నేత్ర వైద్య శిబిరం విజయవంతం
మేదరమెట్ల: మండలంలోని మేదరమెట్లకు చెందిన యర్రం చినపోలిరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక యర్రం చినపోలిరెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. వైద్యశిబిరంలో 221 మంది కంటి పరీక్షలు చేయించుకోగా వారిలో 150 మందిని ఆపరేషన్‌లకు సిఫార్సు చేశారు. ఆపరేషన్లు చేసేందుకు పెదకాకాని శంకర కంటి ఆసుపత్రి సిబ్బంది ఆదివారం రోగులను తమ వాహనాల్లో తీసుకెళ్తారని నిర్వాహకులు తెలిపారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఆవరణలోని యర్రం చినపోలిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వైద్యశాల ఆవరణలో మొక్కలు నాటారు. తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ఈ వైద్యశాలకు ఎలాంటి సౌకర్యాలు అవసరమైనా తన దృష్టికి తీసుకురావాలని వైద్యులకు సూచించారు.
గత జన్మభూమి కార్యక్రమం సందర్భంగా కంటి పరీక్షలు చేసిన 150 మందికి కళ్లజోళ్లు ఇవ్వలేదని, వారికి కళ్లజోళ్లు ఇచ్చేందుకు దాతల కోసం ఎదురుచూస్తున్నామని తెలపడంతో వాటిని తన సొంత ఖర్చుతో అందజేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఆస్పత్రికి కావలసిన సౌకర్యాలను తాను సంబంధిత మంత్రితో మాట్లాడి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త బాచిన చెంచుగరటయ్య మాట్లాడుతూ చినపోలిరెడ్డి ఎంతో మంది రైతులకు ఆదర్శవంతంగా ఉండేవారని, గ్రామాభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడిన వ్యక్తి అని కొనియాడారు. వైవీ భద్రారెడ్డి మాట్లాడుతూ తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన వైద్యశాల ఉన్నతికి తమ వంతు ఆర్థిక సాయాన్ని అందించడంలో ఎప్పుడూ ముందుంటామన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు కేవీ.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, జువ్వి రాము, జజ్జర ఆనందరావు, తాళ్లూరు జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి, వంపుగుడి శ్రీనివాసరావు, పేరం నాగలక్ష్మీ, రామిరెడ్డి ఆదిరెడ్డి, ఎస్.రమణమ్మ, డాక్టర్ అవినాష్, డాక్టర్ జే.ఉమ, రవికాంత్, నాగలక్ష్మి, కాలీషా, రామకోటేశ్వరరావు, అద్దంకి బధిరుల పాఠశాల సిబ్బంది, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.