అవ్వాతాతల కంటికి వెలుగు | YSR Kanti Velugu Eye Tests For Elderly People In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అవ్వాతాతల కంటికి వెలుగు

Published Mon, Aug 29 2022 3:47 AM | Last Updated on Mon, Aug 29 2022 2:30 PM

YSR Kanti Velugu Eye Tests For Elderly People In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: మలిసంధ్యలో కంటిచూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు ‘డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు’ కార్యక్రమం చూపు ప్రసాదిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా 60ఏళ్లు పైబడిన వృద్ధులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. చూపు సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి మందులు, కళ్లద్దాలు అందించడంతో పాటు, కేటరాక్ట్‌ సర్జరీలు ఉచితంగా చేస్తోంది.

రాష్ట్రంలోని 5.60 కోట్ల మందికి కంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేయాలనే ఉద్దేశ్యంతో వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ 2019 అక్టోబర్‌ 10న శ్రీకారం చుట్టారు. ఆరు దశల్లో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా తొలి రెండు దశల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న 66.17 లక్షల మంది పిల్లలకు వైద్య పరీక్షలు చేశారు. వీరిలో 1.58 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయడంతో పాటు, 300 మందికి పైగా పిల్లలకు సర్జరీలు చేశారు.  

22.16 లక్షల మందికి పరీక్షలు 
ఇక మూడో దశలో.. 60 ఏళ్లు పైబడిన 56,88,424 మంది వృద్ధులకు కంటి పరీక్షలు చేయాలన్న లక్ష్యంతో 2020 ఫిబ్రవరిలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వీరిలో ఇప్పటివరకూ 22,16,031 మందికి పరీక్షలు పూర్తయ్యాయి. ఇందులో 10,42,457 మందికి మందుల ద్వారా నయమయ్యే సమస్యలున్నట్లు గుర్తించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 10,01,049 మందికి కళ్లద్దాలు అవసరం ఉండగా 8,31,584 మందికి పంపిణీ పూర్తయింది.

అలాగే, 1,69,105 మంది వృద్ధులు శుక్లాల సమస్యతో బాధపడుతున్నట్లు వైద్య బృందాలు గుర్తించి వీరికి ప్రభుత్వమే ఉచితంగా కేటరాక్ట్‌ సర్జరీలు చేపడుతోంది. ఈ కార్యక్రమ నిర్వహణలో ఉమ్మడి విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే తొలిస్థానంలో ఉంది. ఈ జిల్లాలో 1.52 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా 53.72 శాతం మందికి పూర్తయ్యాయి. అలాగే, 50.88 శాతం మందికి పరీక్షలు నిర్వహించి ఉమ్మడి వైఎస్సార్, 50.66 శాతంతో శ్రీకాకుళం జిల్లాలు తర్వాత స్థానంలో ఉన్నాయి.  

ఈ ఆస్పత్రులు వెరీ పూర్‌ 
కేటరాక్ట్‌ సర్జరీల నిర్వహణలో రాష్ట్రంలోని పలు ప్రభుత్వాస్పత్రులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తుంటే, మరికొన్ని ఆస్పత్రుల్లో అంతంతమాత్రంగానే సర్జరీలు జరుగుతున్నాయి. డీఎంఈ పరిధిలోని ఆస్పత్రులను పరిశీలిస్తే.. ఈనెల 15 నుంచి 21 మధ్య వారం రోజుల్లో 41 సర్జరీలతో విశాఖపట్నం రీజనల్‌ కంటి ఆస్పత్రి తొలిస్థానంలో ఉంది.

కర్నూలు రీజినల్‌ కంటి ఆస్పత్రిలో 35 సర్జరీలు,  గుంటూరు జీజీహెచ్‌లో 30 సర్జరీలు నిర్వహించారు. మరోవైపు.. ఎనిమిది మంది సర్జన్స్‌ ఉన్నప్పటికీ అనంతపురం జీజీహెచ్‌లో ఒక్క సర్జరీ కూడా నిర్వహించలేదు. ఇక వైద్య విధాన పరిషత్‌ విభాగంలో.. ఏలూరు జిల్లా ఆస్పత్రి 61 సర్జరీలు నిర్వహించి రాష్ట్రంలోనే తొలిస్థానంలో ఉంది. ఇదే విభాగంలోని గూడూరు, రామచంద్రాపురం, నరసరావుపేట, పాలకొల్లు, తణుకు, పాడేరు ఏరియా ఆస్పత్రులు, మార్కాపురం జిల్లా ఆస్పత్రిలో వారం రోజుల్లో ఒక్క సర్జరీ కూడా నిర్వహించలేదు.

ఉచితంగా ఆపరేషన్‌ చేశారు 
నేను చేనేత కార్మికుడిని. కంటిచూపు మందగించడంతో కంటి వెలుగు కింద ప్రభుత్వం ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తోందని తెలిసింది. మా గ్రామంలో శిబిరం ఏర్పాటుచేసినప్పుడు పరీక్ష చేయించుకున్నాను. శుక్లాలు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రభుత్వం ఇటీవలే కంటికి ఉచితంగా ఆపరేషన్‌ చేయించింది. ఇప్పుడు బాగా కనిపిస్తోంది. 
– సీహెచ్‌ మల్లికార్జునరావు, వీరులపాడు, ఎన్టీఆర్‌ జిల్లా 

వేగంగా పూర్తిచేయడానికి చర్యలు
వృద్ధులందరికీ కంటి పరీక్షలు వేగంగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. వారం వారం కార్యక్రమంపై సమీక్షలు నిర్వహిస్తున్నాం. మందకొడిగా పరీక్షలు, సర్జరీలు జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాం. 
– డాక్టర్‌ యు. స్వరాజ్యలక్ష్మి, ప్రజారోగ్య సంచాలకులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement