health camp
-
ఉచితంగా పరీక్షలు, వైద్యం, మందులు
-
వార్షిక వేడుకల్లో మాటా హెల్త్ క్యాంప్ ఏర్పాటు
-
ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్న వైదులు
-
అందరికీ ఆరోగ్య పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితా రాణా ఉత్తర్వులు జారీచేశారు. కుషు్ట, టీబీ, పాలియేటివ్ కేర్, మానసిక వైద్యం, అసంక్రమిత వ్యాధులు సహా మొత్తం 13 రకాల వ్యాధులను గుర్తించి వాటిని నయం చేయాలన్నదే ఈ పథకం ఉద్దేశమని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 30 వరకు గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ ప్రక్రియ చేపడతారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బృందాలుగా ఏర్పడతారు. డ్వాక్రా, స్వయం సహాయక గ్రూపులు, అంగన్వాడీ సభ్యుల సహకారం తీసుకుంటారు. గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో స్క్రీనింగ్ చేసి సంబంధిత నివేదికను రోజూ జిల్లా కార్యాలయానికి పంపించాలి. అదే నివేదికను విలేజ్ హెల్త్ సరీ్వస్ యాప్‌లో నమోదు చేయాలని యోగితా రాణా కోరారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్థాయి సామాజిక ఆరోగ్య కార్యకర్తలు గ్రామంలో ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు ఇంటింటికీ తిరిగి ప్రజలను స్క్రీనింగ్ చేస్తారు. రోజూ 20 ఇళ్ల చొప్పున స్క్రీనింగ్ చేయాలి. ఇద్దరు చొప్పున ఒక టీమ్‌గా ఏర్పడి పని చేయాల్సి ఉంటుంది. దాదాపు కోటి కుటుంబాలను ఈ సందర్భంగా కలిసే అవకాశముంది. యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రాం అని పేర్కొంటున్నా.. ఈ కార్యక్రమంలో సమగ్ర ఆరోగ్య సర్వే చేపడుతున్నట్లు కనిపించట్లేదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఇవీ మార్గదర్శకాలు.. హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఇంటికి సంబంధించి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి. ఇది మున్ముందు గ్రామాల వారీగా ఆరోగ్య రికార్డు తయారు చేయడానికి వీలవుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగే పరీక్షలకు ఓ మెడికల్ ఆఫీసర్ నేతృత్వం వహిస్తారు. సబ్ సెంటర్‌కు ఏఎన్ఎం పర్యవేక్షణగా ఉంటారు. ఉదయం 6.30 నుంచి 9.30 వరకు స్క్రీనింగ్ ప్రక్రియ ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో ఎవరైనా లేకుంటే సాయంత్రం వెళ్లాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులకు ఉన్న వ్యాధులు, అనుమానిత రోగాలను గుర్తించి నమోదు చేయాలి. వాటిని అదే రోజు జిల్లా వైద్యాధికారికి పంపాలి. టీబీ కేసులు ఏవైనా ఉంటే నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేయాలి. ఏదైనా వ్యాధి ఉన్నట్లు అనుమానిస్తే ప్రొటోకాల్ ప్రకారం సంబంధిత పరీక్షలను వారం రోజుల్లో చేయించాలి. ఏదైనా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ జరిగితే ప్రొటోకాల్ ప్రకారం వైద్యం చేయాలి. వైద్యం చేయించే తేదీ కూడా నమోదు చేయాలి. రోజువారీ స్క్రీనింగ్ వివరాలను గ్రామ ఆరోగ్య రికార్డులో ఏఎన్ఎంలు నమోదు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే అందరికీ ఆరోగ్య స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం ఈ నెల 17న ఉంటుంది. జిల్లాల్లో 20 నుంచి 22 వరకు వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు. కార్యక్రమానికి సంబంధించి వివరాలను ఈ నెల 24, 25 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రకటిస్తారు. -
చికాగోలో 'హెల్త్ ఫెయిర్' విజయవంతం
చికాగొ : గ్రేటర్ చికాగోలోని శ్రీ బాలాజీ టెంపుల్లో ఆగస్టు 3న పబ్లిక్ కమ్యూనిటీ హెల్త్ ఫెయిర్‌ను నిర్వహించారు. ఈ హెల్త్ ఫెయిర్ కార్యక్రమానికి డాక్టర్ వసంతనాయుడు, డాక్టర్ రాధికా పతి అధ్యక్షత వహించారు. హెల్త్ ఫెయిర్‌లో భాగంగా గుడికి వచ్చిన భక్తులకు, చుట్టుపక్కల నివసించే వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 400 మందికి పైగా హాజరైన ఈ హెల్త్ ఫెయిర్‌లో రక్తపోటు, ఇతర వైద్య పరీక్షలను నిర్వహించారు.ఈ హెల్త్ ఫెయిర్‌కు చికాగో ఆంధ్ర అసోసియేషన్, చికాగో తమిళ సంఘం, చికాగో తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో, శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమ్ ట్రస్ట్ స్పాన్సర్స్‌గా వ్యవహరించారు. పరీక్షలను నిర్వహించడానికి కావలసిన ల్యాబ్ వసతులను యునిల్యాబ్కి చెందిన శివరాజన్ అందజేశారు. మొత్తం 20మందికి పైగా వైద్య నిపుణులు ఉచిత హెల్త్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొని పరీక్షలు నిర్వహించారు. హెల్త్ ఫెయిర్‌లో పాల్గొన్న వైద్య నిపుణులు వరుసగా.. శోభ చొక్కలింగం(కార్డియాజిస్ట్), సురేఖ సాకల, శాంతి యెన్న(డెంటల్), మల్లిక రాజేంద్రన్ (గైనకాలజిస్ట్), గిరిజా కుమార్, రామరాజు యేలవర్తి(ఇంటర్నల్ మెడిసిన్), రమేశ్ కోలా (హెమటాలజిస్ట్), వసంతనాయుడు, కాంచన రాజశేఖర్, తనూజ కొత్తింటి, ఉషా అప్పలనేని (పిడియాట్రిషియన్స్), వైదేహి సలాడి (ఫిజియో థెరపిస్ట్), శ్రీ గురుస్వామి (సోషల్ వర్కర్), శ్రీ శక్తి రామనాథన్( డైటిషీయన్), మధ్వాని పట్వర్ధన్ (క్లినికల్ సైకాలజిస్ట్), భార్గవి నెట్టెమ్, కృష్ణ బత్తిన (ఫ్యామిలి నిపుణులు), కృతిబెన్ అగేరా(యోగా), సంజీవని ( మానసిక రుగ్మతల నిపుణురాలు) ఉన్నారు. వీరు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఫెయిర్‌లో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించి సలహాలు ఇచ్చారు. ఇక కార్యక్రమం చివర్లో రాధిక పతి మాట్లాడుతూ.. ఈ హెల్త్ ఫెయిర్‌ను విజయవంతం చేసినందుకు టెంపుల్ నిర్వాహకులను, పరీక్షలు నిర్వహించిన వివిధ వైద్య నిపుణులను, స్పాన్సర్లను, వాలంటీర్లను అభినందించారు. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడానికి కారణమైన బాలాజీ టెంపుల్‌కు చెందిన మేనేజర్లు రమేశ చిత్తూరి, సత్య కుమారి, నిర్వాహకులు డా. ఎన్ఎస్ రావు, విజయలక్ష్మీరావు, వరదీశ్ చిన్నికృష్ణన్, అను అగ్నిహోత్రి, గణేశ్ సోలయిలకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆరోగ్యానికి బాల సురక్ష
ఏలూరు టౌన్ : చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. చిన్నతనం కావటంతో శారీరకంగా ఏర్పడే చిన్నపాటి లోపాలను ఎవరితోనూ చెప్పుకోలేని పరిస్థితి. ఇంట్లో తల్లీదండ్రీ ఈ లోపాలను గుర్తించలేకపోవటం, మానసికంగా పిల్లల ను నలిపేస్తుంది. ఈ సమస్యలతో పిల్లలు అసాధారణంగా ప్రవర్తిస్తుంటారు. ఇక హైస్కూల్, ఇం టర్ స్థాయి చదివే విద్యార్థుల్లోనూ శారీరక లోపాలు, అనారోగ్యం బాధిస్తూ చదువుపై శ్రద్ధ చూ పించకపోవడానికి కారణాలవుతున్నాయి. వీటి నివారణకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వచ్ఛ కార్యక్రమం (ఆర్బీఎస్కే) అమలుచేస్తోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాల సురక్ష పథకంగా అమలుచేస్తూ పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పథకంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాకు ఈ పథకం కింద 30 బాల సురక్ష వాహనాలు ఏర్పాటుచేశారు. ఒక్కో వాహనంలో ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులు ఉంటారు. ఈ వాహనాలు పీహెచ్‌సీల పరిధిలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జూనియర్ కాలేజీలకు వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించి, పిల్లలకు ఆరోగ్య కార్డులు ఇస్తారు. ఏడాదికి రెండుసార్లు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.ఆరోగ్య సమస్యలు గుర్తిస్తే వెంటనే పిల్లలను ఆయా ఆసుపత్రులకు రిఫర్ చేయడంతో పాటు శస్త్రచికిత్సలు చేయిం చాల్సిన బాధ్యత వారిదే. 1.70 లక్షల మందికి వైద్య పరీక్షలు జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సుమారు 5లక్షల మంది పిల్లలు ఉండగా ఈ విద్యాసంవత్సరంలో సుమారు లక్షా 70 వేల మంది పిల్లలు, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పిల్లలకు వైద్య పరీక్షలు ఇలా.. అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లే బాలల నుంచి జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థుల వరకూ ప్రతిఒక్కరికీ కొన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. లోపాలను గుర్తిస్తే వెంటనే ఏలూరులోని జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రానికి (డీఈఐసీ) తరలించి, నిపుణులైన వైద్యులతో పరీక్షల అనంతరం అవసరమైతే ఆపరేషన్లు చేయిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా నలుగురు వైద్యులు, సైకాలజిస్టు, ల్యాబ్స్, పిల్లల మానసిక వికాసానికి ఆటగదులు వంటివి ఏర్పాటు చేశారు. పరీక్షలు ఇవే.. న్యూరల్ ట్యూబ్ లోపం, డౌన్స్ సిండ్రోమ్, గ్రహణం మొర్రి, పెదవి చీలిక, క్లబ్ ఫుట్, నడుం భాగం వృద్ధి లోపం, సంక్రమిక కంటిపొర, పుట్టుకతో వచ్చే చెవుడు, సంక్రమిక గుండె జబ్బులు, రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ, రక్తహీనత, విటమిన్ల లోపం, పోషకాహార లోపం, చర్మవ్యాధులు, రుమాటిక్ గుండె వ్యాధి, శ్వాసకోశ వ్యాధులు, పిప్పి పళ్లు, మూర్చ వ్యాధి, దృష్టి సమస్యలు, మేధోపరమైన అసమానత, వయసుకు అనుగుణంగా మాటలు రాకపోవటం, ఆటిజమ్, అభ్యసనా సమస్యలు, థలసీమియా వంటి 30 రకాల వ్యాధులకు పరీక్షలు చేస్తారు. పిల్లల్లో లోపాలు గుర్తించాలి పిల్లల శారీరక, మానసిక సమస్యలను తెలుసుకోవాలి. ఇంట్లో తల్లీదండ్రీ పిల్లల సమస్యలపై శ్రద్ధ పెట్టాలి. పాఠశాలల్లో పిల్లల ఆరోగ్య సమస్యలను పరీక్షించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఏవైనా సమస్యలు ఉండి ఆపరేషన్లు అవసరమని గుర్తిస్తే ఆయా వైద్య నిపుణులకు రిఫర్ చేస్తాం. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు అవరోధాలుగా మారుతున్న ఆరోగ్య సమస్యలపై జాగ్రత్తలు వహించాల్సి ఉంది. జిల్లాలోని 30 బాల సురక్ష వాహనాల ద్వారా ఈ ఏడాది చివరి నాటికి ప్రతి విద్యార్థికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం.–కె.గణేష్, జిల్లా ఎగ్జిక్యూటివ్ -
ఆ జైలులో ఖైదీలకు హెచ్ఐవీ..!
గోరఖ్‌పూర్: యూపీలోని గోరఖ్‌పూర్ జైలులో ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించగా 23 మందికి హెచ్ఐవీ ఉన్నట్టు బయట పడింది. గత కొన్ని నెలలుగా వైద్యులు జిల్లా జైలులోని ఖైదీలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 23 మందికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. వైద్య పరీక్షలను యూపీ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బంది పర్యవేక్షణలోనే నిర్వహించామని జైలు అధికారలు తెలిపారు. హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేలిన 23 మంది ఖైదీల్లో ఓ మహిళ కూడా ఉందన్నారు. వారంతా ప్రస్తుతం బీఆర్డీ వైద్య కాలేజీలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. హెచ్ఐవీ సోకిన వారంతా విచారణ ఖైదీలని.. అసలు హెచ్ఐవీ సోకడానికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. దీంతో పాటు జిల్లా జైలులో ఎక్కువ మంది ఖైదీలకు హై బీపీ, మధుమేహం సమస్యలున్నాయని వెల్లడైనట్టు తెలిపారు. ఎయిడ్స్ బాధిత ఖైదీలకు కౌన్సెలింగ్ చేస్తున్నామని వివరించారు. మరోవైపు యూపీలోని అన్ని జైళ్లలో ఇలాంటి ఖైదీలను గుర్తించి, సంబంధిత నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జైళ్ల శాఖ ఐజీ ప్రమోద్ కుమార్ మిశ్రా తెలిపారు. ఇటీవలే ఉన్నావో జిల్లా, బంగార్మావు తాలూకా పరిధిలోని మూడు గ్రామాల్లో 58 మందికి హెచ్ఐవీ సోకినట్టు వైద్యులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. -
నేత్ర వైద్య శిబిరం విజయవంతం
మేదరమెట్ల: మండలంలోని మేదరమెట్లకు చెందిన యర్రం చినపోలిరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక యర్రం చినపోలిరెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. వైద్యశిబిరంలో 221 మంది కంటి పరీక్షలు చేయించుకోగా వారిలో 150 మందిని ఆపరేషన్లకు సిఫార్సు చేశారు. ఆపరేషన్లు చేసేందుకు పెదకాకాని శంకర కంటి ఆసుపత్రి సిబ్బంది ఆదివారం రోగులను తమ వాహనాల్లో తీసుకెళ్తారని నిర్వాహకులు తెలిపారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఆవరణలోని యర్రం చినపోలిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వైద్యశాల ఆవరణలో మొక్కలు నాటారు. తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ఈ వైద్యశాలకు ఎలాంటి సౌకర్యాలు అవసరమైనా తన దృష్టికి తీసుకురావాలని వైద్యులకు సూచించారు. గత జన్మభూమి కార్యక్రమం సందర్భంగా కంటి పరీక్షలు చేసిన 150 మందికి కళ్లజోళ్లు ఇవ్వలేదని, వారికి కళ్లజోళ్లు ఇచ్చేందుకు దాతల కోసం ఎదురుచూస్తున్నామని తెలపడంతో వాటిని తన సొంత ఖర్చుతో అందజేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఆస్పత్రికి కావలసిన సౌకర్యాలను తాను సంబంధిత మంత్రితో మాట్లాడి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త బాచిన చెంచుగరటయ్య మాట్లాడుతూ చినపోలిరెడ్డి ఎంతో మంది రైతులకు ఆదర్శవంతంగా ఉండేవారని, గ్రామాభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడిన వ్యక్తి అని కొనియాడారు. వైవీ భద్రారెడ్డి మాట్లాడుతూ తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన వైద్యశాల ఉన్నతికి తమ వంతు ఆర్థిక సాయాన్ని అందించడంలో ఎప్పుడూ ముందుంటామన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు కేవీ.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, జువ్వి రాము, జజ్జర ఆనందరావు, తాళ్లూరు జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి, వంపుగుడి శ్రీనివాసరావు, పేరం నాగలక్ష్మీ, రామిరెడ్డి ఆదిరెడ్డి, ఎస్.రమణమ్మ, డాక్టర్ అవినాష్, డాక్టర్ జే.ఉమ, రవికాంత్, నాగలక్ష్మి, కాలీషా, రామకోటేశ్వరరావు, అద్దంకి బధిరుల పాఠశాల సిబ్బంది, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. -
అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం
–ఏఎస్పీ శరత్‌బాబు నెల్లూరు(క్రై మ్): పోలీసు అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని జిల్లా అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు అన్నారు. స్థానిక ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నెల్లూరు నగర పోలీసు అధికారులు, పీఎంపీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో అగర్వాల్ కంటివైద్యశాల, విజయకేర్హాస్పిటల్, మాధవ్స్ డయాబిటెక్ కేర్ సెంటర్ల సహకారంతో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ సమాజంలో అంతర్గత శాంతిభద్రలను కాపాడడంలో ఒక్కోసారి తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఎంచుతూ అశువులు బాస్తున్నారన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయసాధనకు అందరం నడుంబిగిద్దామన్నారు. అనంతరం పోలీసు సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు ప్రముఖ వైద్యులు డాక్టర్ శివప్రతాప్రెడ్డి, పి.మాధవ్, పి.విజయకుమార్, జి ఎల్ అన్నపూర్ణలు మధుమేహం, కంటి, గుండె సంబంధిత వ్యాధులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీచేశారు. అడిషినల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ రమాదేవి, పీఎంపీ జిల్లా అధ్యక్షుఢు శాఖవరపు వేణుగోపాల్, నెల్లూరు నగర, ఏఆర్ డీఎస్పీలు జి. వెంకటరాముడు, చెంచురెడ్డి, రెండు, మూడు, నాలుగు, ఐదోనగర ఇన్స్పెక్టర్లు కె.రామకృష్ణారెడ్డి, జి. రామారావు, సీహెచ్ సీతారామయ్య, మంగారావు, ఏపీ పోలీసు అధికారుల సంఘం జిల్లా అద్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు పాల్గొన్నారు -
‘గీతం’ ఆధ్వర్యంలో హెల్త్‌క్యాంప్
పటాన్చెరు: మండల పరిధిలోని రుద్రారంలో గీతం యూనివర్సిటీ విద్యార్థులు పేదల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. గీతం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మహేశ్వర మెడికల్ కాలేజీ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం కొనసాగింది. ప్రాథమిక వైద్య సేవలను నిర్వహించి ఉచితంగా మందులను, సలహాలను అందించారు. గీతం ఎన్ఎస్ఎస్ విభాగాధిపతి డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ మొత్తం 30 మంది విద్యార్థులు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారని తెలిపారు. గ్రామస్తులు వైద్య శిబిరాన్ని చక్కగా సద్వినియోగించుకున్నారని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి మందులు అందించామన్నారు. ఈఎన్టీ, ఆప్తాలమాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపారు. గీతం ఆధ్వర్యంలో మరిన్ని సేవలు సమాజానికి అందిస్తామన్నారు. -
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
హాలియా : పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నోముల నర్సింహ్మయ్య అన్నారు. యోగ బ్రహ్మ శ్రీరుషి ప్రభాకర్ గురూజీ జయంతి సందర్భంగా ఎస్ఎస్వై ధ్యాన మండలి ఆధ్వర్యంలో గురువారం హాలియాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యోగ చేయడం ద్వారా మనిషి శారీరక రుగ్మతలు దూరమవుతాయన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకట్, సైదులు, లింగారెడ్డి, రవికుమార్, విజయేందర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ముత్యాలు, లింగారెడ్డి, యాదగిరి, సక్రునాయక్, రాఘవేంద్ర, శంకర్, మాల్యాద్రి, శంకరయ్య, శేఖర్, శివయ్య, సామ్యేల్, బ్రహ్మానందరెడ్డి, రాంబాబు, లక్ష్మయ్య, బాలరాజు, శ్రీనివాస్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
లోపలను సరిదిద్దుతున్నాం
పుష్కర శిబిరాల్లో 2.20 లక్షల మందికి పరీక్షలు ‘సాక్షి’తో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకురాలు అరుణకుమారి విజయవాడ(లబ్బీపేట) : కృష్ణా, గుంటూరు జిల్లాలో పుష్కరఘాట్లు, వార్డుల్లో 2.20 లక్షల మంది యాత్రికులకు వైద్య సేవలందించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకురాలు (డైరెక్టర్ ఆఫ్ హెల్త్) డాక్టర్ అరుణకుమారి చెప్పారు. వారిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిలో 215 మందిని చేర్చి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 3 వేల మందికిపైగా వైద్యులు, సిబ్బంది పని చేస్తున్నట్లు వివరించారు. పాత ప్రభుత్వాస్పత్రిలోని వైద్య ఆరోగ్యశాఖ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లో పుష్కరాల్లో అందిస్తున్న వైద్య సేవలను ఆమె సాక్షికి వివరించారు. లోపాలను సరిదిద్దుకుంటున్నాం.. తొలుత వైద్య శిబిరాలు ఏర్పాటులో కొన్ని లోపాలు గుర్తించాం, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రథమ చికిత్స, ఫస్ట్‌లెవల్ రిఫరల్ సెంటర్, ప్రత్యేక వార్డులు అనే మూడంచెల వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. మందులు సిద్ధంగా ఉంచాం.. అన్ని వైద్య శిబిరాల్లో మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాం. కుక్క, పాము కాటుకు కూడా మందులు సిద్ధం ఉంచినట్లు పేర్కొన్నారు. ఆయాసంతో వచ్చిన వారికోసం నెబిలేజర్స్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం సిలిండర్స్ అవసరం లేకుండా గాలిలోని ఆక్సిజన్‌ను సేకరించి రోగులకు అందించే‘ ఆక్సిజన్ కాన్సన్ట్రేట్’ పరికరాలు ఫస్ట్‌లెవల్ రిఫరల్ సెంటర్లో అందుబాటులోఉంచినట్లు ఆమె తెలిపారు. శిబిరాలకు ఆస్తమా, దగ్గు, జలుబు, జ్వరంతో ఎక్కువ మంది వస్తున్నారని వివరించారు. సేవలను పుష్కరాల ముగిసే వరకు పూర్తి స్థాయిలో అందిస్తామని డాక్టర్ అరుణకుమారి వివరించారు. -
రేపు గుండెజబ్బుల వైద్య శిబిరం
– ఇంగ్లాండ్‌కు చెందిన 11 మంది వైద్య బృందం రాక – స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యాన ఆత్కూరులో – మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడి విజయవాడ(లబ్బీపేట) : స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యాన ఆంధ్రా హాస్పటల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకే చారిటీ సహకారంతో ఈ నెల 7న ఆదివారం ఆత్కూరులో మెగా గుండె వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఈ శిబిరంలో పుట్టుకతో గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పెద్దలకు వైద్యపరీక్షలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సూర్యారావుపేటలోని ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కామినేని మాట్లాడుతూ ఇంగ్లాండుకు చెందిన 11 మంది పిల్లల గుండెజబ్బుల వైద్య బృందంతోపాటు, ఆంధ్రా హాస్పటల్స్ వైద్యులు ఈ వైద్య శిబిరంలో సేవలు అందిస్తారని తెలిపారు. గుండె జబ్బుల స్క్రీనింగ్ పరీక్షలు, ఎకో కార్డియోగ్రామ్, రక్తపరీక్షలు ఉచితంగా నిర్వహించడంతోపాటు, శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఇంగ్లాండు వైద్య బృందం ఉచితంగా చేస్తుందన్నారు. ఈ శిబిరాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. 8 నుంచి 12 వరకు ఆంధ్రా హాస్పటల్లో ఉచిత గుండె శస్త్ర చికిత్సలు ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో చిన్నపిల్లలకు ఇంగ్లాండు వైద్య బృందంతో ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా హాస్పటల్స్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ పీవీ రమణమూర్తి చెప్పారు. ఈ సమావేశంలో ఆస్పత్రి పీడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ యలమంచిలి రాజారావు, కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ, కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ దిలీప్ పాల్గొన్నారు. -
వసతిగృహాల్లో వైద్య శిబిరం
చిట్యాల : మండలంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల, బాలుర వసతి గృహాలు, బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం ఒడితల పీహెచ్సీ డాక్టర్ జడల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ నెల 23న ‘హాస్టల్లో ప్రబలుతున్న జ్వరాలు’ అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. దీనికి స్పందించిన హాస్టల్ మ్యాట్రిన్ ప్రశాంతి చిట్యాల, జూకల్లులోని బాలికల హాస్టళ్లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిం చారు. 99 మంది బాలికలకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 10 మంది జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు డాక్టర్ శ్రీనివాస్, మ్యాట్రి న్ ప్రశాంతి తెలిపారు. అలాగే మండల కేంద్రంలోని ఎస్సీ, బిసీ బాలుర హాస్టళ్లు, వెలు గు గురుకుల కళాశాలలో వైద్యశిబిరం నిర్వహించి 145 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామని డాక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జయ శ్రీ, వార్డెన్లు రాంరెడ్డి, కిషన్‌రావు, ఏపీఎంఓ బుచ్చినర్సయ్య, హెచ్ఈఓ రాజు, హెల్త్ అసిస్టెంట్లు సాంబయ్య, సుభద్ర, ఆరోగ్యమిత్ర వంగ భిక్షపతి పాల్గొన్నారు. -
అది విష జ్వరాల గ్రామం..
బలిజపేట(విజయనగరం జిల్లా): విజయనగరం జిల్లా బలిజపేట మండలం నారాయణపురం గ్రామంలో ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారు. గత కొద్ది రోజులుగా గ్రామంలో దాదాపు 100మందికి పైగా విషజ్వరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి హెల్త్ క్యాంప్ కార్యక్రమాలు చేపట్టక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో చేసేదేంలేక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించడంతో వారు ప్రజలను దోచుకుంటున్నారు. కాగా, ఇదే గ్రామంలో విషజ్వరాల కారణంగా ఆరోగ్య శాఖ అధికారులు పది రోజుల క్రితం ఒక హెల్త్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి శాంపిల్స్‌ను సేకరించారు. కాగా, ఇప్పటి వరకు ఆ శాంపిల్స్‌కు సంబంధించిన ఫలితాలను అధికారులు వెలువరించలేదు. అంతేకాకుండా ఇప్పటి వరకు గ్రామంలోని ప్రజలకు ఎలాంటి మందులను కూడా అధికారులు అందించలేదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మాత్రం మలేరియా, టైపాయిడ్ సోకినట్లుగా వైద్యులు తేల్చారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి వైద్య సేవలు అందించాలని గ్రామస్తులు వాపోతున్నారు. -
విష జ్వరాల బారిన ఆ గ్రామం..
ముల్కలపల్లి(ఖమ్మం జిల్లా): ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలం పూసుగూడెం గ్రామం విష జ్వరాల బారిన పడింది. గ్రామంలోని పలువురు విష జ్వరాలు రావడంతో సమీపంలోని పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి తదితర ప్రాంతాల్లో వైద్యం చేయించుకుంటున్నారు. దీంతో గ్రామంలో మంగళవారం నుంచి ప్రభుత్వం హెల్త్‌క్యాంప్‌ను నిర్వహిస్తోంది. ఈ హెల్త్‌క్యాంప్‌ను, సంబంధిత గ్రామాన్ని బుధవారం అడిషనల్ డీఎమ్ అండ్ హెచ్‌వో పుల్లయ్య సందర్శించారు. గ్రామంలో ప్రజలు పరిశుభ్రత పాటించాలని తద్వారా ఆనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆయన సూచించారు. -
నల్లగొండలో ఉచిత వైద్యశిబిరం
నల్లగొండ: గ్లోబల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్లో ఈ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. -
ప్రాణాంతక శస్త్రచికిత్సలు
దశాబ్దాలు గడుస్తున్నా మన దేశంలో కుటుంబ నియంత్రణ కోసం నిర్దేశిస్తున్న లక్ష్యాలు పేద జనాలకూ, మరీ ముఖ్యంగా ఆ వర్గంలోని మహిళలకూ ప్రాణాంతకంగానే ఉంటున్నాయని ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శిబిరంలో జరిగిన విషాదకర ఉదంతం రుజువు చేస్తున్నది. ఆ రాష్ట్రంలోని బిలాస్పూర్లో 85 మంది మహిళలకు నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు వికటించి సోమవారం 10మంది మరణించగా, వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 40 మంది మహిళల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని అక్కడినుంచి అందుతున్న సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది. శిబిరం నిర్వహించిన నలుగురు వైద్యులు కేవలం ఆరు గంటల వ్యవధిలో ఈ 85మందికీ ఆపరేషన్లు చేయడం, దాదాపు ఈ ఆపరేషన్లన్నిటికీ ఒకసారి వాడిన కత్తెరలు, సూదులు, బ్లేడ్లవంటి సామగ్రిని మళ్లీ మళ్లీ ఉపయోగించడం దిగ్భ్రాంతిగొలిపే విషయాలు. ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి అమర్ అగర్వాల్ సొంత జిల్లాలోనే ఇలాంటి ఉదంతం చోటు చేసుకున్నదంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. బాధితులంతా వెనకబడిన ప్రాంతంలోని గ్రామాలకు చెందినవారు కావడం, వారంతా దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారే కావడం యాదృచ్ఛికం కాదు. నానాటికీ పెరుగుతున్న జనాభాను అదుపుచేయడం కోసం అమలు చేస్తున్న కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు మొదటినుంచీ పేద వర్గాలను లక్ష్యంగా చేసుకునే సాగుతున్నాయి. 1975లో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో దేశమంతా...మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ శస్త్ర చికిత్సలు విచ్చలవిడిగా సాగాయి. పెళ్లికాని యువతీ యువకులను సైతం బలవంతంగా శిబిరాలకు రప్పించి, వారికి శస్త్రచికిత్సలు చేశారని వెల్లడైనప్పుడు అందరూ నిర్ఘాంత పోయారు. నిర్దిష్ట గడువు విధించి అధికార యంత్రాంగానికి లక్ష్య నిర్దేశం చేయడంవల్లనే ఈ దారుణాలన్నీ చోటుచేసుకున్నాయని, ఇకపై దీన్ని మారుస్తామని అనంతర కాలంలో పాలకులు హామీ ఇచ్చారు. ‘కుటుంబ నియంత్రణ’ కాస్తా ‘కుటుంబ సంక్షేమం’ అయింది. ప్రజల్ని చైతన్యవంతులను చేయడంద్వారా, వారికి చిన్న కుటుంబంవల్ల కలిగే లాభాలను వివరించడం ద్వారా, వారి స్వచ్ఛంద అనుమతితోనే ఈ కార్యక్రమాన్ని చేపడతామన్న మాటలూ వినిపించాయి. కానీ క్షేత్రస్థాయిలో అప్పటినుంచీ పెద్దగా మారిందేమీ లేదని అడపా దడపా వస్తున్న వార్తలు చెబుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు టార్గెట్లు విధించడం ఆగలేదు. ఆ టార్గెట్లు అక్కడినుంచి మళ్లీ కింది స్థాయికి వెళ్లడమూ మానలేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకయ్యే వ్యయాన్నంతా భరిస్తున్న కేంద్రం...అందుకోసం రాష్ట్రాల్లో ఎలాంటి విధానాలను అవలంబిస్తున్నారో సరిగా పర్యవేక్షిస్తున్నట్టులేదు. బలప్రయోగం చేయకపోవచ్చుగానీ... శస్త్ర చికిత్స చేయించుకున్నపక్షంలో డబ్బు ముట్టజెబుతామని, వారిని తీసుకొచ్చే ఆరోగ్య కార్యకర్తలకు మరికొంత ఇస్తామని చెబుతూ సాగించే ఈ తతంగం నిరుపేద ల జీవితాల్లో సంక్షోభాన్ని సృష్టిస్తున్నది. బిలాస్పూర్ ఆరోగ్య శిబిరం విషయమే తీసుకుంటే ఆ శిబిరంలో శస్త్ర చికిత్స చేయించుకోవడానికి వచ్చిన మహిళకు రూ. 1,400, ఆమెను తీసుకొచ్చిన ఆరోగ్య కార్యకర్తకు రూ. 200 చొప్పున అందజేశారు. ఆకలి, అనారోగ్యం, పోషకాహారలేమితో ఇబ్బందులు పడే నిరుపేద గ్రామీణుల దగ్గరకెళ్లి ఇంత డబ్బు వస్తుందని ఆశపెడితే సహజంగానే ఇళ్లల్లోని మహిళలపై ఒత్తిళ్లు మొదలవుతాయి. ఇలాంటి శస్త్ర చికిత్సలు పురుషులు చేయించుకోవడమే ఉత్తమమని, వారైతే కొన్ని గంటల వ్యవధిలోనే తమ పనులు తాము యథావిథిగా చేసుకునే వీలుంటుందని నచ్చజెప్పేవారుండరు. చెప్పినా వినే పరిస్థితీ ఉండదు. చివరకు ఈ భారం మహిళలపైనే పడుతుంది. పదిహేనేళ్ల క్రితం రూపొందించిన జాతీయ జనాభా విధానం... పునరుత్పత్తికి సంబంధించిన సేవలు పురుషులకు ‘చాలా తక్కువ’గా అందుతున్నాయని తేల్చింది. దీన్ని సరిచేస్తే ఆ మేరకు మహిళల ఆరోగ్యం కుదుటపడుతుందని అభిప్రాయపడింది. కానీ, ఇన్నేళ్లు గడిచినా ఆ పరిస్థితి కాస్త కూడా మారలేదు. హార్మోన్ల హెచ్చుతగ్గులు, ఇతర శారీరక సమస్యల కారణంగా అసలే ఇబ్బందులు పడే మహిళలు అపరిశుభ్ర వాతావరణంలో జరిగే ఇలాంటి ఆపరేషన్లవల్ల మృత్యువుకు చేరువవుతున్నారు. బిలాస్పూర్లో శస్త్రచికిత్సలు చేయించుకున్న మహిళలకు రక్తహీనత ఉన్నదని, శస్త్ర చికిత్స సమయంలో అయిన గాయాలు సెప్టిక్ అయి వారి ఆరోగ్యం క్షీణించి మరణించారని వైద్యులు చెబుతున్నారు. రోజూ ఇంటిల్లిపాదికీ వండివార్చే మహిళ పౌష్టికాహార లోపంతో, రక్తహీనతతో బాధపడుతున్నదని యునిసెఫ్ నివేదికలు చెబుతున్నాయి. దాదాపు 70 శాతంమంది మహిళలు భారత్‌లో ఇలాంటి స్థితిని ఎదుర్కొంటున్నారని, అందువల్లే నిరుడు గర్భధారణ, ప్రసవ సమయాల్లో 50,000మంది మహిళలు మరణించారని ఐక్యరాజ్యసమితి ఇటీవలి నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాము శస్త్ర చికిత్సలు చేయబోయే నిరుపేద మహిళల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నదో చూడవలసిన కనీస బాధ్యత వైద్యులపై ఉంటుంది. లక్ష్యాలను త్వరగా సాధించాలన్న తొందరో, మరేమోగానీ బిలాస్పూర్లో ఇలాంటి ప్రాథమిక జాగ్రత్తలేవీ తీసుకోలేదని అర్థమవుతున్నది. ఈ ఉదంతానికి కారకులైన నలుగురు వైద్యులను సస్పెండ్ చేశామని ఛత్తీస్‌గఢ్ సర్కారు చెబుతోంది. బాధిత కుటుంబాలకు పరిహారమూ ప్రకటించింది. మరి పాలకుల నైతిక బాధ్యత మాటేమిటి? స్వచ్ఛందంగా సాగుతున్నదనుకుంటున్న ఈ కార్యక్రమంలోని లొసుగులను గుర్తించి, జనాభా నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలను పునస్సమీక్షించడం అవసరమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది.