ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కంటిచూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారిని గుర్తించి, తగిన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ కంటి వెలుగు’ పేరిట బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కంటిచూపు సమస్యలు లేని రాష్ట్రమే లక్ష్యంగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ పరీక్షలతో దృష్టి లోపాలను, అందుకు కారణాలను గుర్తించడంతోపాటు.. ఉచితంగా కళ్లద్దాలను, వైద్యసేవలను, మందులను అందించేం దుకు ఏర్పాట్లు చేస్తోంది.
అవసరమైన వారికి శస్త్రచికిత్సలను చేయించేలా చర్యలు చేపడుతోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించే ‘రైతు బంధు’ చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తికాగానే.. ఈ నెలాఖరులోనే ‘తెలంగాణ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని మొదలుపెట్టనుంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లన్నీ సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను ఆదేశించింది. కార్యక్రమం అమలు కోసం రూ.106 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు కార్యక్రమం మార్గదర్శకాలను విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రామాలు, వార్డుల్లో క్యాంపులు..
‘తెలంగాణ కంటి వెలుగు’పేరుతో సమగ్ర సర్వే తరహాలో కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీలో.. నగర, పట్టణ ప్రాంతాల్లోని వార్డులలో వైద్య పరీక్షల కోసం క్యాంపులు నిర్వహిస్తారు. ప్రతి క్యాంపులో నిర్వహించిన వైద్య పరీక్షల సమగ్ర సమాచారాన్ని పూర్తిగా కంప్యూటరీకరణ చేస్తారు. తదుపరి స్థాయి వైద్యపరీక్షల కోసం, చికిత్స అందించేందుకు తోడ్పడేలా ఈ సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.
కళ్లద్దాలు.. శస్త్రచికిత్సలు..
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని రకాల దృష్టి లోపాలను గుర్తించేలా చర్యలు చేపడతారు. క్యాటరాక్ట్, గ్లకోమా, కార్నియా సమస్యలు, డయాబెటిక్ రెటినోపతి, విటమిన్ ‘ఏ’లోపం, ఇతర సాధారణ ఇన్ఫెక్షన్లు వంటి వాటిని నిర్ధారిస్తారు. చూపుపరమైన సమస్యలున్న అందరికీ వైద్యసేవలు అందేలా చర్యలు చేపడతారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తారు. క్యాటరాక్ట్, గ్లకోమా, రెటినోపతి, కార్నియా లోపాలు తదితర సమస్యలున్న వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు.
పది మందితో బృందాలు..
మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలో పది మందితో కూడిన బృందం కంటి పరీక్షల క్యాంపును నిర్వహిస్తుంది. ఇందులో ఒక మెడికల్ ఆఫీసర్‌తోపాటు ముగ్గురు మల్టీపర్పర్ హెల్త్ సూపర్‌వైజర్లు (మహిళా/పురుషులు), కంటి వైద్య సహాయకుడు, ఫార్మాసిస్టు, ముగ్గరు ఆశ వర్కర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. ప్రతి వైద్య బృందానికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలను, యంత్రాలను, మందులను వైద్యారోగ్య శాఖ సమకూరుస్తుంది.
రూ.106.83 కోట్లు మంజూరు
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ‘తెలంగాణ కంటి వెలుగు’కార్యక్రమం అమలవుతుంది. ఈ శాఖ ప్రతిపాదనల ప్రకారం కార్యక్రమానికి అవసరమైన రూ.106.83 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో రూ.84.01 కోట్లను రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి, రూ.42 కోట్లను జాతీయ ఆరోగ్య మిషన్ నిధుల నుంచి కేటాయించింది. మొత్తం మంజూరైన నిధుల్లో తొలి విడతగా రూ.42 కోట్లను విడుదల చేసింది.
‘కంటి వెలుగు’పథకం అంచనాలివీ..
కంటి పరీక్షలు నిర్వహించే జనాభా: 3.5 కోట్లు
అవసరమయ్యే కళ్లద్దాలు: 41,05,808
ప్రాథమిక వైద్యసేవలు అవసరమయ్యేవారు: 77,768
రెండో దశ వైద్యసేవలు అవసరమయ్యేవారు: 3,31,178
ఆస్పత్రిలో వైద్యసేవలు అవసరమయ్యేవారు: 14,283
Comments
Please login to add a commentAdd a comment