సాక్షి, హైదరాబాద్: ‘కంటి వెలుగు’ పథకాన్ని అత్యధికంగా బడుగు, బలహీన వర్గాలే ఉపయోగించుకున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కార్యక్రమంపై అధికారులు శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిప్రకారం 99.41 శాతం గ్రామాల్లో ‘కంటి వెలుగు’ పూర్తయింది. 9,873 గ్రామాల్లో ‘కంటి వెలుగు’ శిబిరాలు నిర్వహించారు. మొత్తం 1.54 కోట్ల మంది ప్రజలు ఈ పథకం కింద నేత్ర పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 90.25 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలే ఉన్నారని నిర్ధారించారు. 9.75 శాతం మంది ఓసీలు ఉపయోగించుకున్నట్లు తేల్చారు. అత్యధికంగా బీసీలు 89.87 లక్షల (58.12%) మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఎస్సీలు 16.60 శాతం, ఎస్టీలు 11.02 శాతం, మైనారిటీలు 4.51 శాతం ఉపయోగించుకున్నారు.
22.91 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు
గత ఆగస్టు 15న కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. 7 నెలల పాటు కొనసాగి విజయవంతంగా ముగిసింది. కోటిన్నర మందికిపైగా కళ్లల్లో వెలుగులు నింపిన ఈ కార్యక్రమం రెట్టింపు స్థాయిలో విజయవంతమైందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా 9 గ్రామాలు, 8 మున్సిపల్ వార్డుల్లో కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 828 బృందాలు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. నేత్ర పరీక్షలు చేయించుకున్నవారిలో దృష్టి సమస్యలున్న 22.91 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు అందించారు. ఇక చత్వారం ఉన్నవారు 18.13 లక్షలుండగా, వారిలో ఇప్పటివరకు 9.70 లక్షల మందికి కళ్లజోళ్లు అందజేశారు. మరో 8.42 లక్షలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. పరీక్షలు చేయించుకున్నవారిలో 1.04 కోట్ల మందికి ఎటువంటి కంటి సమస్యలు లేవని నిర్ధారణ అయింది.
9.3 లక్షల మందికి ఆపరేషన్లు
కంటి పరీక్షల అనంతరం 9.30 లక్షల మందికి ఆపరేషన్లు, ఇతరత్రా ప్రత్యేక వైద్యం అవసరమని వైద్యులు నిర్ధారించారు. మొదట్లో ఆపరేషన్లు చేయాలని భావించినా అసెంబ్లీ ఎన్నికల కారణంగా నిలిపివేశారు. అప్పుడు ఒకట్రెండు చోట్ల చేపట్టిన కంటి ఆపరేషన్లు వికటించాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఆపరేషన్లపై అధికారులు ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు.
బలహీనవర్గాల కళ్లలో ‘వెలుగు’
Published Sun, Mar 24 2019 3:51 AM | Last Updated on Sun, Mar 24 2019 3:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment