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయడంతో పాటు, 300 మందికి పైగా పిల్లలకు సర్జరీలు చేశారు. 22.16 లక్షల మందికి పరీక్షలు ఇక మూడో దశలో.. 60 ఏళ్లు పైబడిన 56,88,424 మంది వృద్ధులకు కంటి పరీక్షలు చేయాలన్న లక్ష్యంతో 2020 ఫిబ్రవరిలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వీరిలో ఇప్పటివరకూ 22,16,031 మందికి పరీక్షలు పూర్తయ్యాయి. ఇందులో 10,42,457 మందికి మందుల ద్వారా నయమయ్యే సమస్యలున్నట్లు గుర్తించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 10,01,049 మందికి కళ్లద్దాలు అవసరం ఉండగా 8,31,584 మందికి పంపిణీ పూర్తయింది. అలాగే, 1,69,105 మంది వృద్ధులు శుక్లాల సమస్యతో బాధపడుతున్నట్లు వైద్య బృందాలు గుర్తించి వీరికి ప్రభుత్వమే ఉచితంగా కేటరాక్ట్ సర్జరీలు చేపడుతోంది. ఈ కార్యక్రమ నిర్వహణలో ఉమ్మడి విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే తొలిస్థానంలో ఉంది. ఈ జిల్లాలో 1.52 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా 53.72 శాతం మందికి పూర్తయ్యాయి. అలాగే, 50.88 శాతం మందికి పరీక్షలు నిర్వహించి ఉమ్మడి వైఎస్సార్, 50.66 శాతంతో శ్రీకాకుళం జిల్లాలు తర్వాత స్థానంలో ఉన్నాయి. ఈ ఆస్పత్రులు వెరీ పూర్ కేటరాక్ట్ సర్జరీల నిర్వహణలో రాష్ట్రంలోని పలు ప్రభుత్వాస్పత్రులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తుంటే, మరికొన్ని ఆస్పత్రుల్లో అంతంతమాత్రంగానే సర్జరీలు జరుగుతున్నాయి. డీఎంఈ పరిధిలోని ఆస్పత్రులను పరిశీలిస్తే.. ఈనెల 15 నుంచి 21 మధ్య వారం రోజుల్లో 41 సర్జరీలతో విశాఖపట్నం రీజనల్ కంటి ఆస్పత్రి తొలిస్థానంలో ఉంది. కర్నూలు రీజినల్ కంటి ఆస్పత్రిలో 35 సర్జరీలు, గుంటూరు జీజీహెచ్‌లో 30 సర్జరీలు నిర్వహించారు. మరోవైపు.. ఎనిమిది మంది సర్జన్స్ ఉన్నప్పటికీ అనంతపురం జీజీహెచ్‌లో ఒక్క సర్జరీ కూడా నిర్వహించలేదు. ఇక వైద్య విధాన పరిషత్ విభాగంలో.. ఏలూరు జిల్లా ఆస్పత్రి 61 సర్జరీలు నిర్వహించి రాష్ట్రంలోనే తొలిస్థానంలో ఉంది. ఇదే విభాగంలోని గూడూరు, రామచంద్రాపురం, నరసరావుపేట, పాలకొల్లు, తణుకు, పాడేరు ఏరియా ఆస్పత్రులు, మార్కాపురం జిల్లా ఆస్పత్రిలో వారం రోజుల్లో ఒక్క సర్జరీ కూడా నిర్వహించలేదు. ఉచితంగా ఆపరేషన్ చేశారు నేను చేనేత కార్మికుడిని. కంటిచూపు మందగించడంతో కంటి వెలుగు కింద ప్రభుత్వం ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తోందని తెలిసింది. మా గ్రామంలో శిబిరం ఏర్పాటుచేసినప్పుడు పరీక్ష చేయించుకున్నాను. శుక్లాలు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రభుత్వం ఇటీవలే కంటికి ఉచితంగా ఆపరేషన్ చేయించింది. ఇప్పుడు బాగా కనిపిస్తోంది. – సీహెచ్ మల్లికార్జునరావు, వీరులపాడు, ఎన్టీఆర్ జిల్లా వేగంగా పూర్తిచేయడానికి చర్యలు వృద్ధులందరికీ కంటి పరీక్షలు వేగంగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. వారం వారం కార్యక్రమంపై సమీక్షలు నిర్వహిస్తున్నాం. మందకొడిగా పరీక్షలు, సర్జరీలు జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాం. – డాక్టర్ యు. స్వరాజ్యలక్ష్మి, ప్రజారోగ్య సంచాలకులు -
వీడుతున్న ‘మసక’ తెరలు
సాక్షి, అమరావతి: కళ్లు మసకబారడం, కంటి శుక్లాలతో చూడటానికి ఇబ్బందులు పడ్డ అవ్వాతాతల కష్టాలకు ప్రభుత్వం చరమగీతం పలికింది. 60 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వమే ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అద్దాలు కూడా ఉచితంగా ఇస్తోంది. దీంతో ఇన్నాళ్లూ మసక మసక కంటిచూపుతో బాధపడ్డ అవ్వాతాతలు ఇప్పుడు ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడ్డారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం అవ్వాతాతలకు చేస్తున్న కంటి పరీక్షల సంఖ్య 12.19 లక్షలు దాటింది. ఇందులో 6.85 లక్షల మందికి పైగా కళ్లద్దాలు అవసరమని వైద్యులు తేల్చారు. అంటే.. 56 శాతం మందికి పైగా కళ్లద్దాలు అవసరం. వీరికి దశల వారీగా ప్రభుత్వం కళ్లద్దాలు ఉచితంగా అందిస్తోంది. అలాగే కంటి శుక్లాలతో బాధపడ్డవారికి ప్రభుత్వం ఉచితంగా కేటరాక్ట్ ఆపరేషన్లు చేయించడంతో బాధితులకు పెద్ద సమస్య నుంచి విముక్తి లభించింది. పరీక్షలు చేసిన 12.19 లక్షల మందిలో 1.09 లక్షల మందికి కేటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని గుర్తించగా ఇప్పటికే 91 శాతం మందికి సర్జరీలు పూర్తి చేశారు. ఇంత పెద్ద ఎత్తున కంటి వైద్య పరీక్షలు చేస్తున్న రాష్ట్రం దేశంలోనే లేకపోవడం గమనార్హం. 297 మండలాల్లో పరీక్షలు పూర్తి సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్రంలో 297 మండలాల్లో అవ్వాతాతలకు కంటి పరీక్షలు పూర్తయ్యాయి. మరో 370 మండలాల్లో కొనసాగుతోంది. రోజుకు 50 కేసులకుపైగా పరీక్షలు చేసే బృందాలు 33 పనిచేస్తున్నాయి. అలాగే 25 నుంచి 50 వరకు చేసే బృందాలు 195, 10 నుంచి 25 వరకు చేసే బృందాలు 129, పది మంది కంటే తక్కువగా చేసే బృందాలు 21 విధులు నిర్వహిస్తున్నాయి. కంటి వైద్యులు, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్లు మొత్తం కలిపి 370 బృందాలు పనిచేస్తున్నాయి. ఇవి వారానికి సగటున 55 వేల మందికి పైగా పరీక్షలు చేస్తున్నాయి. 99 వేల మందికిపైగా సర్జరీ పూర్తి రాష్ట్రవ్యాప్తంగా కంటిశుక్లాలతో సరిగా చూపులేక బాధపడుతున్న అవ్వాతాతల్లో ఇప్పటివరకు 99,752 మందికి కేటరాక్ట్ సర్జరీలు పూర్తి చేశారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12,898 మందికి శస్త్రచికిత్స నిర్వహించారు. ఇందులో 11,700 సర్జరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, 54 వేలకుపైగా ఎన్జీవో ఆస్పత్రుల్లో, 33 వేలకు పైగా ప్రైవేటు ఆస్పత్రుల్లో (ఆరోగ్యశ్రీ కింద) చేశారు. దీనికంటే ముందే తొలి దశలో అన్ని స్కూళ్లలో 66 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంకా ఎక్కువ చేయాలి.. ప్రస్తుతం చేస్తున్న వాటికంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కువగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేయాలని సూచించాం. ఇప్పటికే ప్రభుత్వ వైద్యులకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో అత్యాధునిక వైద్యానికి సంబంధించిన శిక్షణ ఇప్పించాం. కంటి సర్జరీలకు అవసరమైన వైద్య ఉపకరణాలన్నీ అందుబాటులో ఉన్నాయి. బోధనాస్పత్రుల్లో ఆపరేషన్లు ఎక్కువగా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – డా.హైమావతి, నోడల్ అధికారి, వైఎస్సార్ కంటివెలుగు -
అవ్వాతాతల కంటికి వెలుగు
సాక్షి, అమరావతి: అవ్వాతాతలకు కంటి పరీక్షలు మళ్లీ మొదలయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈనెల రెండోతేదీ నుంచి కంటి పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా 60 ఏళ్ల అవ్వాతాతల కంటిచూపు గురించి ఆలోచించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వారికి నేత్రపరీక్షలు చేయించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 56,88,424 మంది అవ్వాతాతలకు వారి గ్రామ, వార్డుల్లోనే వైఎస్సార్ కంటివెలుగు మూడోవిడత కింద కంటి పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 18న కర్నూలులో సీఎం జగన్ ప్రారంభించారు. కోవిడ్–19 లాక్డౌన్ నేపథ్యంలో మార్చి నెలాఖరు నుంచి ఈ పరీక్షలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈనెల 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ ప్రారంభించారు. గ్రామ, వార్డుల్లో కాకుండా పీహెచ్‌సీలు, వైద్యసంస్థల్లో అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేస్తున్నారు. తొలి, మలివిడత పరీక్షలు సమాంతరంగా చేయడం ప్రారంభించారు. తొలివిడత ప్రాథమికంగా పరీక్షిస్తారు. దాన్లో మళ్లీ పరీక్షించాలని తేలితే అక్కడే కంట్లో చుక్కలమందు వేసి రెండోసారి పరీక్షిస్తున్నారు. రెండోసారి పరీక్షలో అద్దాలు ఇవ్వాలని గుర్తిస్తే అద్దాలు రాయడమే కాకుండా వాటిని తయారు చేయడానికి ఆర్డర్‌ను కూడా ఇచ్చారు. శస్త్రచికిత్స అవసరమైన వారిని ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించే ఏర్పాట్లు చేశారు. 33,222 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తింపు కోవిడ్–19 ప్రభావం రాకముందు 3.06 లక్షలమంది అవ్వాతాతలకు కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో అవసరమైన 90,773 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. 33,222 మందికి శస్త్రచికిత్స, 3,501 మందికి ఇతర చికిత్స అవసరమని గుర్తించారు. ఇప్పటికే 6,473 మందికి శస్త్రచికిత్సలు చేశారు. మిగిలినవారికి కూడా కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ వీలైనంత త్వరగా శస్త్రచికిత్సలు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వీరికి శంకర నేత్రాలయం, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయిస్తున్నామని వైఎస్సార్ కంటివెలుగు నోడల్ ఆఫీసర్ హైమావతి చెప్పారు. -
ముందు ‘చూపు’ భేష్
‘సర్వేంద్రియాణాం.. నయనం ప్రధానం’ అన్నారు. చూపు సమస్యను నిర్లక్ష్యం చేయొద్దని దీని అర్థం. ఈ విషయం తెలిసినా చాలా మంది వివిధ కారణాల వల్ల నిర్లక్ష్యం చేస్తుంటారు. పేదరికం వల్ల చాలా మంది కంటి పరీక్షలు చేయించుకోవడానికి వెనకాడుతుంటారు. ఈ విషయాన్ని సీరియస్‌గా గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని తీసుకొచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా వట్లూరులో మూడవ తరగతి చదువుతున్న పఠాన్ అన్సర్ నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. తనకు కంటి చూపు బాగుందో లేదో కూడా తెలియదు. డాక్టర్లు స్కూలుకు వచ్చి పరీక్షలు చేశాక చూపులో సమస్య ఉందని తేలింది. విశాఖపట్నంలోని ఓ మున్సిపల్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న లక్ష్మికుమారిదీ ఇదే సమస్య. ‘వైఎస్సార్ కంటి వెలుగు’ ద్వారా వీరి సమస్యకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం దొరికింది. సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ముందు చూపు లక్షలాది మంది చిన్నారుల కళ్లలో వెలుగు నింపుతోంది. కంటిచూపు మందగించినా, అక్షరాలు మసక మసకగా కనిపించినా.. సమీపంలో డాక్టరు లేక, ఉన్నా వైద్యానికి ఖర్చు చేయలేక అలాగే ఉండిపోయి ఇబ్బందులు పడుతున్న ఎందరో చిన్నారులకు వైఎస్సార్ కంటి వెలుగు పథకం వరంగా మారింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు..60,668 స్కూళ్లలో 69,43,052 లక్షల మంది చిన్నారులకు ఈ పథకం కింద కంటి పరీక్షలు నిర్వహించి, సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపే దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులేస్తోంది. రాష్ట్రంలో వైఎస్సార్ కంటి వెలుగు పథకం మహోద్యమంలా సాగుతో ఇప్పటివరకు 2,12,024 మంది బాలికలకు, 2,18,898 మంది బాలురకు కంటి సమస్యలు ఉన్నట్టు తేలింది. మొత్తంగా బాలురలోనే ఎక్కువ కంటి సమస్యలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. వీరిలో పెద్ద పెద్ద సమస్యలున్న చిన్నారులందరికీ బోధనాసుపత్రిలో మెరుగైన వైద్యం (శస్త్రచికిత్స) చేయించి, ఉచితంగా కళ్లజోడు ఇచ్చేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం అమలులో ప్రభుత్వ వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు, ఆరోగ్యశాఖ అధికారులు ఇలా ఎంతోమంది భాగస్వాములయ్యారు. మొత్తం ఆరు దశల్లో జరిగే కార్యక్రమంలో త్వరలోనే పెద్దవారికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తారు. మేమే వాళ్ల దగ్గరకు వెళ్లాం వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రజల చెంతకే వెళ్లి సేవలందించే పథకం. వైద్యులు, వైద్య సిబ్బంది స్కూళ్లకు వెళ్లకపోతే ఆ చిన్నారులు ఆస్పత్రులకు రాలేరు. దీనివల్ల వారికి ఉన్న సమస్యలూ గుర్తించలేం. సమస్య తీవ్రతరమయ్యాక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ప్రస్తుతం ఈ పథకం వల్ల కంటి సమస్యలు గుర్తించే ప్రక్రియ సులభమవుతోంది. ఉపాధ్యాయులకు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇస్తే ప్రాథమికంగా కంటి సమస్యలు గుర్తించ వచ్చు. ఆరు మీటర్ల దూరంలో ఒక చార్ట్ ఇచ్చి అక్షరాలు చదవమంటే వారిలో దృష్టి లోపం ఉందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. విటమిన్ ఎ ద్రావణం తగినంత లేదు. ఇది పుష్కలంగా సరఫరా చేయాల్సి ఉంది. 50 ఏళ్లు దాటితే ఏడాదికోసారి కంటి పరీక్షలు విధిగా అవసరం. – డా.పల్లంరెడ్డి నివేదిత, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, కర్నూలు చాలా బాగుంది పాఠశాల విద్య అభ్యసించే చిన్నారులందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తుండటం చాలా గొప్ప విషయం. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులందరూ పేద, మధ్యతరగతి వారే. వారంతకు వారు స్వయంగా ఆసుపత్రులకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోవడానికి వీలుండేది కాదు. అటువంటిది వైద్యులే పాఠశాలకు వచ్చి పరీక్షలు నిర్వహించడం చాలా బాగుంది. –పి. నాగమణి, ప్రధానోపాధ్యాయురాలు, నగరపాలకోన్నత పాఠశాల (మెయిన్), కడప మంచి పరిణామం ప్రజల నేత్ర సంరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ఎంతో బాగుంది. పాఠశాలలకే వెళ్లి, విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించి అవసరమైన వారికి కళ్లజోళ్లు ఉచితంగా అందించడం, శస్త్ర చికిత్సలను సైతం ఉచితంగా చేయించాలని నిర్ణయించడం మంచి పరిణామం. – గోదా నాగలక్ష్మి, గుంటూరు గుంటూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమంలో గుంటూరు జిల్లాలో కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఈ జిల్లాలో 47,499 మంది స్కూలు విద్యార్థులు కంటి చూపునకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఆ తర్వాత విశాఖ జిల్లాలో 46,002 మంది విద్యార్థులు కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. కంటి పరీక్షల స్క్రీనింగ్‌లోనూ, బాధితుల సంఖ్యలోనూ విజయనగరం జిల్లా చివరలో ఉంది. ఇక్కడ 3,03,819 మందికి పరీక్షలు నిర్వహించగా, 12,959 మంది విద్యార్థులకు మాత్రమే కంటి సమస్యలున్నాయి. -
మా కంటికి వెలుగెప్పుడు సారూ..!
సాక్షి, మేడ్చల్ జిల్లా : కంటి పరీక్షలు చేశారు.. చాలా మందికి కళ్లజోళ్లిచ్చారు..మరి మాకు శస్త్ర చికిత్స ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు వేలాది మంది నిరుపేదలు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు పేరిట నిర్వహించిన కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా వేలాదిమందికి కంటిపరీక్షలు చేయించింది. అయితే పరీక్షలు చేయించింది కానీ కొందరికే కంటి ఆపరేషన్లు చేశారు. మిగతావారంతా మాకెప్పుడుఅంటూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో 42,148 మందికి శస్త్ర చికిత్సలు చేయాల్సి రావటంతో, జిల్లాలో గుర్తించిన పది ఆసుపత్రులకు సిఫారసు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 520 మందికి మాత్రమే కంటి శస్త్ర చికిత్సలు చేయగా, మిగతా 41,628 మంది శస్త్ర చికిత్సల కోసం ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ శస్త్ర చికిత్సలకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయకపోవటంతో ఆరోగ్యశ్రీ తదితర పథకం కింద మిగతా వారికి ఆపరేషన్లు చేయటం జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తున్నది. జిల్లాలో కంటి వెలుగు సాగిందిలా.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 89 గ్రామాలు, బస్తీల్లో ఉచిత కంటి పరీక్షల కార్యక్రమం జోరుగా సాగింది. ఆగష్టు 15 నుంచి ఏప్రిల్ 15 వరకు 6,366 కంటి వెలుగు శిబిరాలు నిర్వహించి 12,86,434 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో కంటి పరీక్షల కోసం 52 బృందాలను ఏర్పాటు చేశారు. అర్బన్ పరిధిలో 43 , రూరల్ ప్రాంతాల్లో 9 బృందాలు కంటి పరీక్షలు చేపట్టాయి. 1.27 లక్షల మందికి కంటి అద్దాలు.. జిల్లాలో కంటి పరీక్షలు నిర్వహించిన 12,86,434 మందిలో కంటి అద్దాలు అవసరంగా భావించి 1,27,144 మందికి ఉచితంగా కళ్ల జోళ్లు పంపిణీ చేశారు. మరో 82,157 మందికి దృష్టి లోపం ఉందని గుర్తించారు. ఇందులో 56,227 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయగా, మరో 878 కంటి అద్దాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మిగతా కంటి అద్దాలు రాగానే దృష్టి లోపం ఉన్న వారందరికి అందజేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. మరి శస్త్ర చికిత్సల మాటేమిటి అట్టహాసంగా శిబిరాలు నిర్వహించి దృష్టి లోపం ఉందని గుర్తించి తీరా ఆపరేషన్ వద్దకు వచ్చేసరికి పట్టించుకోవటం లేదని పలువురు వాపోతున్నారు. కంటి సమస్య తీవ్రంగా ఉందని.. రోజూ ఆస్పత్రికి వెళ్లి ఎప్పుడు చేస్తారని అడుగుతున్నామని బాధితులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు శస్త్ర చికిత్స నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. 12.86 లక్షలుకంటి పరీక్ష చేయించుకున్న వారు 1.27లక్షలుకళ్లజోళ్ల పంపిణీ 42,148 శస్త్ర చికిత్సల కోసం సిఫార్సు 520ఇప్పటి వరకు చేసిన కంటి ఆపరేషన్లు 41,628 శస్త్ర చికిత్స కోసంఎదురు చూస్తున్న వారు -
బలహీనవర్గాల కళ్లలో ‘వెలుగు’
సాక్షి, హైదరాబాద్: ‘కంటి వెలుగు’ పథకాన్ని అత్యధికంగా బడుగు, బలహీన వర్గాలే ఉపయోగించుకున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కార్యక్రమంపై అధికారులు శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిప్రకారం 99.41 శాతం గ్రామాల్లో ‘కంటి వెలుగు’ పూర్తయింది. 9,873 గ్రామాల్లో ‘కంటి వెలుగు’ శిబిరాలు నిర్వహించారు. మొత్తం 1.54 కోట్ల మంది ప్రజలు ఈ పథకం కింద నేత్ర పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 90.25 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలే ఉన్నారని నిర్ధారించారు. 9.75 శాతం మంది ఓసీలు ఉపయోగించుకున్నట్లు తేల్చారు. అత్యధికంగా బీసీలు 89.87 లక్షల (58.12%) మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఎస్సీలు 16.60 శాతం, ఎస్టీలు 11.02 శాతం, మైనారిటీలు 4.51 శాతం ఉపయోగించుకున్నారు. 22.91 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు గత ఆగస్టు 15న కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. 7 నెలల పాటు కొనసాగి విజయవంతంగా ముగిసింది. కోటిన్నర మందికిపైగా కళ్లల్లో వెలుగులు నింపిన ఈ కార్యక్రమం రెట్టింపు స్థాయిలో విజయవంతమైందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా 9 గ్రామాలు, 8 మున్సిపల్ వార్డుల్లో కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 828 బృందాలు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. నేత్ర పరీక్షలు చేయించుకున్నవారిలో దృష్టి సమస్యలున్న 22.91 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు అందించారు. ఇక చత్వారం ఉన్నవారు 18.13 లక్షలుండగా, వారిలో ఇప్పటివరకు 9.70 లక్షల మందికి కళ్లజోళ్లు అందజేశారు. మరో 8.42 లక్షలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. పరీక్షలు చేయించుకున్నవారిలో 1.04 కోట్ల మందికి ఎటువంటి కంటి సమస్యలు లేవని నిర్ధారణ అయింది. 9.3 లక్షల మందికి ఆపరేషన్లు కంటి పరీక్షల అనంతరం 9.30 లక్షల మందికి ఆపరేషన్లు, ఇతరత్రా ప్రత్యేక వైద్యం అవసరమని వైద్యులు నిర్ధారించారు. మొదట్లో ఆపరేషన్లు చేయాలని భావించినా అసెంబ్లీ ఎన్నికల కారణంగా నిలిపివేశారు. అప్పుడు ఒకట్రెండు చోట్ల చేపట్టిన కంటి ఆపరేషన్లు వికటించాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఆపరేషన్లపై అధికారులు ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. -
కోటి కళ్ల చల్లని చూపు
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో వృద్ధులు దూరం నుంచి ఎవరినైనా చూడాలంటే కను బొమల పైన చెయ్యి పెట్టుకొని, కళ్లు చిన్నవి చేసుకొని చూస్తుండటం సర్వసాధారణం. ఇక మరికొందరి కళ్లు పూర్తిగా కనిపించకపోయినా అలాగే కాలం వెళ్లదీయడమూ మనకు తెలుసు. కళ్లు కనిపిం చడం లేదన్న సంగతి వారికి తెలుసు. కానీ వైద్యం చేయించుకునే స్థోమత లేకపోవడం, ఆరోగ్యశ్రీలోనూ దానికి ఉచిత వైద్య చికిత్స చేయకపోవడంతో లక్షలాది మంది ఇప్పటివరకు అలాగే కనుచూపు కరువై జీవిస్తున్నారు. కానీ ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి మారుతోంది. కంటి వెలుగు కింద ప్రభుత్వం కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళ్లద్దాలు ఇస్తుండటంతో గ్రామీణుల్లో ఆనందం వెల్లివిరిసింది. అప్పటివరకు తమ మనవడిని, మనుమరాలిని సంపూర్ణంగా చూడలేని పరిస్థితి నుంచి ఇప్పుడు వారిని నిండుగా కళ్లారా చూస్తుండటంతో కంటి వెలుగుపై గ్రామీణుల్లో స్పందన పెరిగింది. అదికాస్తా ఎన్నికల్లో ఓటు రూపంలో టీఆర్ఎస్కు లాభించింది. ‘కేసీఆరే కంటి పరీక్షలు చేయిస్తున్నాడంట. ఆయన చలువ వల్లే కళ్లద్దాలు వచ్చాయి. ఇప్పుడు తృప్తిగా అందరినీ చూస్తున్నామ’న్న ప్రచారం జరిగింది. కేసీఆర్ కంటి పరీక్షలంటూ ప్రజలు పిలుచుకుంటున్నారు. ఒకవైపు వృద్ధాప్య పింఛన్, మరోవైపు కంటి చూపుతో వృద్ధులు, పెద్దలు టీఆర్ఎస్ను నిలువెల్లా దీవించారు. 90% మంది బడుగు బలహీన వర్గాలే.. ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమం ప్రారం భమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎన్నికల ముందు రోజు వరకు ఏకంగా కోటి మందికి కంటి పరీక్షలు చేశారు. కోటి మందిలో 45.15 లక్షల మంది పురుషులు, 54.85 లక్షల మంది మహిళలు ఉన్నారు. కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో చాలామంది 18 ఏళ్లకు పైబడిన వారే ఉన్నారు. పైగా పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో దాదాపు 90% మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సగానికి పైగా బీసీలే కావడం గమనార్హం. బీసీలు 56.83 లక్షల (56.82%) మంది పరీక్షలు చేయించుకున్నారు. కోటి మందిలో 36.61 లక్షల మందికి ఏదో ఒక కంటి లోపం ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అందులో 16.66 లక్షల మందికి అక్కడికక్కడే ఉచితంగా రీడింగ్ గ్లాసులు ఇచ్చారు. ఇక వారు కాకుండా చత్వారంతో బాధప డుతున్నవారు 12.95 లక్షల మంది ఉన్నారు. వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారుచేసి ఇవ్వాలని నిర్ణ యించారు. అందులో ఇప్పటికే 1.96 లక్షల మందికి చత్వారం అద్దాలు అందజేశారు. వీరంతా ప్రభు త్వంపై కృతజ్ఞతాభావంతో ఉన్నారు. ‘ప్రభుత్వం గ్రామంలోకి వచ్చి కంటి పరీక్ష చేసి ఉచితంగా కళ్లద్దాలు ఇవ్వడమనేది సాధారణ విషయం కాదు. గ్రామాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కళ్లద్దాలు పెట్టుకున్నవారే కనిపిస్తున్నారు. కాబట్టి కంటి వెలుగు కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అది టీఆర్ ఎస్‌కు ఓట్ల వర్షం కురిపించింద’ని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 4.47 లక్షల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమం మొదలుపెడతామని వివరించారు. ►16.6 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు ఇచ్చిన వైనం ►12.95 లక్షల మందికి చత్వారం అద్దాలు -
‘కోటి’ కాంతులు
సాక్షి, హైదరాబాద్: ‘కంటి వెలుగు’కార్యక్రమం రికార్డు సృష్టించింది. రికార్డుస్థాయిలో కోటిమంది కళ్లల్లో వెలుగు నింపింది. ఒకవైపు ఎన్నికల ప్రచారం ఊపు మీదున్నా ‘కంటి వెలుగు’కార్యక్రమానికి ఏమాత్రం విఘాతం కలగలేదు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. ఆగస్టు 15న ప్రారంభమైన కంటి వెలుగు కింద బుధవారం నాటికి కోటి మందికి కంటి పరీక్షలు చేయడం దేశంలోనే ఒక రికార్డు అని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అభివర్ణిస్తున్నారు. ఈ మేరకు ఆ శాఖ బుధవారం ప్రభుత్వానికి నివేదిక పంపింది. దాని ప్రకారం... కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో 45.15 లక్షల మంది పురుషులు, 54.85 లక్షల మంది మహిళలున్నారు. కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో దాదాపు అందరూ 18 ఏళ్లకు పైబడినవారే. అంటే.. ఈ కోటి మంది ఓటర్లే కావడం గమనార్హం. వీరందరిపై అధికార పార్టీ ఆశలు పెట్టుకుంది. కోటి ఓట్లను కంటి వెలుగు ప్రభావితం చేస్తుందా లేదా అనేది చూడాలి. కంటి పరీక్షలు నిర్విఘ్నంగా కొనసాగుతుండటంతో లబ్ధిదారులు తమను గుర్తు పెట్టుకొని మరీ ఓటేస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సగానికిపైగా బీసీలే... రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించాలనేది సర్కారు ఆలోచన. తద్వారా అవసరమైన వారికి కళ్లద్దాలు ఇవ్వడం, ఆపరేషన్లు నిర్వహించడం దీని ఉద్దేశం. కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో సగానికిపైగా బీసీలే కావడం గమనార్హం. ఈ వర్గాల వారంతా కూడా పేదలే కావడంతో కంటి సమస్యలను ఇన్నాళ్లు పట్టించుకోలేదు. చూపు కనిపించినా కనిపించకపోయినా అలాగే కాలం వెళ్లదీస్తూ వచ్చారు. అత్యవసర వైద్యానికే దిక్కులేనప్పుడు కంటి గురించి పట్టించుకునేవారే లేకుండా పోయారు. చివరకు ఎలాగోలా ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహించడంతో వారంతా ఆనందంలో ఉన్నారు. 16.66 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు... కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో 36.61 శాతం మందికి ఏదో ఒక కంటి లోపం ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అందులో 16.66 లక్షల మందికి అక్కడికక్కడే ఉచితంగా రీడింగ్ గ్లాసులు ఇచ్చారు. వారుకాకుండా చత్వారంతో బాధపడుతున్నవారు 12.95 లక్షల మంది ఉన్నారు. వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో ఇప్పటివరకు 1.96 లక్షల మందికి చత్వారం గ్లాసులు అందజేశారు. వీరుగాక 4.47 లక్షల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉందని నిర్ధారణకు వచ్చారు. మరో 2.49 లక్షల మందికి ఇతరత్రా ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని వైద్యులు తేల్చారు. అందులో కొందరికి ఇప్పటికే ఆపరేషన్లు చేసినా, ప్రస్తుతం ఎన్నికలు కావడంతో మిగతావారికి బ్రేక్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఆపరేషన్లు చేస్తారని అధికారులు చెబుతున్నారు. -
దూర ’దృష్టి’ లోపం
‘కంటివెలుగు’ కార్యక్రమం చీకటి తెరలను తొలగించడం లేదు. అందరికీ చక్కటి చూపు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం.. దగ్గరి చూపు కళ్ల జోళ్లు అందజేతకే పరిమితమైంది. దూర దృష్టి లోపమున్న వారికి కళ్ల అద్దాల పంపిణీ అటకెక్కింది. కంటి పరీక్షలు చేయించుకుని 50 రోజులు దాటినా అద్దాల ఊసే లేదు. కనీసం ఎప్పుడు వస్తాయన్న విషయంపైన స్పష్టత లేదు. దీంతో పరీక్షలు చేయించుకొని దూరపుచూపు అద్దాలు అవసరమున్న 50 వేల మంది నిరీక్షిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమంలో ఇంకా శస్త్రచికిత్సలు ప్రారంభం కాలేదు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా జనాభా 24.46 లక్షలు. ఇందులో 35 నుంచి 40 శాతం మంది వరకు కంటి సంబంధ సమస్యలతో సతమతం అవుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల అంచనా. వీరందిరికీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోపు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం, అవసరమైతే కళ్ల జోళ్లు, మందులు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అలాగే దృష్టిలోపం తీవ్రంగా ఉంటే శస్త్ర చికిత్సలు నిర్వహించి చక్కటి చూపు ప్రసాదించాలి. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 55 మెడికల్ టీంలు ప్రతి గ్రామంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల నేత్రాలను స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 3 లక్షల మందిని స్క్రీనింగ్ చేయగా.. ఇందులో సుమారు 73 వేల మందికి దగ్గరి చూపు లోపమున్నట్లు గుర్తించి వారికి కళ్ల అద్దాలు అందజేశారు. దూరపు చూపు లోపమున్నట్లు 65 వేల మందికి పైగా గుర్తించారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించిన వారం రోజుల్లోగా అద్దాలు అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా కనీసం ఒక్కరికి కూడా అద్దాలు అందించిన దాఖలాలు లేవు. శస్త్ర చికిత్సలకు సెలవు! కంటిశుక్లం, మోతియ బిందువు, నల్లపాప మీద పొర, మెల్లకన్ను తదితర లోపాలున్న వారిని పైఆస్పత్రులకు రిఫర్ చేసి అక్కడ శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంది. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 25 వరకు నోడల్ ఆస్పత్రులను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ఒకటిరెండు మినహా అన్ని ప్రైవేటు ఆస్పత్రులే. శస్త్రచికిత్సలు అవసరమని ఇప్పటి వరకు 33 వేల మందికి పైగా గుర్తించారు. వీరందరినీ ఆయా ఆస్పత్రులకు తీసుకెళ్లి శస్త్రచికిత్సలు చేయించాల్సిన బాధ్యత అధికారులది. అయితే, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో నోడల్ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు మొదలు కాలేదు. ఉత్సాహంగా క్యాంపులకు వెళ్లి పరీక్షలు చేయించుకున్న జనం.. శస్త్రచికిత్సలు కోసం వేయికళ్లలో నిరీక్షిస్తున్నారు. అయితే, ఇప్పట్లో శస్త్రచికిత్సలు ఉండవన్న సంకేతాలు సైతం వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి లేదా ఫివ్రబరిలో చేయొచ్చని అధికారులు నర్మగర్భంగా చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా పేరుకే కంటి వెలుగు కార్యక్రమం ఉన్నా.. పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోందని బాధితులు మథనపడుతున్న సంఘటనలు ప్రతి పల్లెలో కనిపిస్తున్నాయి. అద్దాలు ఇంకా రాలేదు ప్రస్తుతం దగ్గరి చూపు లోపమున్న వారికి కళ్ల అద్దాలు అందజేస్తున్నాం. దూరపు చూపులోపమున్న వారు అద్దాల కోసం కొన్ని రోజులు ఆగాలి. ప్రభుత్వం నుంచి జిల్లాకు ఇంకా రాలేదు. రాగానే వీలైనంత త్వరలో అందజేస్తాం. అలాగే శస్త్రచికిత్సల కోసం 30 వేలకుపైగా మందిని రిఫర్ చేశాం. ప్రస్తుతానికి శస్త్రచికిత్సలు ఇంకా మొదలు కాలేదు. – డాక్టర్ గణేష్, ‘కంటివెలుగు’ జిల్లా నోడల్ ఆఫీసర్ -
రెండువేలైతే కుదరదు!
సాక్షి, హైదరాబాద్: కంటి వెలుగు కింద క్యాటరాక్ట్ ఆపరేషన్లకు ప్రభుత్వమిచ్చే సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేటు ఆస్పత్రులు గగ్గోలు పెడుతున్నాయి. ఒ క్కో క్యాటరాక్ట్ ఆపరేషన్‌కు రూ. 2వేలు ఇస్తుండటంతో గిట్టుబాటు కావడంలేద ని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీం తో పలుచోట్ల ఆపరేషన్లు ఆలస్యం అవుతున్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఏం చేయాలో అర్థంగాక అధికారులు తల పట్టుకుంటున్నారు. 11 శాతం మందికి.. ప్రభుత్వం గత నెల 15న ప్రారంభిం చిన కంటి వెలుగు కార్యక్రమంలో సోమ వారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 22.13 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 9.52 లక్షల మంది పురుషులు, 12.60 లక్షల మంది స్త్రీలున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన కంటి పరీక్షల అనంతరం 4.26 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు ఇచ్చారు. మరో 5.13 లక్షల మందికి ఇతర దృష్టిలోపం కారణంగా సంబంధిత అద్దాలివ్వాలని నిర్ణయించారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో దాదాపు 11 శాతం మందికి క్యాటరాక్ట్ అవసరమని నిర్ధారించినట్లు సమాచారం. మరో 4 శాతం మందికి ఆపరేషన్లు అవసరమని నిర్ధారించారు. పెరుగుతున్న ఆపరేషన్లు కంటి వెలుగు ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 3 లక్షల మందికే ఆపరేషన్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ పరిస్థితి చూస్తుంటే 12 లక్షల మందికి ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. దీంతో ఆపరేషన్లు చేసే ఆస్పత్రుల సంఖ్యనూ పెంచారు. ఇప్పటివరకు 70 ఆస్పత్రులకు అనుమతివ్వగా.. మరో 41 ఆస్పత్రులను గుర్తించారు. వీరి ఆపరేషన్లకు కనీసం ఏడాదిన్నర పడుతుందని వైద్యారోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీలో 25 వరకే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తుండగా కంటి వెలుగులో 60 వరకు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో కంటి ఆపరేషన్‌కు కనిష్టంగా రూ. 2 వేలు, గరిష్టంగా రూ. 35 వేల వరకు సంబంధిత ఆస్పత్రికి ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏదైనా ఆస్పత్రి అంతకు మించి వసూలు చేస్తే జాబితా నుంచి ఆస్పత్రిని తీసేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. క్యాటరాక్ట్‌వే ఎక్కువ కంటి ఆపరేషన్లలో ఎక్కువగా క్యాటరాక్ట్‌వే ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో క్యాటరాక్ట్ ఆపరేషన్ల ధర లేకపోవడంతో ఆపరేషన్‌కు రూ. 2,000లను ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇతర ఆపరేషన్లకు ఆరోగ్యశ్రీ ధరల ప్రకారం ఇస్తోంది. అయితే కేంద్రం ప్రారంభించిన ఆయుష్మాన్‌భవలో క్యాటరాక్ట్‌కు రూ. 6 వేలు ఇస్తున్నారని.. ఇక్కడ కనీసం రూ. 5,000 అయినా ఇవ్వాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి. లేదంటే మున్ముందు ఆపరేషన్లను నిలిపేసే ప్రమాదముందని కొన్ని యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. -
521 గ్రామాల్లో కంటి వెలుగు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం 521 గ్రామాల్లో పూర్తయింది. 7.16 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 3.07 లక్షల మంది పురుషులు కాగా, 4.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. అంటే పురుషుల కంటే మహిళలే లక్ష మంది అధికంగా కంటిపరీక్షలు చేయించుకోవడం గమనార్హం. మొత్తం జనాభాలో సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ఇప్పటి వరకు ఓసీలు 72 వేల మంది, బీసీలు 4.06 లక్షల మంది, ఎస్సీలు 1.41 లక్షల మంది, ఎస్టీలు 55 వేల మంది, మైనారిటీలు 40 వేల మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షలు చేయించుకున్న వారిలో 1.33 లక్షల మందికి రీడింగ్ గ్లాసులను అందజేశారు. అంతేకాకుండా చత్వారం కారణంగా ఇతర కంటి అద్దాల కోసం ప్రిస్కిప్షన్ రాయించుకున్న వారు 1.91 లక్షల మంది, కేటరాక్ట్‌కు గురైనవారు 84 వేల మంది ఉన్నారు. తదనంతర వైద్యం అవసరమైనవారు 2.22 లక్షల మంది ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. మొత్తం వచ్చినవారిలో 2.19 లక్షల మందికి ఎటువంటి కంటి సమస్య లేనట్లుగా నిర్ధారించారు. పట్టణాల్లోకంటే పల్లెల్లోనే కంటి పరీక్షలకు భారీ ఎత్తున స్పందన వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతే కాదు వచ్చేవారిలో 40 ఏళ్లు పైబడిన వారే అధికంగా ఉంటున్నారు. అలాగే పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలే కంటి వెలుగు శిబిరాల వద్ద బారులు తీరుతున్నారు. -
‘కంటివెలుగు’లో బీపీ, షుగర్ టెస్టులు
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో బీపీ, షుగర్ టెస్టులు నిర్వహించాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ వైద్యశాఖ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాల వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో కంటివెలుగు వైద్య శిబిరాల్లో కంటి పరీక్షల నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాలకు వచ్చే ప్రజలకు బీపీ, షుగర్ టెస్టులు విధిగా నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం జిల్లాలో 40మంది ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ ఇవ్వాలని, ఈ హెల్త్ క్యూబ్ డివైజ్‌లను సెప్టెంబర్ 1న ప్రారంభించాలని ఆదేశించారు. రక్తపరీక్షలు చేస్తామంటే ప్రజలు వైద్య శిబిరాలకు తప్పనిసరిగా వస్తారని, క్యాంపుల నిర్వహణ, ప్రణాళికలపై వైద్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబందించిన సాఫ్ట్వేర్ సిద్ధంగా ఉందాలేదా అని అడిగి తెలుసుకున్నారు. రెండు రిజిస్టర్లు నిర్వహించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. హెల్త్ క్యూబ్‌కు సంబందించిన మెటీరియల్, బ్యానర్లు, సాఫ్ట్వేర్ శిక్షణ పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మహబూబ్‌నగర్ ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ధనుంజయ, ఎన్సీడీ కోఆర్డినేటర్ జగన్నాథరెడ్డి, హర్షవర్ధన్, డాక్టర్ రాజేందర్, డీపీఎం సయ్యద్, గద్వాల పీఓ, సూపరింటెండెంట్లు, సంబందిత అధికారులు పాల్గొన్నారు. -
‘కంటి వెలుగు’కు విశేష స్పందన
సాక్షి, హైదరాబాద్: అంధత్వ నివారణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటివెలుగు’కార్యక్రమానికి మూడో రోజూ విశేష స్పందన లభించింది. శుక్రవారం సెలవు కావటంతో వైద్య శిబిరాల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఒక్క శుక్రవారమే రికార్డు స్థాయిలో 1,07,361 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో మహిళలు 61 వేలు, పురుషులు 46 వేల మంది ఉన్నారు. ప్రజలు భారీగా తరలివస్తుండటం తో రాత్రి ఏడుగంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించారు. శిబిరాలు నిర్వహించే ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రతి ఇంటికీ టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. టోకెన్లలో సూచించిన సమయానికి రావటం వల్ల వేచిచూసే అవసరముండదని ప్రచారం చేస్తు న్నారు. ప్రభుత్వం ‘కంటి వెలుగు’కార్యక్రమాన్ని ఈ నెల 15న ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి రెండు రోజుల్లో 1.13 లక్షల మంది కంటి పరీక్షలు చేయించుకోగా..మూడు రోజులకు కలిపి 2.19 లక్షల మంది చేయించుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తు న్నామని వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు జి.శ్రీనివాస్ వెల్లడించారు. -
వైద్యాధికారి మంజులపై కలెక్టర్ ఆగ్రహం
మంగపేట జయశంకర్ జిల్లా : కలెక్టర్ అమయ్‌కుమార్ గురువారం మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు క్యాంప్‌ను మధ్యాహ్నం 12 గంటలకు తనిఖీ చేశారు. టీమ్ మెడికల్ ఆఫీసర్ మంజుల విధులకు హాజరుకాక పోవడంతో ఆమె ఎక్కడున్నారో తెలుసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించగా ఆయన మెడికల్ ఆఫీసర్‌కు ఫోన్‌కలిపి ఇచ్చారు. ‘క్యాంప్‌కు ఎందు కు హాజరు కాలేదు.. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమ నిర్వాహణపై ఇంత నిర్లక్షమా.. అంటూ కలెక్టర్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మార్గమధ్యలో గోవిందరావుపేటలో ఉన్నా ని మంజుల చెప్పగా.. గంటసేపల్లో విధులకు హాజరు కావాలి.. లేదంటే టర్మినేట్ చేస్తానని.. తీవ్ర స్థాయిలో మందలించారు. క్యాంప్ వద్ద 10 మంది వరకు మాత్రమే ఉండటంతో రోజువారీ టార్గెట్ ఎంత, ఇప్పటివరకు ఎంత మందికి పరీక్షలు నిర్వహించారని కలెక్టర్ సిబ్బందిని ప్రశ్నిం చారు. రోజుకు 250 మది టార్గెట్ కాగా బుధవారం 28 మంది, గురువారం 17 మందికి పరీక్షలు నిర్వహించామని చెప్పగా ఇదేమిటని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగపేట పీహెచ్సీ వైద్యాధికారి మృదులను పిలిపించి కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించి ప్రతి రోజు టార్గెట్ పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. అంతకు ముం దు అకినేపల్లిమల్లారం పాఠశాలను సందర్శించడానికి వెళ్లిన క్రమంలో కలెక్టర్ కారు బురదలో దిగబడడంతో కొంతదూరం కాలినడకన వెళ్లారు. -
‘కంటి వెలుగు’గిన్నీస్ రికార్డు సృష్టిస్తుంది
హన్మకొండ అర్బన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘కంటివెలుగు’ కార్యక్రమాన్ని బుధవారం పట్టణంలోని రెడ్‌క్రాస్ ఆవరణలో కడియం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 3.50కోట్ల మందికి కంటిపరీక్షలు చేసి అవసరమైన అద్దాలు, మందులు అందించే ‘కంటివెలుగు’ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటిపరీక్షలు చేసేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికోసం బ్యాంకులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.50వేలు ఆర్థిక సాయం చేస్తోందని.. ఈ పథకం ద్వారా ఈ రోజు జిల్లాలో 50మంది యువతకు చెక్కులు అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కంటి సమస్యలు అంధత్వంగా మారకూడదనే ఉద్దేశంతో ‘కంటివెలుగు’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. నగర మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా నగరంలో 13క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు కంటి పరీక్షలు చేయించడం జరగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి కాట మాట్లాడుతూ జిల్లాలో ‘కంటి వెలుగు’ను సమర్ధవంతంగా అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, మహిళా సంఘాల సహకారం తీసుకుంటున్నామని, మొత్తం 500మంది సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపారు. పరీక్షల అనంతరం అందించేందుకు 1.26లక్షల కళ్ల అద్దాలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. శస్త్ర చికిత్సలు అవసరం ఉన్నవారికి నగరంలో ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో నిర్ణీత తేదీల్లో చేస్తారని తెలిపారు. ప్రతి సోమవారం పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సమాచారం అధికారికంగా విడుదల చేస్తామన్నారు. నగరంలో రోజుకు 300మందికి, గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 250మందికి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్, జెడ్పీ ఛైర్పర్సన్ గద్దల పద్మ, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు రుణ విముక్త కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ హరీష్‌రాజ్, ఎంపీలు బండాప్రకాష్, పసునూరి దయాకర్, కార్పొరేటర్ కేశబోయిన అరుణ, ఐఎంఏ ఛైర్మన్ డాక్టర్ సుదీప్, రెడ్‌క్రాస్ ఛైర్మన్ విజయ్‌చందర్‌రెడ్డి, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
‘కంటి వెలుగు’కు 1,59,851 జోళ్లు సిద్ధం
ఖమ్మం, వైద్యవిభాగం : ప్రభుత్వం ప్రతిష్ణాత్మకంగా ప్రారంభిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎ.కొండల్రావు తెలిపారు. ఆయన మంగళవారం తన చాంబర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు బ్యాంక్ కాలనీలో, ప్రకాశ్‌నగర్‌లోని రాజేంద్రనగర్ పాఠశాలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని చెప్పారు. ‘కంటి వెలుగు’ కోసం 36 బృందాలను సిద్ధం చేశామన్నారు. 25 బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో, ఏడు బృందాలు ఖమ్మం నగరంలో పరీక్షలు నిర్వహిస్తాయని, మరో నాలుగు అదనపు బృందాలను అందుబాటులో ఉంచనున్నట్టు వివరించారు. ప్రతి రోజు ఒక్కో బృందం గ్రామీణ ప్రాంతాల్లో 250 మందిని, పట్టణ ప్రాంతాల్లో 300 మందిని పరీక్షిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు 1,59,851 కళ్లద్దాలు వచ్చాయన్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పరీక్షించిన తర్వాత మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో నిపుణులు పరీక్షించి అవసరమైన వారికి మందులు, ఐ డ్రాప్స్, కళ్ళద్దాలు ఇస్తారని చెప్పారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో, మమత ఆసుపత్రి, అఖిల కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు కూడా నిర్వహిస్తారని చెప్పారు. తప్పదనుకుంటే హైదరాబాద్ ఆస్పత్రికి పంపిస్తారని చెప్పారు. జిల్లాలో ఈ కార్యక్రమం ఆరు నెలలపాటు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమ విజయవంతానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు రావాలని కోరారు. మాట్లాడుతున్న డాక్టర్ కొండల్రావు -
125 మందికి నేత్ర వైద్య పరీక్షలు
బరంపురం : స్థానిక హనుమాన్ బజార్ మెయిన్ రోడ్డులోని మానస్ భవన్లో హింజిలికాట్, సమరజోలొ శంకర్ ఐ ఆస్పత్రి, లయన్స్ క్లబ్ గెలక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బరంపురం అదనపు తహసీల్దార్ సుశాంత్ కుమార్ సాహు పాల్గొని ప్రారంభించారు. శంకర్ ఐ ఆస్పత్రికి చెందిన నేత్ర వైద్యులు 125 మంది రోగులకు నేత్ర వైద్య పరీక్షలు చేశారు. ఇందులో 25 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. వీరిని అవసరమైతే శంకర్ ఫౌండేషన్ ఐ ఆస్పత్రికి తరలించనున్నట్టు లయన్స్ క్లబ్ గెలక్స్ ప్రాజెక్టు చైర్మన్ పి.ధర్మారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు పి.కె.పండా, లక్ష్మీనారాయణ, రజని పాత్రో, స్వాయ్యక్ సాహు, సరస్వతి పాత్రో, రజని మహాపాత్రో, ఉషారాణి పాఢి, సభి పాత్రో తదితరులు పాల్గొన్నారు. -
‘కంటి వెలుగు’ షెడ్యూల్.. నమోదు చేయాలి
కరీంనగర్‌సిటీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15 నుంచి అమలు చేసే కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించి గ్రామాల వారీగా మెడికల్ టీమ్‌లు పర్యటించే షెడ్యూల్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కె జోషి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో కంటి వెలుగు, సాధారణ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు, హరితహారంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించేలా సంబంధిత మంత్రులు ప్రజాప్రతినిధులతో ఆగస్టు మొదటివారంలో సమావేశం నిర్వహించాలని సూచించారు. ఆగస్టు 15న ప్రారంభమయ్యే గ్రామాలను ముందుగానే నిర్ణయించి మెడికల్ టీంలను పంపించాలని సూచించారు. అన్ని గ్రామాలలో కంటి వెలుగు కార్యక్రమం కవర్ అయ్యేలా చూడాలన్నారు. ప్రతీ మెడికల్ టీంలో మెడికల్ ఆఫీసర్, ఆప్టిమెర్రిక్ తప్పనిసరిగా ఉండాలన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరినీ పరీక్ష చేసేలా చూడాలన్నారు. ప్రజలకు ఉత్తమ కంటి వైద్య సేవలనందించాలన్నారు. అన్ని జిల్లాలకు తగినన్ని కళ్లజోడ్లను పంపించామని, రాష్ట్ర వ్యాప్తంగా 113 ఆసుపత్రులను గుర్తించామని, కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. ఆకుపచ్చ తెలంగాణకు పునరంకితమవ్వాలి.. నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని బుధవారం ముఖ్యమంత్రి గజ్వేల్‌లో ప్రారంభిస్తారని తెలిపారు. హరితహారంలో అందరూ భాగస్వాములై మొక్కలు నాటి ఆకుపచ్చ తెలంగాణ సాధనకు పునరంకితం కావాలన్నారు. రాష్ట్రంలో వర్షాల ఆరంభం నుంచి హరితహారం కొనసాగుతుందని, నాటిన మొక్కల రక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. నాటిన మొక్కలన్నింటికీ జియో ట్యాగింగ్ చేయాలన్నారు. జియోట్యాగింగ్ చేసిన వాటికే ఉపాధిహామీ నిధుల విడుదల ఉంటుందని తెలిపారు.మొక్కలు నాటే విధానం, సంరక్షించే పద్ధతులపై అటవీ, విద్యాశాఖలతో అవగాహన శిబిరాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామం, ప్రతీ పాఠశాలకు స్వచ్ఛ పాఠశాల, హరిత పాఠశాల నినాదం చేరేలా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ స్టేష న్ల హేతుబద్ధీకరణ త్వరగా పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితా రూపకల్పన, పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు, హేతుబద్ధీకరణ బోగస్ ఓటర్ల తొలగింపు, చనిపోయిన ఓటర్ల తొలగింపు, నూతన ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై కలెక్టర్లు దృష్టి సారిం చాలన్నారు. దివ్యాంగుల కోసం పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక సౌకర్యాల ఏర్పాటుతో పాటు వారిని ఓటర్లుగా నమోదు చేయడానికి ప్రత్యేక కృషి చేయాలన్నారు. ఓటర్లను చైతన్యం చేసే కార్యక్రమాలు నిర్వహించాలని, సమస్యలపై ప్రత్యేక దృ ష్టి సారించాలన్నారు. ఈవీఎంలు నిల్వ చేయడానికి అవసరమైన గోడౌన్లను సిద్ధం చేసుకోవాల ని సూచించారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోలుగా అధికారులను నియమించాలన్నారు. వీసీలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్వో అయేషా మస్రత్‌ఖానమ్, అంధత్వ నివారణ అధికారి రత్నమాల, డీఆర్డీవో వెంకటేశ్వర్రావు తదితరులున్నారు. -
40 లక్షల మందికి కళ్లద్దాలు
సాక్షి, హైదరాబాద్: ‘కంటి వెలుగు’కింద రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొత్తం 3.5 కోట్ల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించనుంది. అందులో 40 లక్షల మందికి కళ్లద్దాలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు కళ్లద్దాలను ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ‘ఎస్సల్లార్’ సరఫరా చేయనుంది. జిల్లాలకు ఇప్పటికే 32 లక్షల కళ్లద్దాలు.. ఇప్పటికే 32 లక్షల కళ్లద్దాలు జిల్లాలకు సరఫరా అయ్యాయి. మొత్తంగా 36 లక్షల కళ్లద్దాలు, రీడింగ్ గ్లాసులు సరఫరా చేస్తారు. వాటిని అక్కడికక్కడే తక్షణమే అందజేస్తారు. ఇతరత్రా లోపంతో బాధపడుతున్న వారికి ప్రిస్కిప్షన్ ఇస్తే సంబంధిత కంపెనీ మూడు, నాలుగు వారాల్లో సరఫరా చేయనుంది. ఒక్కో కళ్లజోడు ఖరీదు రూ.100 కాగా, ఆ ప్రకారం ఎస్సల్లార్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. మొత్తం పరీక్షలు చేశాక దాదాపు 3 లక్షల మందికి శస్త్రచికిత్సలు అవసరం అవుతాయని సర్కారు అంచనా వేసింది. వారందరికీ ప్రభుత్వం ఉచిత శస్త్రచికిత్సలు చేయనుంది. ఇందుకోసం 114 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను, స్వచ్ఛంద సంస్థలను గుర్తించారు. మొత్తం కార్యక్రమాన్ని కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ద్వారా అమలు చేస్తారు. 150 శాశ్వత విజన్ సెంటర్లు రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కళ్లద్దాలు ఉచితంగా ఇవ్వడం, ఉచిత శస్త్రచికిత్సలు చేయడం, ఉచిత మందులు సరఫరా చేయడం ఇందులో కీలకమైనవి. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 106 కోట్ల రూపాయలు కేటాయించింది. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి యూనిట్‌గా కంటి పరీక్షలు జరుగుతాయి. మొత్తం 799 బృందాలను ఏర్పాటు చేశారు. అందులో 940 మంది మెడికల్ ఆఫీసర్లు, వెయ్యి మంది కంటి వైద్య నిపుణులు ఉంటారు. వారికి సాయంగా ఎనిమిది వేల మంది సిబ్బంది ఉంటారు. వారంతా శిక్షణ పొందినవారే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆరు నెలలపాటు అమలుచేస్తారు. భవిష్యత్తులో కంటి సమస్యతో బాధపడే వారికోసం 150 విజన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. వాటిలో బాధితులకు నిరంతరం కంటి వైద్యం అందుబాటులో ఉంచుతారు. ఇక ఆర్బీఎస్కే కార్యక్రమం ద్వారా బడి పిల్లలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తారు. కాగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తుంటే.. వైద్య ఆరోగ్య శాఖ మాత్రం విస్త్రృత ప్రచారం కల్పించడంలో విఫలమైందన్న విమర్శలు వినవస్తున్నాయి. -
ఇంటింటికీ కంటి వెలుగు
సాక్షి, వికారాబాద్ : సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఏ ప్రాణికైనా అన్ని అవయవాల్లోకెల్లా అతి ముఖ్యమైనవి కళ్లు. ఇవి ఉంటేనే విశ్వంలో దేన్నయినా చూడగలం. ముఖ్యంగా మానవునికి చూపు బాగుంటేనే ఏ పనినైనా సక్రమంగా నిర్వర్తించగలడు. పాశ్చాత్య, అభివృద్ధి చెందిన దేశాల్లో వైద్యం, బీమాకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాదాపు 30శాతం మంది మూడు పూటలా తిండికి కరువై.. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే చెబుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పౌష్టికాహారం అందకపోవడంతో నేత్ర సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించింది. ఈ రోజుల్లో కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు ఖరీదైపోయాయి. ఆర్థిక స్థోమత అంతంతమాత్రంగానే ఉన్నవారు కంటి పరీక్షలు చేయించుకోలేక పోతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. చక్కని చూపు కోసం ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ఈ ప్రక్రియ మొదలు పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. వాస్తవానికి ఈ శిబిరాలు ఏప్రిల్ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ రైతుబంధు పథకం అమలులో అధికారులు బిజీగా ఉన్న కారణంగా వచ్చేనెల నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే చెక్కుల పంపిణీ, పాసుపుస్తకాల పంపిణీ కోసం వచ్చే 20 వరకు గడువు పొడిగించడంతో.. ఈ కార్యక్రమం నిర్దేశిత సమయానికి ప్రారంభమవుతుందా.. లేదా అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు. నిత్యం 25 గ్రామాల్లో పరీక్షలు... జిల్లాలో 367 గ్రామపంచాయతీలు, 501 రెవెన్యూ గ్రామాలున్నాయి. మొత్తం జనాభా 9,67,356 మంది. తాండూరులోని జిల్లా ఆస్పత్రితో పాటు వికారాబాద్, పరిగి, కొడంగల్‌లో నియోజకవర్గ స్థాయి దవాఖానాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. జిల్లాలో నిత్యం 25 గ్రామాల్లో కంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో బృందం ఒక్కో గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేసి అవసరమైనవారికి అక్కడే ఉచితంగా కంటి అద్దాలు అందజేయనున్నారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సల కోసం నగరంలోని సరోజినీదేవి, ఎల్వీ.ప్రసాద్ తదితర ప్రముఖ కంటి వైద్యాలయాలకు రిఫర్ చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. శుక్లం, మెల్ల కన్ను, కార్నియా అంధత్వం, రెటినోపతి, డయాబెటిక్, దృష్టిలోపాలు, రిఫ్రాక్టివ్ దోషం, టెరిజియమ్ తదితర సమస్యలను గుర్తించి చికిత్స చేయనున్నారు. దృష్టిలోపం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహా రం ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. సమాచారం లేదు ఊరూరా కంటి పరీక్షల కో సం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటుచేసే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం, ఆదేశాలు అందలేదు. కార్యక్రమం ఉంటుంది కానీ.. ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదు. రైతు బంధు, రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా అన్ని శాఖల అధికారులు బిజీబిజీగా ఉన్నా రు. ఈ కారణంగా నేత్ర శిబిరాలపై స్పష్టత లేదు. – దశరథ్, జిల్లా వైద్యాధికారి -
రాష్ట్రానికి కొత్త ‘చూపు’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కంటిచూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారిని గుర్తించి, తగిన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ కంటి వెలుగు’ పేరిట బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కంటిచూపు సమస్యలు లేని రాష్ట్రమే లక్ష్యంగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ పరీక్షలతో దృష్టి లోపాలను, అందుకు కారణాలను గుర్తించడంతోపాటు.. ఉచితంగా కళ్లద్దాలను, వైద్యసేవలను, మందులను అందించేం దుకు ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైన వారికి శస్త్రచికిత్సలను చేయించేలా చర్యలు చేపడుతోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించే ‘రైతు బంధు’ చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తికాగానే.. ఈ నెలాఖరులోనే ‘తెలంగాణ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని మొదలుపెట్టనుంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లన్నీ సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను ఆదేశించింది. కార్యక్రమం అమలు కోసం రూ.106 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు కార్యక్రమం మార్గదర్శకాలను విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాలు, వార్డుల్లో క్యాంపులు.. ‘తెలంగాణ కంటి వెలుగు’పేరుతో సమగ్ర సర్వే తరహాలో కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీలో.. నగర, పట్టణ ప్రాంతాల్లోని వార్డులలో వైద్య పరీక్షల కోసం క్యాంపులు నిర్వహిస్తారు. ప్రతి క్యాంపులో నిర్వహించిన వైద్య పరీక్షల సమగ్ర సమాచారాన్ని పూర్తిగా కంప్యూటరీకరణ చేస్తారు. తదుపరి స్థాయి వైద్యపరీక్షల కోసం, చికిత్స అందించేందుకు తోడ్పడేలా ఈ సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. కళ్లద్దాలు.. శస్త్రచికిత్సలు.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని రకాల దృష్టి లోపాలను గుర్తించేలా చర్యలు చేపడతారు. క్యాటరాక్ట్, గ్లకోమా, కార్నియా సమస్యలు, డయాబెటిక్ రెటినోపతి, విటమిన్ ‘ఏ’లోపం, ఇతర సాధారణ ఇన్ఫెక్షన్లు వంటి వాటిని నిర్ధారిస్తారు. చూపుపరమైన సమస్యలున్న అందరికీ వైద్యసేవలు అందేలా చర్యలు చేపడతారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తారు. క్యాటరాక్ట్, గ్లకోమా, రెటినోపతి, కార్నియా లోపాలు తదితర సమస్యలున్న వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. పది మందితో బృందాలు.. మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలో పది మందితో కూడిన బృందం కంటి పరీక్షల క్యాంపును నిర్వహిస్తుంది. ఇందులో ఒక మెడికల్ ఆఫీసర్‌తోపాటు ముగ్గురు మల్టీపర్పర్ హెల్త్ సూపర్వైజర్లు (మహిళా/పురుషులు), కంటి వైద్య సహాయకుడు, ఫార్మాసిస్టు, ముగ్గరు ఆశ వర్కర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. ప్రతి వైద్య బృందానికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలను, యంత్రాలను, మందులను వైద్యారోగ్య శాఖ సమకూరుస్తుంది. రూ.106.83 కోట్లు మంజూరు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ‘తెలంగాణ కంటి వెలుగు’కార్యక్రమం అమలవుతుంది. ఈ శాఖ ప్రతిపాదనల ప్రకారం కార్యక్రమానికి అవసరమైన రూ.106.83 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో రూ.84.01 కోట్లను రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి, రూ.42 కోట్లను జాతీయ ఆరోగ్య మిషన్ నిధుల నుంచి కేటాయించింది. మొత్తం మంజూరైన నిధుల్లో తొలి విడతగా రూ.42 కోట్లను విడుదల చేసింది. ‘కంటి వెలుగు’పథకం అంచనాలివీ.. కంటి పరీక్షలు నిర్వహించే జనాభా: 3.5 కోట్లు అవసరమయ్యే కళ్లద్దాలు: 41,05,808 ప్రాథమిక వైద్యసేవలు అవసరమయ్యేవారు: 77,768 రెండో దశ వైద్యసేవలు అవసరమయ్యేవారు: 3,31,178 ఆస్పత్రిలో వైద్యసేవలు అవసరమయ్యేవారు: 14,283