సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ నిధుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. జ్యుడిషియల్ ప్రివ్యూ పూర్తి చేసుకుని టెండర్లు నిర్వహించిన కాలేజీల్లో వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో మెడికల్ కాలేజీల కోసం భూ సేకరణ, నిధుల కేటాయింపుల్లో జాప్యం జరగకుండా కలెక్టర్లతో చర్చించాలని అధికారులకు సూచించారు.
వైద్య, ఆరోగ్య రంగం, కుటుంబ సంక్షేమశాఖలో నాడు–నేడు, వైఎస్సార్ కంటి వెలుగు పథకాలపై సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నాడు – నేడు కింద వైద్య, ఆరోగ్య రంగంలో చేపట్టిన అన్ని పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, బోధనాస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, సదుపాయాలు మెరుగుపరిచి తగినంత మంది సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం మెడికల్ కాలేజీలకు సంబంధించి టెండర్లు అవార్డు అయ్యాయని, మిగిలిన 12 మెడికల్ కాలేజీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఈ నెల 21వ తేదీ లోగా ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
3,90,479 మంది అవ్వా తాతలకు ఉచితంగా కళ్లజోళ్లు
వైఎస్సార్ కంటి వెలుగు పథకం అమలులో ఎటువంటి జాప్యం జరగకూడదని సీఎం జగన్ ఆదేశించారు. కంటి వెలుగు కింద అవ్వాతాతలకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయడంతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. కంటి వెలుగు పథకం మూడో విడతలో భాగంగా 8,09,262 మంది అవ్వాతాతలకు నేత్ర పరీక్షలు నిర్వహించి 3,90,479 మందికి ఉచితంగా కళ్లద్దాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో 41,193 మందికి ఆపరేషన్లు పూర్తయ్యాయని, ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతోందని వివరించారు.
సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్‌ఐడీసీ వైస్ చైర్మన్, ఎండీ విజయరామరాజు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లికార్జున్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment