రేపు గుండెజబ్బుల వైద్య శిబిరం
రేపు గుండెజబ్బుల వైద్య శిబిరం
Published Fri, Aug 5 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
– ఇంగ్లాండ్‌కు చెందిన 11 మంది వైద్య బృందం రాక
– స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యాన ఆత్కూరులో
– మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడి
విజయవాడ(లబ్బీపేట) :
స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యాన ఆంధ్రా హాస్పటల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకే చారిటీ సహకారంతో ఈ నెల 7న ఆదివారం ఆత్కూరులో మెగా గుండె వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఈ శిబిరంలో పుట్టుకతో గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పెద్దలకు వైద్యపరీక్షలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సూర్యారావుపేటలోని ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కామినేని మాట్లాడుతూ ఇంగ్లాండుకు చెందిన 11 మంది పిల్లల గుండెజబ్బుల వైద్య బృందంతోపాటు, ఆంధ్రా హాస్పటల్స్ వైద్యులు ఈ వైద్య శిబిరంలో సేవలు అందిస్తారని తెలిపారు. గుండె జబ్బుల స్క్రీనింగ్ పరీక్షలు, ఎకో కార్డియోగ్రామ్, రక్తపరీక్షలు ఉచితంగా నిర్వహించడంతోపాటు, శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఇంగ్లాండు వైద్య బృందం ఉచితంగా చేస్తుందన్నారు. ఈ శిబిరాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని తెలిపారు.
8 నుంచి 12 వరకు ఆంధ్రా హాస్పటల్‌లో ఉచిత గుండె శస్త్ర చికిత్సలు
ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో చిన్నపిల్లలకు ఇంగ్లాండు వైద్య బృందంతో ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా హాస్పటల్స్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ పీవీ రమణమూర్తి చెప్పారు. ఈ సమావేశంలో ఆస్పత్రి పీడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ యలమంచిలి రాజారావు, కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ, కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ దిలీప్ పాల్గొన్నారు.
Advertisement